KCR Temple Visits : రాజకీయ జీవితంలో మరో కీలకమైన నిర్ణయం తీసుకుంటున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ .. సెంటిమెంట్‌గా తాను చేయాలనుకున్న పనులను చేస్తున్నారు. కేసీఆర్‌కు సెంటిమెంట్లు, భక్తి ఎక్కువ. ఆయన ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కొన్ని ఆలయాలను విధిగా సందర్శిస్తారు. అందులో భాగంగా ఈ సారి కూడా కేసీఆర్ పలు ఆలయాలకు వెళ్లనున్నారు. శుక్రవారం  కేసీఆర్  యాదాద్రికి  వెళ్లనున్నారు. ఉదయం 10.30కు ప్రగతిభవన్ నుంచి రోడ్డు మార్గాన వెళ్తారు.  11.30 కు అక్కడికి చేరుకుని స్వామివారిని దర్శించుకోనున్నారు. మూడు గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 4 గంటలకు తిరిగి ప్రగతిభవన్ కు చేరుకోనున్నారు. ఇది పూర్తిగా ప్రత్యేక పూజల కోసం వ్యక్తిగత పర్యటనగా తెలుస్తోంది. 


దసరా కంటే ముందే సిద్దిపేట  కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు 


దసరా కంటే ముందే సిద్ధిపేటలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామిని కేసీఆర్ దర్శించుకునే అవకాశం ఉంది. దసరా రోజున ప్రత్యేక పూజలు చేసి కేసీఆర్ కొత్త పార్టీని ప్రకటించనున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దసరా రోజు మధ్యాహ్నం 1.19 నిమిషాలకు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ఉంటుంది. ల అదే రోజున టీఆర్ఎస్ఎల్పీ భేటీ నిర్వహిస్తారు. అందరి ఆమోదంతో జాతీయ పార్టీ ప్రకటించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఏకాభిప్రాయం మేరకు... పార్టీ ప్రకటన ఉంటుంది. ఇప్పటికే టీఆర్ఎస్ జిల్లా పార్టీల అధ్యక్షులు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని స్వయంగా తీర్మానాలు చేశారు. ఇప్పటికే పలువురు మంత్రులు కీలక నేతలు..,  కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని ప్రకటనలు చేస్తున్నారు. 


దసరాకు లాంఛనంగా ప్రకటన చేయాలని కేసీఆర్ నిర్ణయం


గతంలో జాతీయ నేతలందర్నీ పిలిచి  కనీ వినీ ఎరుగని రీతిలో బహిరంగసభ నిర్వహించి జాతీయ పార్టీ ప్రకటన చేయాలనుకున్నారు కేసీఆర్. అయితే ఈ సారి పార్టీ పరమైన ప్రకటన మాత్రం ముహుర్తం ప్రకారం చేసి ఆ తర్వాత బహిరంగసభ నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. త్వరలో కరీంనగర్‌లో బహిరంగసభ నిర్వహించి బీజేపీయేతర సీఎంలను అందర్నీ పిలిచి.. ఆ వేదికపై జాతీయ పార్టీ విధివిధానాలను ప్రకటించే యోచనలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ పేరును దసరా రోజున ప్రకటించి.. బహిరంగసభలో జెండా, అజెండాను ప్రకిటంచే అవకాశాలు ఉన్నాయి. 


భారత రాష్ట్ర సమితి పేరుకే మొగ్గు చూపుతున్నట్లుగా చెబుతున్న టీఆర్ఎస్ వర్గాలు


తెలంగాణలో పట్టు నిలుపుకోడానికైనా సరే జాతీయ పార్టీ పెట్టాలని కేసీఆర్ అనుకుంటున్నారు. పరిస్థితులు అనుకూలించకపోయినా రైతు ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నారు. జాతీయ పార్టీ పేరును భారత రైతు సమితి లేదు..  భారత రాష్ట్ర సమితిగా ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే జాతీయ పార్టీ పెట్టిన తర్వాత టీఆర్ఎస్ అందులో విలీనం అవుతుందా.. లేకపోతే విడి పార్టీగా కొనసాగుతుందా అనేది..కేసీఆర్ పార్టీ ప్రకటన తర్వాత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. 


పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై అధ్యయనం జరగాల్సిందే - కేంద్రానికి స్పష్టం చేసిన ఏపీ పొరుగురాష్ట్రాలు!