స్కిల్‌ స్కాంలో చంద్రబాబు రిమాండ్‌ పొడిగింపుతో పాటు సీఐడీ కస్టడీకి అప్పగించాయి న్యాయస్థానాలు. ఈ పరిణామాలపై చంద్రబాబు తరపున కేసు వాదిస్తున్న సీనియర్‌ లాయర్‌ సిద్ధార్థ లూథ్రా ఎక్స్‌(పాత ట్విటర్‌) వేదికగా మరోసారి స్పందించారు. చంద్రబాబు కేసును వాదిస్తోన్న ఆయన సందర్భం వచ్చినప్పుడల్లా ట్వీట్ చేస్తున్నారు. తాజాగా ‘‘ప్రతి రాత్రి తర్వాత తెల్లవారుతుంది, ప్రతి ఉదయం మన జీవితాల్లో వెలుగునిస్తుంది’’ అంటూ ట్వీట్ చేశారు. అయితే.. లూథ్రా ట్వీట్‌ను ప్రస్తావిస్తూ రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చారు.


లూథ్రా ట్వీట్‌కు కొనసాగింపు అన్నట్లుగా... 'అయితే జైలు గదిలో పగలు, రాత్రి ఒకేలా ఉంటాయ్ కదా సర్?' అని పేర్కొన్నారు. దానికి ముందు చేసిన ట్వీట్‌లో.. స్కిల్ స్కామ్ ద్వారా తెలిసిన వాస్తవం ఏమంటే డబ్బులతో నిజాన్ని దాచలేరు అంటూ ఆర్జీవీ చురకలు అంటించారు.


సిద్ధార్థ లూథ్రా సిద్ధార్థ అగర్వాల్ X హరీశ్ సాల్వే ఈజ్ నాట్ = (ఈక్వల్) పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటూ ట్వీట్‌ చేశారు.  స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై, రాజమండ్రి కేంద్రకారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబుకి వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అలాగే ఏసీబీ కోర్టు ఆయన రిమాండ్‌ను పొడిగింది. ఇంకోవైపు ఏసీబీ కోర్టు రెండు రోజుల సీఐడీ కస్టడీకి అప్పగించింది. బెయిల్‌ పిటిషన్‌పై వాదనలను ఏసీబీ కోర్టు సోమవారానికి(సెప్టెంబర్‌ 25) వాయిదా వేసింది.