మైలవరం వైసీపీ రాజకీయం ఇటీవల వివాదాలకు దారి తీసిన విషయం తెలసిందే. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేష్ మధ్య విభేదాలు పెద్ద ఎత్తున తెర మీదకు వచ్చాయి. దీంతో నియోజకవర్గంతో పాటుగా ఉమ్మడి కృష్ణ జిల్లాలో కూడా ఈ వ్యవహరం దుమారాన్ని రాజేసింది. మంత్రి జోగి రమేష్ తాను ప్రాతినిధ్యం వహించే పెడన నియోజకవర్గాన్ని కాదని, మైలవరం నియోజకవర్గంలో చక్రం తిప్పటం, తనకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతల వద్దనే జోగి రమేష్ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయటంపై వసంత కృష్ణ ప్రసాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వీరిద్దరికి సఖ్యత కుదిర్చేందుకు ప్రయత్నించారు. దీంతో తాత్కాలికంగా ఈ వ్యవహరం సర్దుమణిగినప్పటికీ ఆ తరువాత కంటిన్యూ అయ్యింది. దీంతో సీఎం జగన్ ను ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కలిశారు. నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సమీక్షలో భాగంగా తన నియోజకవర్గంలో ఉన్న ఇబ్బందులు గురించి, సొంత పార్టీకి చెందిన నేతలే ఇస్టానుసారంగా వ్యాఖ్యలు చేయటంపై కృష్ణ ప్రసాద్ సీఎం వద్ద తన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఈ వ్యవహారం సర్దుమణగలేదు. ఆ తరువాత కూడా జోగి తన వైఖరిని మార్చుకోకపోవటం, మైలవరం నియోజకవర్గంలో వరుసగా పర్యటించి, తన వర్గాన్ని ప్రోత్సహించే విధంగా వ్యవహారాలు నడిపారు. దీనిపై వసంత మరింత కినుకు వహించారు.


నా కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోరు  


మంత్రి జోగి రమేష్ ప్రస్తుతం ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఏకైక మంత్రి. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి జోగి మైలవరం కేంద్రంగా రాజకీయ వ్యవహారాలు నడిపించారు. అక్కడ టీడీపీ నుంచి మంత్రిగా పని చేసిన దేవినేని ఉమాను సైతం ఢీకొని జోగి నియోజకవర్గంలో నిలబడ్డారు. అయితే ఆ తరువాత ఎన్నికల సమయానికి పరిస్థితుల్లో మార్పు రావటంతో, అనూహ్యంగా వసంత కృష్ణ ప్రసాద్ తెర మీదకు వచ్చారు. సర్వేల్లో మైలవరం నియోజకవర్గం నుంచి అప్పటి మంత్రి దేవినేనిని ఓడించటానికి వసంత కృష్ణ ప్రసాద్ అవసరం ఉందని గుర్తించిన సీఎం జగన్, పెడన నియోజకవర్గానికి జోగి రమేష్ ను పంపి, మైలవరంలో బాధ్యతలను వసంతకు అప్పగించారు. ఆ తరువాత ఎన్నికల్లో వైసీపీ అనూహ్యంగా విజయం సాధిచటం, ఇప్పుడు జోగి రమేష్ మంత్రి అయ్యారు. అయితే మైలవరం నియోజకవర్గంలో ఉంటున్న జోగి కుటుంబం ఇప్పటికి వైసీపీ కోసమే పనిచేస్తుంది. వసంత గెలుపు కోసం తన కుటుంబం తీవ్రంగా శ్రమించిందని, మైలవరంతో వసంత కృష్ణ ప్రసాద్ గెలుపులో తన కుటుంబ పాత్ర కీలకంగా ఉన్న నేపథ్యంలో, నేడు అదే నియోజకవర్గంలో తన కుటుంబం, పార్టీ క్యాడర్, తన మనుషులు బయట వ్యక్తులుగా మారిపోవటంపై జోగి అసహనం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే వసంత కృష్ణ ప్రసాద్ పై ఇప్పటి వరకు ఒత్తిడి తెచ్చిన జోగి తాను మంత్రి అయిన తరువాత నుంచి మరింత వేగాన్ని పెంచి ఏకంగా మైలవరంలోని వ్యవహరాల్లో జోక్యం చేసుకోవటం మొదలు పెట్టారు. దీంతో వసంత కృష్ణ ప్రసాద్ తీవ్ర అసహనంతో ఉన్నారని చెబుతున్నారు. 


సైలెంట్ గా వసంత కృష్ణ ప్రసాద్ 


ప్రస్తుతం వసంత కృష్ణప్రసాదర్ నియోజకవర్గంలో సైలెంట్ అయ్యారు. వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి గతంలో వైసీపీ పార్టీపై చేసిన వ్యాఖ్యలు, ఆ తరువాత టీడీపీ ఎంపీ కేశినేని నానితో సమావేశం కావటంతో అందులో వసంత కృష్ణ ప్రసాద్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. దీంతో వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. అదే సమయంలో జోగి రమేష్ తో వివాదాలు, తీవ్ర ఒత్తిడికి గురైన వసంత కృష్ణ ప్రసాద్ ప్రస్తుతం పార్టీలో సైలెంట్ గా ఉంటున్నారు. మరి ఆయన మౌనం ఎప్పటికి వీడుతారనే అంశంపై పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.