Mla Alla Ramakrishna Reddy Comments on Lavanya: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్తగా గంజి చిరంజీవి స్థానంలో మురుగుడు లావణ్యను వైసీపీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఈ అంశంపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి సీటును గెలిపించి జగనన్నకు కానుకగా ఇస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ టీడీపీకి మరోసారి భంగపాటు తప్పదు. 'మళ్లీ మళ్లీ చెప్తున్నా.. వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో వైసీపీ జెండా ఎగురవేస్తాం. లావణ్య రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆమె గెలుపు ఖాయం. 2024 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో నాన్ లోకల్, బీసీ అభ్యర్థుల మధ్యే పోటీ ఉంటుంది.' అని ఆర్కే పేర్కొన్నారు. కాగా, ఈ స్థానంలో టీడీపీ నుంచి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బరిలో నిలిచారు. ఓడిన చోటే మళ్లీ గెలిచి చూపించాలని పక్కా ప్రణాళికలు, విస్తృత ప్రచారాలతో లోకేశ్ హోరెత్తిస్తుండగా.. ఈసారి కూడా గెలిచి తమ సత్తా చాటాలని వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలో సీఎం జగన్ టీడీపీ కీలక స్థానాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అందుకు అనుగుణంగానే రాజకీయ వ్యూహాల్లో భాగంగా మంగళగిరిలో లావణ్యను బరిలో నిలిపారు.


లావణ్య రాజకీయ నేపథ్యం


లావణ్యకు పుట్టినింటి నుంచీ మెట్టినింటి వరకూ రాజకీయ నేపథ్యం ఉంది. లావణ్య తల్లి కాండ్రు కమల 2009 నుంచి 2014 వరకూ మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004 నుంచి 2009 వరకూ మంగళగిరి మున్సిపల్ ఛైర్ పర్సన్ గానూ పని చేశారు. లావణ్య మామ మురుగుడు హనుమంతరావు ప్రస్తుతం ఎమ్మెల్సీగా, ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ గా ఉన్నారు. అంతకు ముందు రెండుసార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతే కాకుండా, 2004లో వైఎస్ కేబినెట్ లోనూ పని చేశారు. మంగళగిరిలో ఈసారి కూడా పాగా వేయాలని చూస్తోన్న జగన్.. అందుకు అనుగుణంగా లావణ్యను బరిలో నిలిపినట్లు తెలుస్తోంది.


అటు, చంద్రబాబు, పవన్ పోటీ చేస్తున్న స్థానాల్లోనూ విజయం సాధించాలనే ఉద్దేశంతో పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కుప్పంపై ప్రత్యేక ఫోకస్ పెట్టి మంత్రి పెద్దరెడ్డికి కుప్పం బాధ్యతలు అప్పగించారు. అలాగే, జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న సమాచారంతో.. ఆయనకు దీటైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీలోకి తీసుకుని ఆయన్ను పవన్ కు పోటీగా నిలబెట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 


జాబితాల వారీగా..


వైసీపీ ఇంఛార్జ్‌ల తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇంఛార్జిలను జగన్ ప్రకటించారు. రెండో జాబితాలో మరో 27 స్థానాలకు (మూడు ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు (ఆరు ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగో లిస్టులో ఎనిమిది స్థానాలకు (ఒక ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ) ఇంఛార్జీలను ప్రకటించారు. ఐదో జాబితాలో ఏడు స్థానాలకు (3 అసెంబ్లీ, 4 ఎంపీ) కొత్త ఇంఛార్జిలను నియమించారు. 6వ జాబితాలో నాలుగు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జిలను ప్రకటిస్తూ వైసీపీ జాబితా విడుదల చేసింది. 7వ జాబితాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటించారు. 8వ జాబితాలో 2 పార్లమెంట్, 3 అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జ్‌లను వైఎస్ జగన్ నియమించారు. తాజాగా రెండు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానానికి వైసీపీ సమన్వయ కర్తల్ని ప్రకటించారు.


Also Read: YSRCP 9th List: వైసీపీ ఇంఛార్జ్‌ల 9వ జాబితా వచ్చేసింది, ఈసారి విజయసాయిరెడ్డికి చోటు