Ysrcp Mla Vara Prasad Meet Pawan Kalyan: వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేల బదిలీల సంప్రదాయానికి తెరలేపితే.. టిక్కెట్ దక్కని నేతలంతా తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇప్పటివరకూ నోరు మెదపని నేతలంతా ఇప్పుడు బాహాటంగానే అధినేత, పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కష్టకాలంలో జగన్ వెంట నడిస్తే.. ఇప్పుడు తమను మోసం చేశారంటూ మండిపడుతున్నారు. తాజాగా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్(Varaprasad) వైసీపీని వీడి జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను (Pawan Kalyan) కలిశారు. తిరుపతి( Tirupathi) నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉంటానని ప్రకటించిన వరప్రసాద్, ఏ పార్టీ నుంచి అనేది త్వరలోనే చెబుతానన్నారు.


అధిష్టానంపై అసంతృప్తి


గూడూరు వైసీపీ ఇన్‌ఛార్జీగా ఎమ్మెల్సీ మేరుగ మురళీ(Meruga Murali)ని నియమించడంపై స్థానిక ఎమ్మెల్యే వరప్రసాద్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ( Ycp)కి కష్టకాలంలో అండగా నిలిచానని.. పార్టీ తనకు ద్రోహం చేసింది తప్ప...తాను ఏనాడు పార్టీకి ద్రోహం చేయలేదని వాపోయారు. ప్రత్యేక హోదా కోసం జగన్ చెబితే మారుమాట్లకుండా పదవికి రాజీనామా చేశానని ఆయన గుర్తు చేశారు. ఎన్నడూ పార్టీ లైన్ దాటి మాట్లాడిన దాఖలాలు లేవని, కానీ తనకే టిక్కెట్ ఇవ్వకపోవడం తీవ్రంగా బాధించిందన్నారు. కనీసం తనను పిలిచి మాట్లాడినా గౌరవంగా ఉండేదని.. ఏ మాత్రం చెప్పకుండా వేరొకరిని ఇంఛార్జీగా నియమించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. వైసీపీలో దళితులకే ఇలాంటి అవమానాలు జరుగుతున్నాయని.. వేరే సామాజిక వర్గం వారిని మాత్రం పదిసార్లు పిలిపించుకుని బ్రతిమాలుకుంటున్నారని అన్నారు. ఎస్సీ ఎమ్మెల్యేలకు మాత్రం కనీసం సమాచారం ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేవలం ఎస్సీ ఎమ్మెల్యేలకే టిక్కెట్లు ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. అన్ని సర్వేల్లోనూ ఎస్సీ ఎమ్మెల్యేలే వెనకబడ్డారా అని ప్రశ్నించారు.


తిరుపతి ఎంపీగానే పోటీ


రానున్న ఎన్నికల్లో తిరుపతి(Tirupathi) ఎంపీగానే పోటీ చేస్తానన్న వరప్రసాద్‌.. ఏ పార్టీ నుంచి అనేది త్వరలోనే చెబుతానన్నారు. అయితే ఇటీవలే జనసేన అధినేత పవనకల్యాణ్‍(Pawan Kalyan) ఆయన కలిశారు. దాదాపు అరగంట పాటు జనసేనానితో చర్చించారు. దీంతో ఆయన జనసేన(Janasena)లో చేరడం దాదాపు ఖాయమైందని ప్రచారం సాగుతోంది. జనసేన తరఫున తిరుపతి( Tirupathi) ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆయన పవన్‌ను కోరినట్లు తెలుస్తోంది. అయితే తెలుగుదేశం( Tdp)తో పొత్తు కారణంగా సీట్ల వ్యవహారంపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని... కావున సీటు ఇవ్వడంపై హామీ ఇవ్వలేనని పవన్ చెప్పినట్లు తెలిసింది. పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామన్నారని తెలిసింది. అయితే స్థానిక వైసీపీ నేతలతో ఉన్న విభేదాల కారణంగానే జగన్ గూడూరు‍(Gudur)లో ఇంఛార్జీని మార్చినట్లు తెలుస్తోంది. వరప్రసాద్( Varaprasad) ఉంటే ఈసారి ఎన్నికల్లో సహకరించమని ఆయన ప్రత్యర్థులు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి సీటు రాకుండా చేశారని వరప్రసాద్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. అయితే పవన్‌ను కలిసినప్పుడు గూడూరు ఎమ్మెల్యే టిక్కెట్ అడగాలని భావించినా.. అక్కడ తెలుగుదేశానికి సునీల్ కుమార్ రూపంలో బలమైన అభ్యర్థి ఉన్నారు. దీంతో తాను గతంలో విజయం సాధించిన తిరుపతి ఎంపీ స్థానం వైపే మొగ్గు చూపారు. తెలుగుదేశంతో సీట్ల పంచాయితీ తెగితే కానీ తన టిక్కెట్ కన్ఫార్మ్ కాదని వరప్రసాద్ తన వర్గీయులకు తెలిపారు.