Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల ప్రకటన ఆలస్యమయ్యే కొద్దీ సామాజికవర్గాల పేరుతో గ్రూపులు తెరపైకి వస్తున్నాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కసరత్తు ఫైనల్ స్టేజ్ కు వచ్చింది. సునీల్ కనుగోలు సర్వే బృందాలతో ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న చోట్లక.. ఇతర పార్టీల నుంచి అయినా బలమైన అభ్యర్థులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా వరుసగా టిక్కెట్ కోసం పార్టీలో చేరే నేతలు పెరుగుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చి న తర్వాతి రోజే మొత్తం అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే ఈ లోపు కాంగ్రెస్ సామాజికవర్గాల పేరుతో అలజడి కనిపిస్తోంది. గ్రూపులుగా ఒకరి తర్వాత ఒకరు వెళ్లి తమకు ఎక్కువ టిక్కెట్లు కేటాయించాలన్న డిమాండ్ చేస్తున్నారు. ఇది వ్యూహాత్మకంగా చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
ముందుగా బీసీ నేతల హడావుడి
బీసీలకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున 34 సీట్లు ఇస్తామని ప్రకటించింది. రేవంత్ రెడ్డి ఈ విషయంలో పట్టుదలగా ఉన్నారు. బీసీలకు బీఆర్ఎస్ పార్టీ ఇరవై లోపు సీట్లే ఇవ్వడం.. ముదిరాజ్ వంటి కీలక సామాజికవర్గాలకు ఒక్క టిక్కెట్ కూడా ఇవ్వకపోవడంతో వారిలో అసంతృప్తి ఉంది. వారందర్నీ ఆకట్టుకునేందుకు రేవంత్ రెడ్డి బీసీలకు టిక్కెట్లు ఇవ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కనీసం ముఫ్ఫై సీట్లు బీసీలకు గ్యారంటీగా ఇస్తున్నారని చెబుతున్నారు. బీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి.. ఆ విషయాన్ని హైలెట్ చేసుకోవడానికే బీసీ నేతలతో ఢిల్లీలో డిమాండ్లు వినిపించారని.. టిక్కెట్లు ప్రకటించిన తర్వాత వారు.. కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం ఇచ్చిందని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్లన్ అమలు చేస్తున్నారని అంటున్నారు.
కొత్తగా కమ్మ సామాజికవర్గం నేతల హడావుడి !
కాంగ్రెస్ పార్టీలో కొత్తగా కమ్మ సామాజికవర్గం నేతలు సమావేశాలు పెడుతున్నారు. తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక్కడ అసలు ప్లాన్ ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. కమ్మ సామాజిక వర్గానికి 12 సీట్లు కేటాయించాలని కోరుతూ ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ కమ్మ నేతల బృందం ఏఐసీసీ నేత, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ తో భేటీ అయ్యింది. సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని కో రారు. విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి ప్రాధాన్యం దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారని, బృందానికి నాయకత్వం వహించిన మాజీ ఎంపీ రేణుకా చౌదరి చెప్పారు. రేపు ఎల్లుండి కూడా ఢిల్లీలోనే ఉంటామని, ఏఐసీసీ అగ్రనేతలతో సమావేశమవుతామని ఆమె తెలిపారు. అధిష్టానం నుంచి సానుకూల స్పందన రాకుంటే తమ వద్ద ప్లాన్ బీ కూడా ఉందని చెబుతున్నారు. కమ్మ సామాజికవర్గం సంప్రదాయంగా టీడీపీకి ఓటు బ్యాంక్ గా ఉంటుంది. ప్రస్తుతం టీడీపీ పోటీ చేస్తుందా లేదా .. చేసినా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్న దానిపై స్పష్త లేదు. వారి ఓటు బ్యాంక్ బీఆర్ఎస్‌కు ఎక్కువగా అనుకూలంగా ఉంది. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు మళ్లించేందుకు రేణుకా చౌదరి నేతృత్వలో కొత్త రాజకీంయ జరుగుతోందని అంటున్నారు. తుమ్మల సహా.. ఎలాగూ.. కొంత మంది కమ్మ సామాజికవర్గం నేతలకు టిక్కెట్లు కేటాయిస్తారని .. అలా కమ్మ సామాజికవర్గానికి కాంగ్రెస్ ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పుకుని వారందర్నీ ఆకట్టుకునేలా చేసేందుకు ఇలా చేస్తున్నారని భావిస్తున్నారు.
అన్ని సామాజికవర్గాలకు కాంగ్రెస్ ప్రాదాన్యం ఇచ్చిందని ప్రచారం చేసుకునేలా ప్లాన్ ?
బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. ఆ పార్టీ టిక్కెట్ల ప్రకటనలో సామాజిక న్యాయం లోపించిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. రెడ్డి సామాజికవర్గానికి మెజార్టీ సీట్లు దక్కాయి. రిజర్వుడు సీట్లు పోను మిగిలిన నియోజకవర్గాల్లో 40 స్థానాల్లో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారు. వెలమలకు 11, కమ్మ వర్గానికి ఐదు, వైశ్య, బ్రాహ్మణులకు ఒక్కొక్కటి కేటాయించారు. మొత్తం బీసీ వర్గాలకు ఇరవై రెండు కేటాయించారు. ఇందులో మున్నూరు కాపు వర్గానికే పది దక్కాయి. దీంతో సామాజిక సమీకరణాలు తప్పాయని..తాము అలా కాదని..కాంగ్రెస్ నిరూపించాలనుకుంటోంది. అందుకే సామాజికవర్గాల వారీగా అంతర్గత డిమాండ్లు చేయించి.. తగినంత ప్రాధాన్యం ఇచ్చామని ..ప్రచారం చేసుకునే వ్యూహాన్ని తెరపైకి తెచ్చారని భావిస్తున్నారు.