Andhra Pradesh Assembly Elections 2024: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. రెండోసారి అధికారంలో రావాలన్న ధ్యేయంతో అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. అసెంబ్లీ అయినా, పార్లమెంట్ అయినా...టికెట్ల కేటాయింపులో సామాజిక సమీకరణాలను లెక్కలోకి తీసుకుంటున్నారు. ఆ నియోజకవర్గంలో అభ్యర్థుల సామాజికవర్గం ఓట్లు ఎన్ని ఉన్నాయి. ప్రత్యర్థి టీడీపీ-జనసేన కూటమి టికెట్ ఎవరికి ఇస్తోందన్న అంశాలను తెలుసుకుంటోంది. ప్రత్యర్థులు ఎత్తులు చిత్తయ్యేలా...కూటమికి ఝలక్ ఇచ్చేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా...మంత్రులయినా...మాజీ మంత్రులైనా...ఎంపీలయినా సరే...దుకాణం సర్దుకోవాల్సిందేనని చెబుతున్నారు. ఎన్నికల బరిలోకి దించితే గెలుస్తున్నారా లేదా అన్న దానికే సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు.
అసెంబ్లీ అభ్యర్థి శుభకుమారేనా ?
మడకశిర సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామికి టికెట్ లేదని చెప్పేశారు సీఎం జగన్. అక్కడి సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్న శుభకుమార్ ను బరిలోకి దించాలని భావించారు. తిప్పేస్వామిపై వ్యతిరేకత ఉందని, ఆయన స్థానంలో శుభకుమార్ అయితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగా సీఐ శుభకుమార్...ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. దీంతో మడకశిర వైసీపీ అసెంబ్లీ శుభకుమార్ అనే తేలిపోయింది. అధికారికంగా ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించాల్సింది.
తిప్పేస్వామికి అవమానం
ఇటీవలే మడకశిర నియోజకర్గం ఎమ్మెల్యే తిప్పేస్వామికి ఘోర అవమానం జరిగింది. సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసేందుకు ఎమ్మెల్యే తిప్పేస్వామి వెళ్లారు. మడకశిర టికెట్ వ్యవహారంపై మాట్లాడేందుకు సజ్జలను కలవాలని భావించారు. అదే సమయంలో సెక్రటేరియట్ నుంచి బయటకు వెళ్లిపోతున్న సజ్జల రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్యే తిప్పేస్వామి అనుచరులు అడ్డుకున్నారు. తిప్పేస్వామికి వైసీపీ టికెట్ ఇవ్వాలని, కొత్త వారిని బరిలోకి దించితే ఓడిపోతుందని అనుచరులు చెప్పారు. సర్వేల పేరుతో కొత్త వ్యక్తులను పోటీకి దించవద్దంటూ నినాదాలు చేశారు. కార్యకర్తల తోపులాటలో ఎమ్మెల్యే తిప్పేస్వామి దూరంగా వెళ్లారు. తిప్పేస్వామికి అన్యాయం జరగదని చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి...కారు ఎక్కి వెళ్లిపోయారు. దీంతో తిప్పేస్వామికి ఈ సారి టికెట్ లేదని...అప్పట్లో ప్రచారం జరిగింది. ఇపుడు సీఐ శుభకుమార్ జగన్మోహన్ రెడ్డి కలవడంతో...మడకశిర టికెట్ పై క్లారిటీ వచ్చినట్లయింది.
Also Read: సీనియర్ల టికెట్లపై తేల్చని సీఎం జగన్, మాజీ మంత్రులకూ షాక్ తప్పదా ?
Also Read: బొత్స ఫ్యామిలీకి బంపర్ ఆఫర్- ఈసారి ఎన్నికల్లో ఐదుగురికి సీట్లు