Kerala Governor vs CM: కేరళ ప్రఖ్యాత అయ్యప్ప స్వామి దేవాలయం శబరిమల నెలకొన్న పర్యాటక రాష్ట్రం. అయితే.. ఈ రాష్ట్రంలో కొన్నాళ్లుగా సర్కారు(Kerala Governament)కు, గవర్నర్ కు నెలకొన్న వివాదం తీవ్రస్తాయికి చేరింది. కేంద్రానికి అనుకూ లంగా పనిచేస్తున్నారని.. అధికార పార్టీ ఆరోపిస్తుండగా.. తన విధులను కూడా సక్రమంగా చేయనివ్వడం లేదని.. గవర్నర్ ఎదురు దాడి చేస్తున్నారు. దీంతో ఇరు పక్షాల మధ్య వివాదం వీధికెక్కి.. ఇప్పుడు ఏకంగా.. కేంద్ర బలగాలు మోహరించుకునే పరిస్థితికి దిగజారింది.
బిల్లుల నుంచి మొదలు..
కేరళలో కమ్యూనిస్టు నేత C.M. పినరయి విజయన్(Pinarai Vijayan) సర్కారు ఉన్న విషయం తెలిసిందే. ఇది భాగస్వామ్య పార్టీ ప్రభుత్వం. ఇక, గవర్నర్‌గా ఆరిఫ్ ఖాన్(Arif ahmed khan) ఉన్నారు. ఈయన తీసుకునే నిర్ణయాలు వివాదం అవుతున్నాయ ని అధికారపార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. గత ఏడాది ఏకంగా సుప్రీంకోర్టు(Supreme court) లోనూ.. పినరయి విజయన్ సర్కారు గవర్నర్‌పై పిటిషన్ వేసింది. తాము(సభ) ఆమోదించిన బిల్లులను ఉద్దేశపూర్వకంగానే గవర్నర్ తొక్కి పెడుతున్నారని.. ఏళ్లకు ఏళ్లు బిల్లులు ఆగిపోవడంతో మా ఉద్దేశాలు దెబ్బతింటున్నాయని పేర్కొంది.
నియామకాలతో ముదిరి..
ఇది వివాదం కాగా.. సుప్రీంకోర్టు కూడా.. గవర్నర్ ఆరిఫ్‌ను తప్పుబట్టింది. ఏళ్ల పాటు బిల్లులను తొక్కి పెట్టే అధికారం లేదని తేల్చేసింది. ఇలా బిల్లుల(Bills)తో మొదలైన వివాదం గత ఏడాది యూనివర్సిటీ(University) వైఎస్ చాన్సెలర్ల నియామకం విషయంతో మరింత ముదిరింది. యూనివర్సిటీలకు వైఎస్ చాన్సెలర్లను నియమించే అధికారం పూర్తిగా గవర్నర్‌కే ఉంది. అయితే.. ప్రభుత్వం సిఫారసు చేసిన వారిని కాకుండా.. ఆయన తన స్వయం నిర్ణయాన్ని తీసుకుని `కేరళ యూనివర్సిటీ`కి చేసిన ఓ నియామకం తీవ్ర వివాదానికి కారణమైంది.
విద్యార్థి సంఘాల దూకుడు
ఆర్ ఎస్ ఎస్(RSS) సూచించిన వ్యక్తులకు గవర్నర్ పదవి ఇస్తున్నారంటూ.. అధికార పార్టీ ఎల్‌డీఎఫ్(LDF) నేతలు ఆరిపించారు. ఇక, ఈ వివాదంలో సీఎం పినరయి విజయన్ సహా.. ఆ పార్టీ అనుబంధ సంఘం.. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SFI) కూడా జోక్యం చేసుకుంది. ముఖ్యంగా కేరళలో విద్యార్థిసంఘాలు యాక్టివ్‌గా ఉన్న నేపథ్యంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై వారు ఆందోళన, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక, యూనివర్సిటీలో జరిగిన ఒక నియామకం.. వివాదం ప్రస్తుతం భోగిమంటను తలపించే స్థాయికి చేరింది.
ఎక్కడికక్కడ నిరసన
గవర్నర్ ఆరిఫ్‌కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు(SFI) ఉద్యమిస్తున్నాయి. ఆయన ఎక్కడకు వెళ్తే అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో తిరువనంతపురం విమానాశ్రయానికి వెళ్లేందుకు బయటకు వచ్చిన ఆరిఫ్ కాన్వాయ్‌పై.. అతి సమీపం నుంచి వచ్చిన విద్యార్థి సంఘాల నాయకులు ఆయనను నిలువరించి.. నిరసన తెలిపాయి. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ఆరిఫ్ కేంద్రానికి ఫిర్యాదులు చేశారు.
తాజాగా ఏం జరిగింటే..
గవర్నర్ ఆరిఫ్ ఖాన్ ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుండగా SFI కార్యకర్తలు నల్ల జెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన కాన్వాయ్‌కు అడ్డు పడే ప్రయత్నం చేశారు. దీంతో గవర్నర్ తన కారును ఆపి రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్ నుంచి తెచ్చిన కుర్చీపై కూర్చుని అక్కడే నిరసన తెలిపారు. పోలీసులు వేస్ట్ అని వ్యాఖ్యానించారు. పోలీసు కమిషనర్‌ను పిలవాలని తన సిబ్బందిని ఆదేశించిన ఆయన కమిషనర్ రానంటే.. ప్రధానికి ఫోన్ చేయాలని అన్నారు. మొత్తానికి గంటన్నర సేపు హైడ్రామా కొనసాగింది. తర్వాత ఆందోళనకారులపై నాన్ బెయిలబుల్ అభియోగాల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కేంద్ర బలగాలు ఎంట్రీ..
ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘం నాయకులు.. గతంలోనూ ఇప్పుడు కూడా గవర్నర్‌కు అడ్డుతగలడంతో కేంద్రం సీరియస్ అయింది. ఈ విషయంలో జోక్యం చేసుకుని ఆయనను CRPF Z+ భద్రతను కేటాయించింది. Z ప్లస్ సెక్యూరిటీ కవర్ CRPF అందించే అత్యున్నత స్థాయి భద్రత. దీనిలో 10 NSG (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) కమాండోలు, పోలీసులతో సహా 55 మంది సిబ్బంది ఉంటారు. గవర్నర్ కు పది అడుగుల దూరంలోనే అందరినీ వారు నిలువరిస్తారు.
సీఎం ఫైర్
తాజాగా పరిణామాలపై సీఎం పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ఆరిఫ్ ఖాన్ రోడ్డు మీద రచ్చ చేశారని.. ఇది సరికాదని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం Z+ భద్రత కల్పిస్తోందని విమర్శించారు. ``వీరంతా RSS కార్యకర్తలు, ఇప్పుడు ఖాన్ ఈ జాబితాలో చేరారు. ప్రస్తుతం కేరళలో సీఆర్పీఎఫ్ పాలన కొనసాగుతుందా? సాయుధ దళాలు కేసులు కూడా నమోదు చేస్తాయా?. రాష్ట్రంలో ఆ దళాలను మోహరించడం విడ్డూరంగా ఉంది`` అని ముఖ్యమంత్రి విజయన్ అన్నారు.
వివాదం పెరిగే అవకాశం
కేంద్రం జోక్యంతో రాష్ట్రంలోపరిస్థితులు సర్దు మణగకపోగా.. మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో మెజారిటీ స్తానాల్లో పాగావేయాలని భావిస్తున్న బీజేపీ.. ఇక్కడ పొత్తు కూటమి పార్టీలను బలహీనం చేయడం ద్వారా.. తాను బలపడాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే.. గవర్నర్‌కు భద్రత పెంచి, ఇతర విషయాలపై చోద్యం చూస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. త్వరలోనే పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇక్కడి స్థానాలపై బీజేపీ దృష్టిపెట్టడమే సమస్యలకు ప్రధాన కారణమని అంటున్నారు పరిశీలకులు.