దేశంలో సార్వత్రిక ఎన్నికలకు పది నెలల సమయమే ఉంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదనుపెడుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా గళం ఎత్తిన విపక్షాలు పాట్నా సమావేశం తర్వాత ఈసారి బెంగళూరులో ఒక్కటయ్యాయి. సోమవారం (జూలై 2024) విందుతోపాటు ఎన్నికలపై విపక్ష నేతలు మేధోమథనం చేశారు. ఇప్పుడు నేటి (జూలై 17) సమావేశం కీలకం కాబోతోంది. 


కాంగ్రెస్ అధ్యక్షతన విపక్షాల రెండో సమావేశం జరుగుతోంది. కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్, డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు బెంగళూరు సమావేశానికి హాజరయ్యారు.


వీరితో పాటు శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, పిడిపి చీఫ్ మెహబూబా ముఫ్తీ, మరికొందరు నాయకులు భేటీలో పాల్గొన్నారు. 


ప్రతిపక్ష నేతల విందు సమావేశంపై కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ మొదటి రోజు అనధికారిక చర్చలు మాత్రమే జరిగాయని అన్నారు. మంగళవారం మళ్లీ కలుసుకుని అన్ని విషయాలు చర్చించుకుంటామన్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మరికొందరు నేతలు సోమవారం రాలేదు. మంగళవారం నాటి సమావేశానికి ఈ నేతలు హాజరుకానున్నారు. ఇందులో 26 పార్టీలు పాల్గొంటున్నాయి. సభా వేదిక వద్ద 'యునైటెడ్ వి స్టాండ్' అని రాసి ఉన్న బ్యానర్ ఉంది. బెంగళూరు వీధుల్లో కూడా ఈ నినాదానికి సంబంధించిన పోస్టర్లతో నిండిపోయాయి.


మంచి ఆరంభంతో సగం గమ్యానికి చేరినట్టేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి, జాతీయ సంక్షేమం ఎజెండా ప్రచారానికి భావసారూప్యత కలిగిన ప్రతిపక్షాలు కలిసి పనిచేస్తాయి. ద్వేషం, విభజన, ఆర్థిక అసమానతలు, దోపిడీ వంటి నిరంకుశ, ప్రజావ్యతిరేక రాజకీయాల నుంచి భారత ప్రజలను విముక్తులను చేయాలనుకుంటున్నాం. ఈ భారతదేశం కోసం మనం ఐక్యంగా ఉన్నాం అని అభిప్రాయపడ్డారు. 


గత కొన్నేళ్లుగా కేవలం బూటకంగా మిగిలిపోయిన ఎన్డీయేను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రమేశ్ ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశంపై మండిపడ్డారు. ఇది 26 ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చిన ప్రభావం. జూన్ 23న పాట్నాలో సమావేశం విజయవంతమైంది. బెంగళూరులో జరిగే ఈ సమావేశానికి మరిన్ని పార్టీలు హాజరవుతున్నాయి. దీంతో భయాందోళనకు గురైన బీజేపీ ఎన్డీయేను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది అని ఆరోపించారు. 


ఎన్డీయే సమావేశం ఈ సాయంత్రం జరగనుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. మా మిత్రపక్షాలలో 38 మంది మంగళవారం సమావేశంలో పాల్గొనడాన్ని అంగీకరించారు. ఎన్డీయే పట్ల ప్రజల్లో ఆకర్షణ పెరిగిందన్నారు. ఇదొక ఆదర్శవంతమైన కూటమి. ఇది అధికారం కోసం కాదు, సేవ కోసం పొత్తు. భారత్‌ను బలోపేతం చేయడానికే ఈ కూటమి అని అన్నారు. 


ప్రతిపక్షాల కూటమి పునాది స్వార్థంపైనే ఆధారపడి ఉందని జేపీ నడ్డా విమర్శించారు. వారికి నాయకుడుగానీ, ఉద్దేశంగానీ, విధానం గానీ, నిర్ణయాలు తీసుకునే అధికారం గానీ లేవు. ఫొటోలు తీయడానికి ఇది మంచిది అని ఆరోపించారు. 


చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), ఓపీ రాజ్‌భర్‌ చెందిన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ), హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్), ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ వర్గం, ఉపేంద్ర కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్ జనతాదళ్ (ఆర్ఎల్జేడీ), పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన ఈ సమావేశానికి హాజరు కానున్నాయి.


లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ సోమవారం ఎన్డీయేలో చేరారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన అనంతరం జేపీ నడ్డా ట్వీట్ చేస్తూ చిరాగ్ పాశ్వాన్ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎన్డీయే కుటుంబంలోకి ఆయనను స్వాగతిస్తున్నాను.


ఎన్డీయే సమావేశంతోపాటు, ఇప్పుడు మంగళవారం ప్రతిపక్ష పార్టీల అధికారిక సమావేశం జరగబోతోంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీపై ఐక్యంగా పోరాడేందుకు విపక్షాలు తమ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ప్రతిపక్షాలు కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ఆధారంగా పనిచేస్తాయని, ఉమ్మడి మేనిఫెస్టో, ప్రతి స్థానంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష అభ్యర్థిని నిలబెట్టే ప్రతిపాదనపై చర్చిస్తామన్నారు. కూటమి పేరును కూడా చర్చించవచ్చు. ప్రతిపక్షాల చివరి సమావేశం జూన్ 23న పాట్నాలో జరిగింది.


నేషనల్ డెమోక్రటిక్ అలియాన్స్ (ఎన్డీఏ) సమావేశంలో పాల్గొనడం కోసం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోమవారం (జూలై 17) ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ నిర్వహించే ఎన్డీఏ సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. ఢిల్లీ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. సీనియర్ కేంద్ర మంత్రులు కూడా వ్యక్తిగతంగా తనకు ఫోన్ చేసి ఎన్డీఏ సమావేశానికి ఆహ్వానించడం సంతోషాన్ని కలిగించిందని అన్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై చర్చ ఉంటుందని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నాను అన్నారు. పవన్ కళ్యాణ్ తోపాటు పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.