తెలంగాణలో 2023 సంవత్సరం డిసెంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్ లో నిర్వహించిన సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా బీఆర్ఎస్ బీజేపీలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. కర్ణాటక రాష్ట్రంలో మైనారిటీలు కాంగ్రెస్ వైపు నిలబడి ఓట్లు వేయడంతో అక్కడ అధికారంలోకి వచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని వెల్లడించారు. ప్రభుత్వాలు ఎప్పుడు ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు.
" తెలంగాణ రాష్ట్రంలో హాంగ్ వస్తుందని బీజేపీ మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుందని బి ఎల్ సంతోష్ చెప్పారు. కాంగ్రెస్ బీజేపీ ఎప్పటికీ ఒకటి కాదు. ఆ విషయం అందరికీ తెలుసు. తెలంగాణలో హాంగ్ వస్తే కలవబోయేది బీజేపీ, బీఆర్ఎస్ అని బీఎల్ సంతోష్ చెప్పకనే చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీని సీఎం కేసీఆర్, కేటీఆర్, బీజేపీ నేతలు దూషిస్తున్నారు. పదవులు త్యాగం చేసినందుకా? లేక ఒక దళితుడిని పార్టీ అధ్యక్షునిగా చేసినందుకా? ఎందుకు సోనియా గాంధీని తిడుతున్నారు? డిసెంబర్ నెల మిరాకిల్ మంత్ గా నిలిచిపోతుంది. 2009 డిసెంబర్ 9న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియపై ప్రకటన వచ్చింది. ఇప్పుడు మళ్లీ 2023 సంవత్సరం డిసెంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాలు మైనారిటీలకు మేలు జరుగుతుంది" అని రేవంత్ రెడ్డి అన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి సీరియస్ కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ అపూర్వ సోదరులంటూ చురకలంటించారు. పేదల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి కానీ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడే పరిస్థితి దేశంలో దాపురించిందని చెప్పారు. మైనార్టీల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. మైనారిటీల డిమాండ్లను అమలు చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు. సోనియాగాంధీని విమర్శించే నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడాలని హెచ్చరిస్తున్న అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సోనియాగాంధీ చొరవతోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పడిందన్నారు. కానీ సెంటిమెంట్ ప్రభావంతో స్థానిక పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. సాధించుకున్న తెలంగాణలో ఆకాంక్షలు ఏమీ నెరవేరలేదని అన్నారు. ప్రతి నలుగురిలో ఒకరికి ఉద్యోగం రావడం లేదన్నారు. 42% పట్టభద్రులు ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా ఉన్నారని చెప్పారు. సోనియాగాంధీ చెప్పిన ఆరు గ్యారంటీలు ప్రతి నిరుపేదలకు అందజేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ఒక కన్నువేయాలని సూచించారు.
ఓడిపోతామని భయంతో రాష్ట్ర మంత్రులు సుడిగాలి పర్యటన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసే రాష్ట్ర మంత్రులు అసలు కాంగ్రెస్ పార్టీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలను మరుగుజ్జులంటూ కామెంట్స్ చేస్తున్నారని ఇలా చేయడం సరి కాదని ఆరోపించారు.