Mamata Banerjee:  కేంద్రం గ్యాస్ సిలిండర్‌ ధరలు రూ. 200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. I.N.D.I.A కూటమికి భయపడి ప్రధాని మోదీ, అధికార ఎన్‌డీఎ ప్రభుత్వం దేశీయ వంటగ్యాస్ ధరలను తగ్గించిందని విమర్శించారు. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన కొద్ది సేపటికే మమత ఎక్స్ (ట్విటర్)లో ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గత రెండు నెలల్లో I.N.D.I.A కూటమి సమావేశాలను నిర్వహించగా, దేశీయ గ్యాస్ ధరలు రూ. 200 తగ్గాయన్నారు.






‘ఇప్పటి వరకు, I.N.D.I.A కూటమి రెండు సమావేశాలు మాత్రమే నిర్వహించింది.  నేడు LPG ధరలు రూ. 200 తగ్గడం చూస్తున్నాము. యే హై ఇండియా కా దమ్!" అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఎల్‌పీజీ సిలిండర్ల ధరను రూ.200 తగ్గిస్తూ మంగళవారం కేంద్రం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. దేశం ఓనమ్, రాఖీ పండుగ కానుకగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్రం వెళ్లడించింది.  


కేంద్రం ప్రకటన వెలువడిన వెంటనే, ప్రధాని మోదీ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. రక్షా బంధన్ పండుగ మన కుటుంబాల్లో ఆనందాన్ని పెంచే రోజని, గ్యాస్ ధర తగ్గింపు సోదరీమణులకు ఊరట కలిగిస్తుందన్నారు. వారి జీవితాలను సులభతరం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రతి సోదరి సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాననంటూ మోదీ ట్వీట్ చేశారు. 


రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ మధ్యప్రదేశ్, తెలంగాణ, మణిపూర్ రాష్ట్రాల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వాటి తరువాత మరో 9 నెలలకు లోక్‌సభ ఎన్నికలు రానున్నాయి. ఆకాశాన్నంటుతున్న సిలిండర్ల ధరలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం గ్యాస్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో రూ. 200 సబ్సిడీని పొందిన ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు కూడా ధరల తగ్గింపు వర్తిస్తుంది. అంటే ఇప్పుడు వారు మొత్తం రూ. 400 ధర తగ్గింపు ప్రయోజనాన్ని పొందవచ్చు.
కేంద్రంపై రూ.7680 కోట్ల భారం
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌ ధరను తగ్గించింది. ఒక్కో సిలిండర్‌పై రూ.200 వరకు కత్తిరించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పరిధిలోని వారికి రూ.400 వరకు లబ్ధి చేకూరుతుందని తెలిపింది. ఇతరులకు రూ.200 వరకు ఆదా అవ్వనుంది. ప్రస్తుత తగ్గింపుతో కేంద్ర ప్రభుత్వానికి 2022-23లో రూ.6100 కోట్లు, 2023-24లో రూ.7680 కోట్ల భారం పడుతుందని అంచనా.


'రాఖీ పండుగ, ఓనమ్‌ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.200 తగ్గించింది. ఉజ్వల యోజన కింద రూ.200 అదనపు సిబ్సిడీని పొడగించింది. దాంతో 73 లక్షల మహిళలకు ప్రయోజనం కలగనుంది' అని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. అంతేకాకుండా ఉజ్వల స్కీమ్‌ కింద మరో 75 లక్షల కొత్త కనెక్షన్లు ఇస్తామని వెల్లడించారు.


కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్ ధరలను తగ్గించడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికల కోలాహలం మొదలవుతుంది. ఆరు నెలల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు వస్తుంది. ద్రవ్యోల్బణం పెరుగుదల, ఆహార పదార్థాల ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నారు. దాంతో మోదీ సర్కార్‌ ఈ చర్యలు తీసుకుంది. అంతేకాకుండా కొన్ని నెలలుగా రష్యా నుంచి అతి తక్కవ ధరకే క్రూడాయిల్‌ కొనుగోలు చేస్తోంది.


మార్కెట్లో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర 90-100 డాలర్లు పలుకుతుండగా రష్యా నుంచి 70 డాలర్లకే దిగుమతి చేసుకుంటోంది. దీంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు లాభాలు ఆర్జించాయి. ఇప్పుడు ఆ ప్రయోజనాన్ని ప్రజలకు బదిలీ చేస్తున్నారు. 2023 జులైలో రిటైల్‌ ఇన్‌ప్లేషన్ 7.44 శాతంగా నమోదైంది. 15 నెలల గరిష్ఠానికి చేరుకుంది. మరింత పెరిగితే  ఇబ్బందులు తప్పవు. అందుకే గ్యాస్ సిలిండర్‌ ధర తగ్గిస్తే కొంత ఉపశమనం లభిస్తుందని మోదీ సర్కారు భావించింది.