Power struggle between Telangana BJP leaders : పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన సీట్లు, ఓట్లతో దూసుకెళ్లిపోవాల్సిన తెలంగాణ బీజేపీ పూర్తి స్థాయిలో సైలెంట్ అయిపోయింది. దీనికి కారణం ఏమిటో ఆ పార్టీ క్యాడర్‌కు మెల్లగా అర్థమవుతోంది. పార్టీ ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరాటం వల్లనే ఎవరికి వారు పట్టించుకోవడం మానేయడంతో సమస్యలు వస్తున్నట్లుగా గుర్తించారు. మరి పార్టీ హైకమాండ్ ఈ సమస్యను ఎందుకు గుర్తించడం లేదో మాత్రం వారికి అర్థం కావడం లేదు. 


కిషన్ రెడ్డి సమావేశానికి ఎమ్మెల్యేలు డుమ్మా


తెలంగాణ బీజేపీలో  ఎవరి దారి వారిదే అన్నట్లుగా సీనియర్ నేతలు  వ్యవహరిస్తున్నారు. ఇటీవల పార్టీ చీఫ్‌ కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కీలక  సమావేశానికి ఏడుగురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఆ పార్టీకి ఉన్న ఒక్క  ఎమ్మెల్సీ AVN రెడ్డి సైతం హాజరుకాలేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించారు.  ఎమ్మెల్యేలకు అత్యంత కీలకమైన ఈ సమావేశానికి వారు హాజరాకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒక్క   నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా హాజరు కాలేదు. కిషన్ రెడ్డితో సమావేశానికి ఎమ్మెల్యేలు గైర్హాజర్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.  తెలంగాణ బీజేపీ చీఫ్ గా కూడా ఉన్న కిషన్ రెడ్డి ఎమ్మెల్యేలను అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదని . .అందుకే ఆయన నాయకత్వంలో పని చేయడం కన్నా.. కొత్త నాయకుడు వచ్చే వరకూ సైలెంట్ గా ఉండటం బెటరని అనుకుంటున్నారు. 


తెలంగాణ పీసీసీ చీఫ్ పీఠంపై అదే పీఠముడి - రేవంత్ మాట నెగ్గుతుందా ?


ఎమ్మెల్యేల మధ్యా కనిపించని సఖ్యత  


పార్టీ నుంచి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేల మధ్య కూడా సమన్వయ లోపం కనిపిస్తోంది.  రాజాసింగ్‌ పార్టీ లీడర్లతో అంటిముట్టనట్లుగా ఉంటున్నారు.   బీజేఎల్పీ లీడర్‌ మహేశ్వర్ రెడ్డికి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌ బాబు ఒక్కరే మద్దతుగా ఉంటున్నారు.  బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని.. ఇతర ఎమ్మెల్యేలను కలుపుకొని పోవడం లేదని మిగిలిన ఎమ్మెల్యేలు ఫీలవుతుున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు దిశానిర్దేశం చేసేందుకు  ఎమ్మెల్యేలను ఆహ్వానించగా.. కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు.  మాజీ సీఎం, ప్రస్తుత సీఎంలను కామారెడ్డిలో ఓడించిన  కేవీఆర్.. తాను ఎందకు గెలిచానా అని మథన పడుతున్నారు. అసెంబ్లీలో బీజేపీ వాయిస్ పెద్దగా వినిపించలేదు. తెలంగాణకు కేంద్రం కేటాయించిన ప్రాజెక్టులు, నిధుల విషయమై  పార్టీ నుంచి తమకు ఎలాంటి సమాచారం లేకపోతే… సభలో ఏం మాట్లాడాలని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. దీనికి కారణం  పార్టీలోని పరిస్థితులేనని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


పార్టీపై దృష్టి పెట్టలేకపోతున్న కిషన్ రెడ్డి 


పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పటికీ కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వ్యవహరిస్తున్నారు.  ఆయన ఎక్కువగా ఢిల్లీలో ఉంటున్నారు.  రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ యంత్రాంగం మధ్య సమన్వయానికి రాష్ట్ర పార్టీలో ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఈ కారణంగా చిన్న చిన్న విషయాలు సైతం ఆగాధానికి కారణమవుతున్నాయంటున్నారు.   పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమాలకు కూడా ఎమ్మెల్యేలకు సమాచారం ఉండటం లేదు.  ఆ మధ్య జరిగిన కిసాన్ హెల్ప్‌లైన్ సెంటర్ ప్రారంభానికి ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరుకాలేదు.
 రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించాలని కోరుకుంటున్న కమలదళంలో ఈ గందరగోళం కార్యకర్తలను ఆవేదనకు గురిచేస్తోందంటున్నారు. పార్టీలో సమన్వయం లోపిస్తే పార్టీని బలోపేతం చేయడం ఎలా అని క్యాడర్ కంగారు పడుతున్నారు. 


కొడంగల్‌లో భూముల కోసం రేవంత్ వేధింపులు - కేటీఆర్‌కు రైతుల ఫిర్యాదు


కొత్త అధ్యక్షుడి ఎంపికపై తేలని చర్చలు


కేంద్ర మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసిన రోజునే.. తెలంగాణ కొత్త చీఫ్ గా.. ఈటల రాజేందర్ ను నియమిస్తారన్న చర్చ జరిగింది. కానీ ఇప్పటి వరకూ ప్రకటన రాలేదు. రెండు, మూడు సార్లు రాష్ట్రానికి బీఎల్ సంతోష్ వచ్చి అందరితో మాట్లాడి వెళ్లారు కానీ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.  కొత్త అధ్యక్ష నియామకం జరిగితేనే తెరపడుతుందనేది అంతర్గతంగా బీజేపీలో జరుగుతున్న చర్చ. కానీ అలా నియమిస్తే సమస్యలు ఇంకా పెరిగిపోతాయేమోనని హైకమాండ్ భయపడుతోంది.