Perni Nani Son :   వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ తరపున పేర్ని నాని పోటీ చేయడం లేదు. ఆయన కుమారుడు పేర్ని కిట్టు మచిలీపట్నం వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని మాజీ మంత్రి కొడాలి నాని ప్రకటించారు. మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ ప్లీనరీని మచిలీపట్నంలో నిర్వహించారు. ఈ ప్లీనరీకి కొడాలి నాని ముఖ్య  అతిధిగా వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పేర్ని నాని కంటే.. పేర్ని కిట్టు గురించే ఎక్కువగా మాట్లాడారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని తప్పక విజయం సాధిస్తారని ప్రకటించారు. కొడాలి నాని ప్రకటనతో వైఎస్ఆర్‌సీపీ వర్గీయుల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 


పేర్ని నాని అప్పుడే రిటైర్మెంట్ తీసుకుంటున్నారా ? 


పేర్ని నానికి వయసయిపోలేదు. ఆయన యాక్టివ్‌గానే ఉన్నారు. పేర్ని కిట్టు కూడా మరీ ముదిరిపోవడం లేదు. ఆయన కూడా యువకుడే . తండ్రి మంత్రిగా బిజీగా ఉన్న సమయంలో ఆయన పార్టీ వ్యవహారాలను మచిలీపట్నంలో చూసుకున్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని అధికారిక సమీక్షలు కూడా చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు వివాదాస్పదమయ్యాయి కూడా . అయితే పేర్ని నాని తాను రిటైర్మెంట్ తీసుకుని కుమారుడికి టిక్కెట్ ఇచ్చేస్తారని ఎవరూ అనుకోలేదు. అయితే కొడాలి నాని ప్రకటనతో  పేర్ని నానిలో ఆ ఆలోచన ఉందని స్పష్టమవుతోంది. పేర్ని నానికి తెలియకుండా... కొడాలి ఇలాంటి ప్రకటన సొంతంగా చేసే చాన్స్ లేదు. 


మచిలీపట్నం పార్లమెంట్ సీటుపై పేర్ని నాని కన్నేశారా? 


అయితే పేర్ని నాని రాజకీయాల నుంచి రిటైర్ కారని.. ఆయన మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తారని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. మచిలీపట్నం ఎంపీగా ప్రస్తుతం వల్లభనేని బాలశౌరి ఉన్నారు. ఆయనతో పేర్ని నానికి సరిపడటం లేదు. ఇటీవల పెద్ద  వివాదం కూడా జరిగింది. పేర్ని నానిపై బాలశౌరి తీవ్రమైన ఆరోపణలు చేశారు. కానీ పేర్ని నాని మాత్రం స్పందించలేదు. బాలశౌరి స్వస్థలం గుంటూరు కాబట్టి ఈ సారి అక్కడ నుంచి  పోటీ చేస్తారని.. పేర్ని నాని మాత్రం పార్లమెంట్‌కు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. 


పార్టీ హైకమాండ్ దృష్టిలోపడటానికే ఇలాంటి వ్యాఖ్యలు చేయించారా ? 


మొత్తానికి కొడాలి నాని ఏకపక్ష ప్రకటన ఉమ్మడి కృష్ణా జిల్లా వైఎస్ఆర్‌సీపీలో చర్చనీయాంశం అయింది. అయితే టిక్కెట్ ప్రకటన చేయడానికి కొడాలి నాని ఎవరని.. హైకమాండ్‌ అంగీకరిస్తేనే కదా ఎవరైనా పోటీ చేసేది అన్న చర్చ కూడా నడుస్తోంది. ఎలాగైదేనే కొడాలి నాని.. ఓ చర్చను మచిలీపట్నంలో ప్రారంభించడంలో సక్సెస్ అయ్యారు. పార్టీ హైకమాండ్ దృష్టికి కూడా పేర్ని నాని కోరిక వెళ్తుందని ఆయన వర్గీయులు అంచనా వేస్తున్నారు.