Khammam News: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతుంది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో అంతర్గతంగానే ఒకరిపై మరొక్కరు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ రోజుకొక్క సంచలనాలు సృష్టిస్తున్నారు. ఓ వైపు అదే పార్టీకి చెందిన కార్యకర్తలు బాహాబాహీకి దిగుతుండగా అగ్రనేతలు మాత్రం తమదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవనే విషయంపై ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతుంది. 
ద్రోహులెవరు..? శత్రువులెవరు..?
పాలేరు నియోజకవర్గ పర్యటనలో బాగంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌ పార్టీలో ముసలం రేపుతున్నాయి. రాజకీయ శత్రువులతో తమకు ఇబ్బంది ఉండబోదని, పార్టీలో ఉన్న ద్రోహులతోనే ఇబ్బంది అంటూ వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉంటూ పార్టీ ఓటమికి పాల్పడే వారికి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. అయితే ఇంతకీ పార్టీలో ఉంటూ పార్టీ ఓటమికి కారణం ఎవరయ్యారు..? ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే విషయంపై ఇప్పుడు చర్చ సాగుతుంది. 2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పార్టీ కేవలం ఒకే సీటుకు పరిమితమైంది. అప్పటి వరకు మంత్రిగా ఉండి గెలుపుపై దీమాగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు సైతం ఓటమి పాలయ్యారు. ఈ విషయంపై అప్పట్లో టీఆర్‌ఎస్‌ అధిష్టానంలో విస్త్రతంగా చర్చ సాగింది. ఈ విషయంపై ఒటమి పాలైన నేతలు తమకు సహకరించని వారిపై పిర్యాదులు చేశారు. ఈ విషయంపైనే తుమ్మల వ్యాఖ్యలు చేశారా..? తన ఓటమికి టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నేతలే కారణమయ్యారనే విషయాన్ని ఇప్పుడు మళ్లీ వెలికి తీస్తున్నారా..? అనే విషయంపై చర్చ సాగుతుంది. ఇంతకీ తుమ్మలకు వెన్నుపోటు పొడిచిన టీఆర్‌ఎస్‌ నేతలెవరనేదానిపై కలవరం మొదలైంది. 
పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్న మంత్రి పువ్వాడ..
గత కొద్ది రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీలోని అంతర్గత విబేదాలు రోడ్డుకెక్కాయి. పినపాక నియోజకవర్గంలో విప్‌ రేగా కాంతారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గాల మద్య అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ విషయంపై దాడులు చేసుకున్నారు. వైరా నియోజకవర్గంలోని మదన్‌లాల్‌ వర్గీయులపై జూలూరుపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఏకంగా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు జిల్లాలో టీఆర్‌ఎస్‌ నేతలు ఒకరిపై మరొక్కరు వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ దుమారం లేపుతున్నారు. జిల్లాకు పార్టీ పెద్దన్నలా వ్యవహరించాల్సిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాత్రం ఈ విషయాలపై అంతగా పట్టీపట్టనట్లుగానే వ్యవహరిస్తున్నాడనే విమర్శలు నెలకొన్నాయి. ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గంపై దృష్టి పెడుతున్న మంత్రి పువ్వాడ జిల్లాలో నెలకొన్న అంతర్గత పోరును సద్దుమణిపించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే చెప్పవచ్చు.


అయితే అన్ని విషయాలు అధిష్టానం చూసుకుంటుందని, ఇలాంటి విషయాల్లో తాను తలదూర్చి కొత్తగా తలనొప్పి తెచ్చుకోవడం ఎందుకనే దిశగా మంత్రి పువ్వాడ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీలో నెలకొన్న ప్రస్తుత అంతర్గత పోరు రానున్న ఎన్నికల్లో పార్టీకి పెద్ద దెబ్బగా మారే అవకాశాలు లేకపోలేదనే రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2018 ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించినట్లు ఉమ్మడి జిల్లాలో పార్టీ ఓటమికి తమ నేతలే ఒకరిపై ఒకరు కత్తులతో పొడుచుకున్నారని వ్యాఖ్యానించడం, మరోసారి కూడా ఇది పునరావృతం అయ్యే అవకాశాలు మాత్రం లేకపోలేదు.