Gudivada Amarnath on TDP: యనమల రామకృష్ణుడు ఈరోజు వైజాగ్‌లో మాట్లాడినవన్నీ అవాస్తవాలు, అబద్ధాలేనని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. యనమల తనను తాను పెద్ద మేధావిగా భావిస్తాడని అన్నారు. ఎన్టీఆర్ పెద్ద కొడుకు రామకృష్ణ పేరు ఉందనే ఒకే కారణంతో ఎన్టీఆర్ యనమలను ఎంకరేజ్ చేశారన్నారు. అలాంటిది ఆయన యనమలను దించేసే కుట్రలో కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. స్పీకర్ స్థానంలో కూర్చుని కనీసం ఎన్టీఆర్‌కు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. టీడీపీ దిగిపోయే సరికి ఏపీకి ఉన్న అప్పు 2 లక్షల కోట్లు అని.. మా హయాంలో జరిగింది కేవలం లక్షా పది వేల కోట్లు మాత్రమేనన్నారు. తాము కోవిడ్ లాంటి వైపరీత్యాలను  ఎదుర్కొవాల్సి వచ్చిందని గుర్తు చేశారు.


యనమలతో చర్చకు నేను సవాల్ చేస్తున్నానని, ప్రజలకు మేలు చెయ్యడానికి మాత్రమే తాము అప్పులు చేశామని అమర్నాథ్ వివరించారు. టీడీపీ దేని కోసం అప్పు చేసిందో చెప్పగలదా అని అడిగారు. పేదవాడికి తాము లక్షా 75 వేల కోట్ల రూపాయల సంక్షేమం అందించామన్నారు. యనమల సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావి అని విమర్శలు గుప్పించారు. యనమల ఉండేది హైదరాబాద్ లో.. కనీసం ఓటు హక్కు కూడా ఇక్కడ లేదన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల గురించి మాట్లాడే నైతిక హక్కు యనమలకు లేదని తెలిపారు. బల్క్ డ్రగ్ పార్క్ ఇండస్ట్రీ కోసం ఏపీని ఎన్నుకుంటే వద్దని లేఖ రాసింది యనమలనే అని చెప్పారు. ఒక పక్క ఇండస్ట్రీలు రాలేదంటారని, మరోవైవు వచ్చే పరిశ్రమలను అడ్డుకుంటారని తెలిపారు. మీ నాయకుడిలా మీకు కూడా అల్జీమర్స్ వచ్చిందా అని ఎద్దేవా చేశారు. 


టీడీపీ హయాంలో 20 లక్షల కోట్లు ఎంవోయూలు చేశామన చెప్తారని.. వాళ్లలో ఒక్కడి మొఖమన్నా చూపించగలరా అని ప్రశ్నించారు. రోడ్డున పోయే వాడికల్లా సూట్ వేసి ఎంవోయూలు చేసుకున్నారన్నారు. విశాఖకు రాజధాని రాకూడదు అన్నదే టీడీపీ వాళ్ల లక్ష్యం అని చెప్పుకొచ్చారు. సింగపూర్ లో తన పంటి నొప్పు కోసం రెండున్నర లక్షల ప్రజాధనం వాడేసింది యనమల కాదా అంటూ అడిగారు. వాళ్ళ చిన్నబాస్ వైజాగ్ ఎయిర్ పోర్టులో లక్షల రూపాయల విలువైన జీడిపప్పు తినెయ్యలేదా అంటూ విమర్శలు గుప్పించారు. 


పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు..


విశాఖ ఘర్జన సక్సెస్ తర్వాత విపక్షాల ప్రోగ్రాంలన్నీ సినిమా స్క్రిప్ట్ స్టయిల్ ల్లోనే నడుస్తున్నాయని గుడివాడ అమర్నాథ్ అన్నారు. పవన్ కళ్యాణ్‌పై రెక్కీ చెయ్యాల్సిన అవసరం మాకేముందన్నారు. వీకెండ్‌లో సినిమా షూటింగ్ లకు సెలవు కాబట్టి ఇప్పటం వెళ్లాడాని చెప్పారు. ఇప్పటంలో జనసేన సభ కంటే ముందే రోడ్డు విస్తరణ నిర్ణయం జరిగిందని తెలిపారు. ముందు పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామానికి ఇస్తానన్న 50 లక్షలు ఇచ్చి ఆపై మాట్లాడాలని తెలిపారు. చంద్రబాబు పై రాయి.. పవన్ కళ్యాణ్ నిర్బంధం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో అందరికీ తెలిసిందేనన్నారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ తేవడం కోసమే పవన్ కళ్యాణ్  ఇప్పటం వెళితానంటే ఎలా కుదురుతుందన్నారు.