అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వేగంగా అమలు చేస్తున్నారు. అయితే  కీలకమైన టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ, ఐటీఐ, డిగ్రీ కళాశాల తదితర ముఖ్యమైన ప్రాజెక్టులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. త్వరలో అనుమతులు రాగానే యుద్ద ప్రాతిపాదిన పనులు మొదలు పెడతామని ఆమె తెలిపారు. ముఖ్యంగా హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా నియోజకవర్గంలోని చెరువులకు నీటిని  నింపి భూములను సస్య శ్యామలం చేస్తామని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి స్పష్టం చేశారు. 


కంగాటి శ్రీదేవి 2019 ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీచేసి డిప్యూటీ సీఎం, రాజకీయ కురువృద్దుడు కేఈ క్రిష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యామ్ బాబుపై భారీ మెజార్టీతో ఆమె విజయం సాధించారు. ఎలక్షన్స్ ముందు నియోజకవర్గంలోని సుదీర్ఘకాలం అమలుకు నోచుకోని వాటిని ఎమ్మెల్యే అయ్యాక తూచా తప్పకుండా అమలు చేసి పత్తికొండ నియోజక వర్గం రూపురేఖలనే మార్చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అయ్యాక మూడేళ్ల కాలంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా నియోజక వర్గంలోని నీటి సమస్యపై ఆమె ఫోకస్ పెట్టి దాదాపుగా నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 15 కోట్లకు పైగా నిధులతో రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టారు. కోటి రూపాయలతో పత్తికొండలోని లక్ష్మీ టాకీస్ వద్ద సీసీ రోడ్లు వేయించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద 40 లక్షల రూపాయలతో గుంతలమయమైన రోడ్లను పూడ్చేసి సీసీ రోడ్లు, టాయిలెట్స్ ను శానిటేషన్ తదితర పనులను వేగవంతంగా కంప్లీట్ చేయించారు. 


తుగ్గలి, మద్దికెర, జొన్నగిరి చెరువులను విస్తరణకు 36 కోట్ల రూపాయలతో శ్రీకారం చుట్టారు. చెరువుల విస్తీర్ణాన్ని 30 శాతం పెంచి వెడల్పు చేయించారు. ఎన్నికల హామీల్లో ముఖ్యంగా హంద్రీనీవా సుజల ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలోని చెరువులన్నింటిని నింపేందుకు, భూ సేకరణకు 100  కోట్ల రూపాయల నిధులతో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడాన్ని ఎమ్మెల్యే శ్రీదేవి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రెండున్నర ఏళ్లలో భూ సేకరణ కంప్లీట్ చేసి ఇటీవలే హాంద్రీనీవా నుంచి చెరువులకు నింపేందుకు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. దీంతో పత్తికొండ నియోజకవర్గంలోని చెరువులకు నీటిని నింపే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. 


బీసీ, ఎస్సీ బాలికల హాస్టల్ నిర్మాణాలు త్వరలోనే చేపడతామని ఎమ్మెల్యే శ్రీదేవి తెలిపారు. గతంలో కంటే ఎక్కువ అభివృద్ది జగన్ పాలనలోనే జరిందని ఆమె స్పష్టం చేశారు. సుదీర్ఘ కాలం నుంచి పరిష్కారానికి నోచుకోని టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ, ఐటీఐ, డిగ్రీ కళాశాల ఏర్పాటు విషయాన్ని సీఎం వైఎస్ జ గన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే శ్రీదేవి వెల్లడించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వీటికి గ్రీన్ సిగ్నల్ రాగానే పనులు మొదలు పెట్టేందుకు భూమిని కూడా సిద్దం చేశామన్నారు.


ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలతో పాటు మరికొన్ని కొత్త పనులు కూడా చేసి పత్తికొండను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే శ్రీదేవి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే శ్రీదేవి అధికారంలోకి వచ్చి మూడేల్లయినా కీలకమైన ప్రాజెక్టులకు ఇంకా నిర్మాణానికి అడుగులు పడలేదు. మిగిలిన రెండేళ్ల కాల వ్యవధిలో ముఖ్యమైన ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తారా లేదా 2024 ఎన్నికల నాటికి మధ్యలోనే ఉండిపోతాయా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది.