KCR Early Polls : కర్ణాటకతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి... బీజేపీ క్యాడర్ అంతా సిద్ధంగా ఉండాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. కొద్ది రోజుల కిందట..కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారని ముందస్తు ఎన్నికలకు వెళ్తారని జోస్యం చెప్పారు. వీరిద్దరే కాదు.. తెలంగాణ రాజకీయాలను డీప్‌గా ఫాలో అవుతున్న వారికీ ఈ డౌట్ వస్తోంది. ఎన్నికల వేగంతో జరుగుతున్న పరిణామాలే దీనికి కారణం అవుతోంది. 


సంక్షేమలో పరుగులు - అభివృద్ధి పనుల హడావుడి ! 


తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అన్ని విషయాల్లోనూ జోరు పెంచింది. మార్చిలోపు అభివృద్ది పనులన్నీ కళ్ల ముందు కనిపించేలా  ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ రూపు రేఖల్ని దాదాపుగా మార్చేశారు. 17 ఫ్లైఓవర్లు నగరం నలుదిక్కూలా ప్రారంభించారు. ఇంకా  ప్రారంభించాల్సినవి ఉన్నాయి. కొత్తగా మెట్రోరైలు విస్తరణకు శంకుస్థాపన చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలోగా రోడ్లను మెరుగ్గా తీర్చిదిద్దేలా కాంట్రాక్టులు పిలుస్తున్నారు. సచివాలయ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోవడంతో సంక్రాంతికి ప్రారంభించనున్నారు. అమరుల స్మారకాన్నీ అదే రోజు ప్రారంభిస్తారు. 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని కూడా ఎన్టీఆర్‌ ఘాట్‌ పక్కనే వచ్చే నెల్లోనే ఆవిష్కరిస్తారు. అన్నీ మార్చిలోపే అయిపోనున్నాయి. 


సంక్షేమ పథకాల్లో సంతృప్త స్థాయి టార్గెట్.. మార్చిలోపే ! 


మరో వైపు సంక్షేమ పథకాల్లో ప్రజలను సంతృప్త స్థాయికి తీసుకెళ్లాలని..దానికీ మార్చి నెలే లక్ష్యంగా పెట్టుకున్నారు. దరఖాస్తు పెట్టుకున్న వారందరికీ పెన్షన్లు మంజూరు చేస్తున్నారు. రేషన్ కార్డులు ఇస్తున్నారు. పెద్ద ఎత్తున నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను లబ్దిదారులకు త్వరలోనే ఇవ్వబోతున్నారు. ఇక సొంత జాగాలో నివాసాలు కట్టుకునేవారికి ఆర్థిక సాయం కూడా త్వరలో ఇవ్వబోతున్నారు.  దళితబంధు పథకాన్ని మరింత జోరుగా అమలు చేయబోతున్నారు. రైతు బంధు వంటి పథకాలపై ఇప్పటికే ప్రజల్లో సానుకూలత ఉంది. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు  కేసీఆర్ మార్చి డెడ్ లైన్ పెట్టుకున్నారు.


నిరుద్యోగుల అసంతృప్తి పూర్తిగా తగ్గించే ప్లాన్...  మార్చి నెలే టార్గెట్ ! 


ఉద్యోగాల భర్తీలోనూ కేసీఆర్ దూకుడు పాటిస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన ఎనభై వేల ఉద్యోగాల భర్తీలో ఇప్పుడు వేగం పుంజుకుంది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు ఇచ్చారు. పరీక్షలు నడుస్తున్నాయి. తాజాగా మరో తొమ్మిది వేల ఉద్యోగాలతో గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. దీంతో నిరుద్యోగులంతా బిజీగా ఉన్నారు. మార్చి వరకూ నియామకాల జోరు కొనసాగే అవకాశం ఉంది. ఇంకా  పలు రకాల నోటిఫికేషన్లు లైన్‌లో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 


జిల్లాల టూర్లు.. పార్టీ పటిష్టతపై కేసీఆర్ గురి ! 


డిసెంబర్‌ మొదటి వారం నుంచి సీఎం జిల్లాల పర్యటన సందర్భంగా భారీ బహిరంగ సభలు కూడా జరుగుతాయి. డిసెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బడ్జెట్‌పై కేంద్రం విధిస్తున్న ఆంక్షలు, తదితరాలపై చర్చించనున్నారు. కేంద్రం కక్షపూరిత వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.  పార్టీలో ఏమైనా విభేధాలు ఉంటే.. పరిష్కరించుకోవడానికి ఆత్మీయ సమావేశాలు పెట్టుకోవాలనికేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. మండలాల వారీగా పార్టీ కేడర్‌తో ఆతీ్మయ సమ్మేళనాల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వంద మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్‌చార్జిల కోసం జాబితాల రూపకల్పనపై దృష్టి కేంద్రీకరించారు. ఇవన్నీ మార్చిలోపు పూర్తయిపోతాయి. 


మేలో కర్ణాటక ఎన్నికలు - ఆ రాష్ట్రంతో వెళ్తారా ? ఆ తర్వాతనా ? 


 ఎలా చూసినా కేసీఆర్ మార్చి నాటికి ఎన్నికలకు రెడీ అయిపోతారని ఎక్కువ మంది నమ్ముతున్నారు.   బడ్జెట్ పెట్టిన తర్వాత ఆయన అసెంబ్లీని రద్దు చేయవచ్చని ఎక్కువ మంది నమ్ముతున్నారు. వచ్చే ఏడాది మేలోపు ఎన్నికలు జరపాల్సి ఉంది. అప్పుడే తెలంగాణలోనూ ఎన్నికలు పెట్టే చాన్స్ ఉందంటున్నారు. కేసీఆర్ రాజకీయ వ్యూహాలను నేరుగా అంచనా వేయడం కష్టం. కానీ ఆయన నిర్ణయాలను డీకోడ్ చేస్తే మాత్రం ముందస్తు ఎన్నికల పరుగు కనిపిస్తోందని అనుకోవచ్చు.