CM Jagan More Focus on Three Seats: కుప్పం, మంగళగిరి సహా  వైనాటు 175 నినాదంతో ప్రచారంలో  దూసుకుపోతున్న అధికారపార్టీ వైసీపీ(YCP).. .తెలుగుదేశం(TDP) కీలక స్థానాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా చంద్రబాబు(Chandrababu), లోకేశ్(Lokesh), పవన్(Pavankalyan) కల్యాణ్ సహా అచ్చెన్నాయుడు, మహాసేన రాజేశ్ తో పాటు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరిన స్థానాలపై జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.


అదే లక్ష్యం


కుప్పం(Kuppam)లో అప్రతిహాతంగా  ఏడుసార్లు విజయం సాధించిన చంద్రబాబును ఓడించేలా జగన్(Jagan) వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకోసం మూడేళ్లుగా ఆయన తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కుప్పం బాధ్యతలు అప్పగించారు. ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశానికి టీజర్ చూపించి.. చంద్రబాబు పర్యటనను అడ్డుకుని ట్రైలర్ విడుదల చేసి స్వామిభక్తిని చాటుకున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ సినిమా చూపిస్తామని చెబుతున్నారు. తన సొంత నియోజకవర్గం పుంగనూరుపైనా అంత శ్రద్ధ చూపని పెద్దిరెడ్డి కుప్పంలోనే మకాం వేసి పనులు చక్కబెడుతున్నారు. 


ఇక మరో కీలకస్థానం లోకేశ్(Lokesh) పోటీ చేస్తున్న మంగళగిరి(Mangalagiri)పై జగన్ దృష్టి పెట్టారు. మరోసారి లోకేశ్ ను అక్కడ ఓడించడానికి పావులు కదుపుతున్నారు. ఈ నియోజకవర్గంలో పెద్దసంఖ్యలో ఉన్న నేతకార్మికులకు గాలం వేసిన వైసీపీ... తెలుగుదేశం పార్టీలో ఉన్న గంజి చిరంజీవిని వైసీపీలో చేర్చుకుని పార్టీ  నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. అయితే యువగళం పాదయాత్రలు, రాష్ట్రవ్యాప్తంగా పర్యటనల్లో బిజీగా ఉన్నా...  ఏదో రకంగా లోకేశ్ మంగళగిరి ప్రజలను కలుస్తూనే ఉన్నారు. ఈ మధ్య పర్యటనలకు విరామం ఇచ్చి పూర్తిగా మంగళగిరపైనే ఫోకస్ పెట్టారు. సొంత డబ్బులతో పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్.. చేనేత సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు, మరో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె లావణ్యను రంగంలోకి దింపారు. అయితే, టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చిన గంజి చిరంజీవి ఇప్పుడు ఏం చేస్తారోననే ఆసక్తి నెలకొంది.


పవన్ పై ప్రత్యేక దృష్టి


ఇక తనపై ఒంటికాలిపై లేస్తున్న పవన్ కల్యాణ్(Pavan Kalyan) కు చెక్ పెట్టేలా సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. ఈసారి పవన్ కచ్చితంగా పిఠాపురం(Pitapauram) నుంచే పోటీ చేస్తారన్న ప్రచారంతో ఇప్పటికే అక్కడ ఇంఛార్జీగా బాధ్యతలు చేపట్టిన ఎంపీ వంగాగీత(Vanga Geetha)ను వెనక్కి పిలిపించినట్లు తెలుస్తోంది. పవన్ కు దీటైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. ముద్రగడ పద్మనాభాన్ని (Mudhragada Padmanabham) పార్టీలోకి తీసుకుని ఆయన్ను పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పై బరిలో దింపాలని యోచిస్తున్నారు. తాడేపల్లిగూడెం సభలో పవన్ వ్యాఖ్యలు, దీనికి బదులుగా ముద్రగడ పద్మనాభం లేఖ రాయడాన్ని చూస్తే... ముద్రగడ ఎట్టి పరిస్థితుల్లో జనసేనలో చేరే అవకాశం కనిపించకపోవడంతో ఆయన్ను పార్టీలో చేర్చుకునేలా సంప్రదింపులు జరుగుతున్నాయి.


కంచుకోటకు బీటలు


వైసీపీ కంచుకోట నెల్లూరు జిల్లాలో  ఒక్కొక్కరూ ఆ పార్టీని వీడుతుండటంతో బీటలు వారుతున్నాయి. గత ఎన్నికల్లో అన్ని సీట్లు గెలిచి క్లీన్ స్వీప్ చేసినా కీలకమైన నేతలంతా ఆ పార్టీని వీడారు. ముగ్గురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డితోపాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్(Vemireddy Prabhakar Reddy) రెడ్డి సైతం తెలుగుదేశం గూటికి చేరుతున్నారు. రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డిని నెల్లూరు లోక్ సభ బరిలో దింపేందుకు ఆదాలను అసెంబ్లీ స్థానానికి పంపారు. తీరా ఇప్పుడు వేమిరెడ్డి జగన్ కు చేయిచ్చారు. ఇలా ఒక్కొక్కరూ పార్టీ వీడుతుండటంతో నెల్లూరు జిల్లాపై జగన్ దృష్టి సారించారు. పార్టీలో కీలక నేత విజయసాయిరెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించనున్నారు. వేమిరెడ్డికి దీటైన అభ్యర్థిగా నిలవడంతో పాటు... జిల్లాలో చేజారిపోతున్న నేతలను కాపాడుకునే బాధ్యతను విజయసాయిరెడ్డికి అప్పగించారు. వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరిన నేతలెవ్వరూ గెలవడానికి వీల్లేదని జగన్ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy)ని స్పష్టం చేసినట్లు తెలిసింది. అచ్చెన్నాయుడు, రామానాయుడు,  మహాసేన రాజేశ్ సహా జగన్ పై ఒంటికాలుపై లేచే నేతలెవ్వరూ ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టడానికి వీల్లేదని గట్టిగానే ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాలపై వైసీపీ కేడర్ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.