AP Assembly Election 2024: మరోసారి రచ్చకెక్కిన బోస్, వేణు మధ్య రగడ - బోస్ అనుచరుడు ఆత్మహత్యాయత్నంతో కలకలం

AP Assembly Election 2024: రామచంద్రాపురం నియోజకవర్గంలో మంత్రి వేణుకు, ఎంపీ బోస్ కు మధ్య వ్యవహారం ఉప్పూ నిప్పుగా సాగుతోంది. ఈ క్రమంలో బోస్ అనుచరుడు ఒకరు చీమల మందు తాగారు.

Continues below advertisement

AP Assembly Election 2024: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గ టికెట్ కోసం మంత్రి వేణుగోపాల్, ఎంపీ నేతాజి సుభాష్ చంద్రబోస్ మధ్య వ్యవహారం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. మంత్రి వేణు వర్సెస్ ఎంపీ బోస్ అన్నట్లుగా నియోజవర్గంలో రాజకీయం సాగుతోంది. ఈ ఇద్దరి రాజకీయ రగడ మరోసారి రచ్చకెక్కింది. మంత్రి వేణు గోపాల్ కు వ్యతిరేకంగా ఎంపీ బోస్ వర్గీయులు నిన్న సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రపురం టికెట్ ను మంత్రి వేణు గోపాల్ కు రాకుండా అడ్డుకోవాలని ఈ సమావేశంలో బోస్ వర్గీయులు తీర్మానం చేశారు. మంత్రి వేణు అవినీతి అనకొండ అని బోస్ వర్గీయులు విమర్శలు గుప్పించారు. ఈ సమావేశానికి బోస్ వర్గీయుడు శివాజీ కూడా హాజరయ్యారు. తాజాగా శివాజీ.. వైస్ ఛైర్మన్ హోదాలో.. జగనన్న సురక్ష కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఈ క్రమంలో శివాజీని మంత్రి వేణు అనుచరుడు ఆయన ఎదుటే కొట్టాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన శివాజీ చీమల మందు తాగాడు. పురుగుల మందు తాగిన బోస్ వర్గీయుడు శివాజీని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Continues below advertisement

ఒకరు వైసీపీలో సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు.. మరొకరు ఒకప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు జడ్పీ ఛైర్మన్‌గా పని చేశారు. ఇప్పుడు మంత్రి. అయితే వీరిద్ధరి మధ్య రామచంద్రపురం నియోజకవర్గం కేంద్రంగా టిక్కెట్‌ రగడ రాజుకుంటోంది. ఒకప్పుడు సొంత నియోజకవర్గమైన రామచంద్రపురం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున రెండు సార్లు నెగ్గిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పక్క నియోజకవర్గం అయిన మండపేట వెళ్లాల్సివచ్చింది. బోస్‌ సొంత నియోజకవర్గం అయిన రామచంద్రపురంలో రాజోలు నియోజకవర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రంగంలోకి దింపింది వైసీపీ అధిష్టానం. అయితే మండపేటలో బోస్‌ ఓడిపోతే రామచంద్రపురంలో వేణు నెగ్గడం జరిగిపోయింది. 

తన కుమారునికి టిక్కెట్‌ ఇవ్వాలని పట్టు..

రామచంద్రపురం నియోజకవర్గంలో  సమాచార సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణు తన పట్టు నిలుపుకుని మళ్లీ ఇక్కడ తనకే సీటు అంటూ దూసుకుపోవడంతో పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే బోస్‌కు వేణుకు మధ్య అంతర్గత విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయన్న ప్రచారం స్థానికంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యక్రమాలకు సైతం బోస్‌ దూరంగా ఉంటున్నారంటున్నారు. ఇటీవలే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించిన ఉభయగోదావరి జిల్లాల ఇంఛార్జ్‌, ఎంపీ మిథున్‌రెడ్డి నేతృత్వంలోని సమావేశానికి సైతం సుభాష్‌ చంద్రబోస్‌ గైర్హాజరయ్యారు. ఇప్పటికే తన కుమారుడు సూర్యప్రకాష్‌కు అసెంబ్లీ టిక్కెట్టు ఇవ్వాలని బోస్‌ పట్టుపడుతున్నారు. అయితే అధిష్టానం నుంచి ఇంకా ఎటువంటి క్లియరెన్స్‌ రాకపోగా తమ వర్గాన్ని మంత్రి వేణు పూర్తిగా అణగదొక్కుతున్నారని, ఈసారి బోస్‌ తనయునికి టిక్కెట్‌ ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా బరిలోకి దింపుతామని హెచ్చరిస్తున్నారు.

టిక్కెట్టు నాదే అంటున్న మంత్రి వేణు..

రామచంద్రపురం నుంచి ఈసారికూడా తానే పోటీ చేస్తున్నట్లు మంత్రి వేణుగోపాలకృష్ణ ఇప్పటికే పలుసార్లు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తన పని తాను చేసుకుపోతున్నానని, అధిష్టానం తనకే టిక్కెట్టు ఇస్తుందంటున్నారు. తొలిసారి ఎమ్మెల్యే పదవి చేపట్టి మంత్రి పదవిని సంపాదించుకున్న వేణుగోపాలకృష్ణకు మండపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సుభాష్‌ చంద్రబోస్‌ ఓటమి పాలవ్వడం అవకాశం కలిసి వచ్చినట్లయ్యింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొదటి నుంచి బోస్‌ జగన్‌ వెంటే నడిచారు. అయితే 2014లో రామచంద్రపురం నుంచి పోటీ చేసి ఓటమి పాలవ్వడం, 2019ఎన్నికల్లో మండపేట నుంచి సరైన అభ్యర్ధి లేకపోవడంతో అక్కడకు పంపించారు. అక్కడ ఓటమి పాలైనా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి మంత్రి పదవిని ఇచ్చారు జగన్‌.

Continues below advertisement
Sponsored Links by Taboola