ఏపీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి మ‌రోసారి నోరు జారారు. త‌మ పార్టీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఆయ‌న భూక‌బ్జాదారుల‌కు నాయ‌కుడిగా అభివ‌ర్ణించారు. అంతే కాకుండా జ‌గ‌న్ మాట్లాడేది అన్యాయ‌మ‌ని, ప్రజ‌లు ఇప్పటికైనా ఆలోచించి మేల్కోనాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.. ఈ మేర‌కు తిరుప‌తి వేదిక‌గా జ‌రిగిన పార్టీ ప్లీన‌రీలో నారాయ‌ణ స్వామి మాట్లాడారు. నారాయ‌ణ స్వామి నోరు జారిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది.


నారాయ‌ణ స్వామి నోరు జారిన వీడియోను టీడీపీ సోషల్ మీడియా విభాగం పోస్టు చేసింది. ఆ వీడియోను తన అన్ని సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేసింది. నిజం నిప్పులాంటిదని ఎక్కువ సేపు నోట్లో దాచుకోలేరని టీడీపీ విమర్శించింది. అంతేకాకుండా జ‌గ‌న్ ప‌ని అయిపోయిందంటూ కూ ఓ హ్యాష్ ట్యాగ్‌ను పెట్టారు.






అంతేకాక, సీఎం జగన్ మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణం సోనియా గాంధీనే అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమెనే తప్పుడు కేసులు పెట్టించి, జగన్ ను అప్పట్లో జైలుకు పంపించిందని ఆరోపించారు. 


అంతేకాక, ఈ వేదికపై చంద్రబాబుపై విమర్శలు కూడా చేశారు. ఆయన ఎన్నికలకు ముందు తన మేనిఫెస్టోలో ఎన్నో వాగ్ధానాలు చేశారని, ఏదీ అమలు చేయలేదని విమర్శించారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు ‘గడప గడపకు..’ కార్యక్రమం ద్వారా ఇంటికి వెళ్తుంటే ప్రతి కుటుంబం స్వాగతం పలుకుతోందని అన్నారు. చంద్రబాబు ఏనాడైనా బీసీలను రాజ్యసభకు పంపించారా? అని ప్రశ్నించారు. యాదవులను ఇద్దరు ఎంపీలను సీఎం జగన్ రాజ్య సభ అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు.