Nara Lokesh : నారా లోకేష్ పాదయాత్ర మొదలు కాబోతోంది. ఇంకెన్నాళ్లు.. అంటూ చాన్నాళ్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఎదురుచూపులకు తెరదించుతూ పార్టీ అప్ డేట్ ఇచ్చింది. యువగళం పేరుతో.. యువనేత లోకేష్.. పసుపుదళాన్ని ముందుకు నడిపిస్తారని.. జనవరి 27న కుప్పం నుంచి యాత్ర మొదలు కాబోతోందని ప్రకటించింది. 400 రోజుల్లో 4000కిలోమీటర్లు 100 నియోజకవర్గాల పరిధిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యాత్ర సాగేలా ప్రణాళిక చేశారు. లోకేష్ జనంలోకి వస్తారు అని.. పాదయాత్ర ప్రారంభిస్తారన్న విషయం చాన్నాళ్లుగా వినిపిస్తూనే ఉంది. రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ప్రత్యేకంగా యువతను మాత్రమే టార్గెట్ చేసేలా ఇప్పుడు యాత్రకు రూపకల్పన చేశారు.
పాదయాత్ర ద్వారా రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసేందుకు లోకేష్ ప్రయత్నం
రాజకీయాల్లో పాదయాత్రల సీజన్ అన్నది 2004 లో మొదలైంది. అంతకు ముందు వివిధ అంశాలపై పాదయాత్రలు జరిగినా రాజకీయ పాదయాత్రలు అన్నవి మాత్రం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం యాత్రతో ప్రారంభమయ్యాయి. వైఎస్ చేవెళ్లలో ప్రారంభించిన యాత్ర ఆయన్ను సీఎం కుర్చీ వరకూ తీసుకెళ్లింది. ఆ తర్వాత చంద్రబాబు వస్తున్నా మీకోసం యాత్ర చేసి సీఎం అయ్యారు. ఆయన తర్వాత ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో చేసిన 3500 కిలోమీటర్లకు సుదీర్ఘ పాదయాత్ర కూడా ఆయన్ను సీఎం కుర్చీపై కూర్చోబెట్టింది. అటు తెలంగాణలోనూ.. పాదయాత్రల సీజన్ నడుస్తోంది. బండి సంజయ్ విడతల వారీగా పాదయాత్ర చేయగా.. వైఎస్ షర్మిల కూడా యాత్ర చేస్తున్నారు. రేపో మాపో రేవంత్ రెడ్డి మొదలుపెట్టబోతున్నారు. పాదయాత్ర అనేది అధికారానికి రహదారి అని ఇంతకు మందు ఘటనలు నిరూపించాయి. ఇప్పుడు ఈ యాత్రలన్నింటినీ తలదన్నే భారీ యాత్రను నారా లోకేష్ మొదలు పెడుతున్నారు.
టీడీపీకి ప్రచార వారధిగా చంద్రబాబు నుంచి బ్యాటన్ అందుకునే సమయం !
పతనం అంచునున్నప్పుడో.. పాతాళంలో ఉన్నప్పుడో పైకి లాక్కొచ్చినోడికే గుర్తింపు. కిందటి ఎన్నికల ఘోరమైన దెబ్బ తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి అదే. ఓట్ల పరంగా బాగానే ఉన్నప్పటికీ.. సీట్ల పరంగా ఆ స్థాయికి పడిపోవడం పార్టీ చరిత్రలో అదే మొదలు. అయితే పదేళ్ల ప్రతిపక్షంలో ఉండి.. విభజనతో వీక్ అయిపోయిన పార్టీని తన కష్టంతో మళ్లీ నిలబెట్టారు అధినేత చంద్రబాబు. మళథ్లీ ఇప్పుడు కూడా ఈ వయసులో ఆ బాధ్యతను ఆయనే తీసుకున్నారు. అన్ని ప్రాంతాల్లో పర్యటనలు చేస్తూ..భారీ బహిరంగ సభలతో అదరగొడుతున్నారు. అయితే ఇంత పెద్ద వయసులో చంద్రబాబుకు ఇంత కష్టం ఎందుకు..ప్రచార పగ్గాలను ఇకనైనా లోకేష్ అందుకోవాలి కదా.. అన్న మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. దానికి ఇదే సరైన సమయంగా లోకేష్ ఎంచుకున్నారు.
2009 నుంచి టీడీపీలో కింది స్థాయి నుంచి పని చేస్తూ వచ్చినలోకేష్ !
లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లో మొదట కనిపించింది.. 2009లో. తన తండ్రి తరపున కుప్పం ఎన్నికల ప్రచారంలో లోకేష్ పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా పార్టీలో ప్రస్థానాన్ని ప్రారంభించి జాతీయ ప్రథాన కార్యదర్శి అయ్యారు. 2018లో ఎమ్మెల్సీగా ఎంపికై... మంత్రిగానూ.. పార్టీ నేతగానూ కీల స్థానానికి చేరుకున్నారు. పార్టీ కార్యకర్తల సంక్షేమనిధిని ఒక రూపుకు తీసుకొచ్చి.. అత్యుత్తమంగా తీర్చిదిద్దడంతో పాటు.. యువనేతలతో సమన్వయం చేసుకుంటూ వస్తున్నారు. అయితే రాజకీయాల్లో ఉన్నప్పుడు పోలికలు సహజంగానే వస్తుంటాయి. రాజకీయ స్నేహితులు.. సీఎంలు అయిన వైఎస్, చంద్రబాబు కుమారులపై కూడా అదే కంపారిజన్ వచ్చింది. సొంతగా పార్టీ పెట్టి.. రెండు సార్లు పోరాడి ఓ సారి అధికారంలోకి వచ్చిన జగన్ మోహనరెడ్డి .. ప్రజాదరణ పొందిన నాయకుడిగా గుర్తింపు పొందారు. అటు పొరుగురాష్ట్రం తెలంగాణలో సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కూడా దాదాపు ప్రభుత్వాన్ని తానే నడిపిస్తున్నారు. అటు పార్టీపైన ఇటు ప్రభుత్వంపైనా గ్రిప్ సాధించారు. లోకేష్ కూడా పార్టీపై పూర్తి గ్రిప్ సాధించడంతో పాటు.. మంత్రిగా పలు పరిశ్రమలను తీసుకొచ్చి.. మంచి అడ్మినిస్ట్రేటర్ గా ప్రూవ్ చేసుకున్నారు. అయితే.. మొదటి సారి నేరుగా ఎలక్షన్ లో గెలవకపోవడం.. 2019 ఎన్నికల్లో ఓడిపోవడం లోకేష్ కు లోటుగా మిగిలింది. మిగిలిన వారితో పోల్చితే.. ప్రజాదరణ విషయంలో వెనుకబడ్డారని.. ఆయన సొంతగా ప్రూవ్ చేసుకోవలసింది మిగిలే ఉందని రాజకీయాలను దగ్గర నుండి చూసేవారు చెబుతారు. ఈ ఎన్నికల నాటికి ఈ ముద్రను చెరిపేసుకోవలసిన అనివార్యత లోకేష్ కు ఉంది. కాబట్టే కదనరంగంలోకి దిగారు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. వైఎస్ అనే భారీ నీడ లేనప్పుడే జగన్ మోహనరెడ్డి సొంతంగా ఎదగగలిగారు. తెంలగాణలో కేసీఆర్ సీఎం అయినా ఆయన యాక్టివ్ కార్యకలాపాలపాల్లో ఉండరు. కానీ చంద్రబాబు తరహా అది కాదు. ఆ ముద్ర నుంచి బయట పడటం అంత సులభం కాదు. అందుకే లోకేష యాక్టివ్ పార్టిసిపేషన్ ఎంతున్నా.. చంద్రబాబు తర్వాతే... అన్న ఫీలింగ్ వచ్చేసింది.
తనపై వచ్చిన విమర్శలని పాజిటివ్ గా తీసుకుని మారే ప్రయత్నం చేసిన లోకేష్ !
2019 తర్వాత చూస్తే.. లోకేష్ లో మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మంగళగిరిలో లోకేష్ ఓటమి అన్నది పార్టీ శ్రేణులను దిగ్ర్భాంతికి గురిచేసింది. కొంచం బొద్దుగా ఉన్న ఆయన ఆహార్యంపై సైటైర్లు... ఆయన ఆహారంపై జోకులు.. పప్పు అన్న కామెంట్లు.. ఇలా చాలా రూపాల్లో తనపై దాడి జరిగింది. అన్నింటికీ తన పనితీరుతోనే సమాధానం చెప్పాలన్నట్లుగా లోకేష్ ప్రయత్నం చేశారు. పడిన చోటే లేవాలి అంటూ మంగళగిరినే మూడున్నరేళ్లుగా కార్యక్షేత్రంగా మలచుకున్నారు. తనను తాను మార్చుకున్నారు. తన శరీరంపై జోకులు వేసిన వాళ్లే షాక్ అయ్యేలా సన్నబడ్డారు. రఫ్ గా కనిపించేలా ఆహార్యాన్ని లుక్ ను మార్చుకున్నారు. మాటతీరులోనూ మార్పు వచ్చేసింది.
సీమ నుంచే సన్నద్ధం
వైఎస్సార్సీపీ బలం.. తెలుగుదేశం బలహీనతా..రాయలసీమ. అందుకే వ్యూహాత్మకంగా సీమ నుంచే యాత్రకు సన్నద్ధం అయ్యారు. నెల్లూరుతో కలిపిన రాయలసీమలో మొత్తం 61సీట్లు ఉంటే తెలుగుదేశం గెలిచింది. కేవలం 3. అందులో ఒకటి లోకేష్ తండ్రి పార్టీ అధినేత చంద్రబాబు పోటీ చేసిన కుప్పం. రెండోది ఆయన మామ గెలిచిన హిందూపురం. మూడోది... పయ్యావుల కేశవ్. ఈ ముగ్గురూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందడం.. ఇద్దరు బంధువులు కావడం చూస్తే.. పార్టీ ఏ స్థాయిలో సీమలో వెనుకబడిందో అర్థం అవుతుంది. అయితే లోకేష్ మాత్రం ఈసారి చాలా కాన్ఫిడెన్సుతో ఉన్నారు. ఈ సారి సీమలో సీన్ ఏంటో చూపిస్తాం చూడండంటూ అంటూ చాలా కాన్ఫిడెన్సుగా చెప్తున్నారు.
సీక్రెట్ ఏర్పాట్లు.. సాదాసీదా యాత్ర
యాత్రను చేయానుకోవడం మాత్రమే కాదు. దానిని ఎలా చేయాలన్న దానిపై కూడా చాలా కసరత్తు చేసినట్లు కనిపిస్తోంది. చాన్నాళ్లుగా యాత్ర చేస్తారు అని చెబుతున్నా.. ఎలా ఉంటుందన్న దానిపై ఎలాంటి సమాచారం రాలేదు. ఓ సందర్భంలో నేనొస్తున్నా.. అంటూ లోకేష్ ఒక స్టేట్ మెంట్ ఇచ్చారు. బహుశా అదే పేరుతో ఆయన యాత్ర చేస్తారేమో అని కూడా అనుకున్నారు. ప్రజాగళం అన్నపేరు బయటకు వచ్చింది. అయితే ఆ తర్వాత యువగళం అని ప్రకటించారు. ఈ మధ్యనే పవన్ కల్యాణ్ యాత్ర చేయబోయే వాహనాన్ని ప్రమోట్ చేశారు. కానీ లోకేష్ యాత్రకు సంబంధించి చాలా విషయాలను బయట పెట్టడం లేదు. హంగూ ఆర్బాటాలు లేకుండా సాదాసీదాగా చేస్తాం అని చెప్పడం కూడా వ్యూహాత్మకమే అనుకోవాలి. యూత్ ను మోటివేట్ చేసేలా యాత్ర సాగుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకు ముందు జరిగిన పాదయాత్రలతో పోల్చితే ఇది కొంచం కొత్తే. యాత్ర అంతా కూడా యువతతో చర్చలు... వారిని భాగస్వాములను చేసేలా కార్యకలాపాలు ఉండొచ్చు. జగన్ మోహనరెడ్డి యూత్ ఇమేజ్ తో కిందటి ఎన్నికల్లో చొచ్చుకుపోయారు. అయితే ఎన్నికల్లో గెలిచాక వారి ఆకాంక్షలు ప్రతిఫలించేలా వారికి ఉపాధి కలిగేలా పరిశ్రమలు రాలేదని.. కనీసం వారికి భరోసాగా నిరుద్యోగ భృతి వంటి వాటిని కూడా తీసేసారని ఈ విషయంలో యువతలో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేయాలని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.
గెలవడమే కాదు.. నిలవడం కూడా ముఖ్యమే !
చంద్రబాబు తర్వాత పార్టీలో లోకేష్ తిరుగులేని నాయకుడే.. ఇప్పటికైతే అది కాదనలేని సత్యం. కానీ.. టీడీపీ లో ఉండే కొందరకీ.. టీడీపీ బయట ఉండే చాలామందికి ఉండే సందేహం ఏంటంటే.. చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు అందుకునేది లోకేష్ ఏనా.. లేక పార్టీలోకి మరొకరు వస్తారా అన్న చర్చ నడుస్తూనే ఉంటుంది. రాజకీయ కారణాలతో చర్చ నడిపే వాళ్లుంటారు. తారక్ వస్తున్నాడంటూ.. నిప్పు రాజేసేవాళ్లుంటారు. అయితే పార్టీని అధికారంలోకి తేవాలన్న లక్ష్యం మాత్రమే కాదు. నాయకుడిగా తనకు తిరుగులేదు అని నిరూపించుకోవడం కూడా ఇప్పుడు వ్యక్తిగతంగా ఆయనకు అవసరమే. అందుకే ఇంతకు మందు ఎవరూ చేయనటువంటి రికార్డు బ్రేకింగ్ పాదయాత్రకు ప్రారంభం చేస్తున్నారు. యువగళం పేరుతో పసుపుదళంలో తన బలాన్ని పెంచుకోవాలనుకుంటారు. ఓడిపోయారన్న విమర్శలు.. ఇంకా తండ్రిచాటు బిడ్డే అన్న మాటలను పటాపంచలు చేయడానికి ఆయనకు ఆయన కల్పించుకుంటున్న అవకాశం ఇది. ఆ అవకాశాన్ని ఎంత వరకూ వినియోగించుకుంటారో చూడాలి.