వైసీపీ ప్లీనరీకి రెడీ అవుతుంది. జులై 8, 9 తేదీల్లో జరిగే ప్లీనరీకి అధికార పార్టీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ కార్యకర్తలను జగన్ స్వయంగా తాను సంతకం చేసిన ఆహ్వన పత్రికతో ఆహ్వనిస్తున్నారు. ఐదే క్రితం ఇదే ప్రాంగంణంలో వైసీపీ ప్లీనరీ జరిగింది. ఇప్పుడు కూడ ఇదే ప్రాంగణంలో ప్లీనరీ నిర్వహస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీకి ఇది తొలి ప్లీనరీ సమావేశం. ఇదే స్పూర్తితో మరో ఐదేళ్ల తరువాత కూడ అధికార పక్షంగానే ప్లీనరి 2027లో మరోసారి నిర్వహిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల వ్యాఖ్యానించారు.
వేదిక ఏర్పాట్లను పార్టీ అగ్రనాయకులు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంత్రి మేరుగ నాగార్జు, మాజీ మంత్రి సుచరిత ఇతర నాయకులు పరిశీలించారు. టార్గెట్ 175 పేరుతో వైసీపీ ఈ సమావేశం నిర్వహిస్తుంది. తొలి రోజున సీఎం జగన్ ప్రసంగంతో ప్లీనరితో ప్రారంభం అవుతుంది. రెండో రోజు కూడా సాయంత్రం జగన్ ప్రసంగంతో ప్లీనరీ ముగుస్తుంది. 8వ తేదీన రాజశేఖర్ రెడ్డి జయంతి కూడా ఉండటంతో పార్టీ నాయకులు ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది. తొలి ప్లీనరి నిర్వహించిన సమయంలో వైసీపీ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి పార్టీ ప్లీనరీ నిర్వహిస్తుండటం విశేషంగా పార్టీ క్యాడర్ భావిస్తోంది.
ఇప్పటికే నియోజకవర్గ స్దాయిలో ప్లీనరీలు వైసీపీ నిర్వహించింది. మరో మూడు రోజుల పాటు జిల్లా స్దాయిలో ప్లీనరీలు నిర్వహిస్తుంది. ఆ తరువాత రాష్ట్ర స్దాయిలో రెండు రోజుల పాటుగా వైసీపీ ప్లీనరీ నిర్వహించటం పార్టీ నిర్ణయం తీసుకుంది. కార్యకర్త మెదలుకొని సీఎం జగన్ వరకు ఈ సమావేశానికి భారీగా తరలి వస్తారని పార్టీ క్యాడర్ భావిస్తుంది.
కిక్ బాబు అవుట్...గెట్ ది పవర్.. అండ్ సర్వ్ ది పీపుల్..అనే నినాదంతో రాష్ట్ర స్దాయి ప్లీనరీని నిర్వహిస్తున్నట్లుగా పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. నవరత్నాలే వైసీపీకి వేద మంత్రాలని, ప్రజల అజెండాపైనే పార్టీ ప్లీనరీలో నిర్ణయాలు ఉంటాయన్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో 175స్దానాలను కైవసం చేసుకుంటామనే ధీమాతోనే ఎన్నికలకు వెళుతున్నామని వివరించారు. వైసీపీ 151 సీట్లుతో విజయం సాధించటం ఒక ఎత్తయితే, ఆ తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా ప్రజలు వైసీపీకే పట్టంకట్టటం చారిత్రాత్మికమైందని పార్టీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇలాంటి విజయం చరిత్రలో ఏ ఇతర పార్టీకి కూడా దక్కలేదని ఆయన చెప్పారు. పార్టీ ప్లీనరికి భారీగా కార్యకర్తలు తరలి వస్తుండటంతో ఏర్పాట్లు కూడ పక్కాగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వర్షాలు పడుతుండటంతో మైదానంలో బురదతో ఇబ్బందులు రాకుండా,ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా,వాటర్ ప్రూఫ్ షామియానాలు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ రహాదారి పక్కనే ప్లీనరీ వేదిక కావటంతో ట్రాఫిక్ సమస్యలు లేకుండా మళ్లింపు చర్యలు కూడ చేయాలని నిర్ణయించారు. సీఎం జగన్ వచ్చి వెళ్లేందుకు వీలుగా ప్లీనరీ వేదిక వద్దనే హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇతర ముఖ్య నాయకులు, మంత్రులు కూడా హజరవుతుండటంతో రహదారి మార్గం ద్వార జగన్ రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.