KCR Vs Governer : అయితే బడ్జెట్ లేకపోతే అసెంబ్లీ - ఏదో ఒకటి వాయిదా తప్పదా ? కేసీఆర్ వ్యూహం ఏమిటి ?

గవర్నర్ విషయంలో కేసీఆర్ వ్యూహం మార్చుకోవడంతో అసెంబ్లీ సమావేశాలపై ఎఫెక్ట్ పడుతోంది. అయితే బడ్జెట్ లేకపోతే అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

Continues below advertisement

 

Continues below advertisement

KCR Vs Governer :  గవర్నర్‌తో ఎలా వ్యవహరించాలన్నవిషయంలో తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టత కొరవడటంతో తొలి ఎదురు దెబ్బ గట్టిగా తగిలింది. టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా అసలు  గవర్నర్ ఉనికిని గుర్తించకూడదన్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించి చివరికి న్యాయపోరాటానికీ వెళ్లింది. కానీ పరిస్థితులు అర్థమైన తర్వాత వెనక్కి తగ్గక తప్పలేదు. ఇప్పుడు .. అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ ప్రసంగంతోనే ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు అనేక సమస్యలు చుట్టు ముుడుతున్నాయి. ముందుగా అనుకున్నట్లుగా మూడో తేదీన బడ్జెట్  ను ప్రవేశ పెట్టడం కష్టం.. అసలు ఆ రోజున అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభించడం కష్టమన్న వాదన వినిపిస్తోంది. దీనికి కారణం సాంకేతికపరమైన అంశాలే. 

అసెంబ్లీని ప్రోరోగ్ చేయకపోవడం మొదటి సమస్య ! 

గవర్నర్‌తో సంబంధం లేకుండా అసెంబ్లీ సమావేశాలను ఇటీవలి కాలంలో నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం గత నాలుగు మూడు సెషన్లుగా ప్రోరోగ్ చేయలేదు. గతేడాది సెప్టెంబర్లో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. అయితే అసెంబ్లీని ప్రోరోగ్ చేయలేదు. దీంతో గత సమావేశాలకు కొనసాగింపుగానే.. ఫిబ్రవరి సెషన్స్ కొనసాగుతాయని ప్రకటించారు.కొత్త సమావేశాలు కాదని.. పాత సమావేశాలకు కొనసాగింపేనని చెబుతూ.. శాసనసభ 8వ సెషన్ 4వ విడత సమావేశాలంటూ ప్రకటన చేశారు. ఈ కారణంగానే గవర్నర్ ప్రసంగం అవసరం లేదని ప్రభుత్వం వాదిస్తోంది. గత ఏడాది కూడా ఇదే వాదన వినిపించారు. 

ఇప్పుడు గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం ప్రకటన !

ఇప్పుడు హైకోర్టుకు గవర్నర్ ప్రసంగం ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.  దీంతో ఇప్పుడు గవర్నర్ ప్రసంగం కోసం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు గవర్నర్ ప్రసంగం చేయాలంటే.. సభను ప్రోరోగ్ చేసి మళ్లీ కొత్తగా సమావేశానికి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అధికారుు చెబుతున్నారు. సాధారణంగా బడ్జెట్ సమావేశాలకు ముందు ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగిస్తారు. అంతకు ముందు అసెంబ్లీ సెషన్స్ ముగిసిన వెంటనే ప్రోరోగ్ చేస్తారు. మళ్లీ నోటిఫికేషన్ గవర్నర్ ఆమోదంతో చేయాల్సి ఉంటుంది. గవర్నర్ తో విబేధాలు ముదిరిన తర్వాత ప్రోరోగ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధపడలేదు. ఇప్పుడు గవర్నర్ ప్రసంగానికి అంగీకారం తెలిపినందున మళ్లీ ప్రోరోగ్ చేసి సమావేశం జరపాల్సి ఉంటుంది. ఇందు కోసం వారం రోజుల గ్యాప్ ఉండాలన్న అభిప్రాయం అధికారవర్గాల్లో వినిపిస్తోంది. 

అసెంబ్లీ సమావేశాలన్నా వాయిదా వేయాలి.. లేదా బడ్జెట్ అయినా సరే !

ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితులతో సీఎం కేసీఆర్.. సభను ప్రోరోగ్ చేసి మళ్లీ నిర్వహించడానికి అసెంబ్లీ సమావేశాలను ఓ వారం పాటు వాయిదా వేయాల్సి ఉంటుంది. ఒక వేళ అలా చేయాల్సిన పని లేదు.. నేరుగా గవర్నర్‌తో ప్రసంగం చేయించవచ్చని అనుకుంటే.. గత ఏడాది తప్పు చేసినట్లుగా ప్రభుత్వం అంగీకరించినట్లు అవుతుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఎలా అయినా గవర్నర్ ప్రసంగాన్ని మూడో తేదీనే ఏర్పాటు చేస్తే.. ఆ రోజు ప్రవేశ పెట్టాలనున్న బడ్జెట్‌ను వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. గవర్నర్ ప్రసంగం.. అదే రోజు బడ్జెట్ పెట్టడం సాధ్యం కాదు. గవర్నర్ ప్రసంగం తర్వాత.. ఆ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం కూడా చర్చ చేపట్టి చేయాల్సి ఉంటుంది. ఎలా చూసినా బడ్జెట్ నైనా వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. 

గవర్నర్ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించకుండా దూకుడుగా వెళ్లడం వల్లనే తెలంగాణ ప్రభుత్వానికి ఈ ఇబ్బందులు వస్తున్నాయన్న అభిప్రాయం బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. 

Continues below advertisement
Sponsored Links by Taboola