KCR Plan For Elections : తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాల్లో అపర చాణక్యుడు. ఈ విషయాన్ని రాజకీయ ప్రత్యర్థులు కూడా ఒప్పుకుంటారు. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఆయన ఏ వ్యూహం రెడీ చేస్తున్నారన్నది చాలా మందికి అంతుబట్టని అంశంగా మారింది. కేసీఆర్ వ్యూహాల్లో ఓటర్లను పథకాల్లో ముంచడం అనేది కీలకంగా ఉంటుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మూడో సారి అధికారంలోకి తీసుకు రావడానికి నాలుగు నెలల్లో నలభై వేల కోట్ల రూపాయలు ఓటర్లకు లబ్ది చేకూర్బబోతున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
పెద్ద ఎత్తున పథకాల అమలు
తెలంగాణ ప్రజలకు వచ్చే నాలుగు నెలల పాటు పథకాల పంట పండనుంది. కేసీఆర్ వచ్చే నాలుగు నెలల పాటు ఓటర్లందరికీ నలభై వేల కోట్లు పంచడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇందు కోసం అనేక రకాల పథకాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. వివిధ పథకాలను అమలు చేయడంతోపాటు.. పెండింగ్‌లో ఉన్న వాటికీ నిధులు మంజూరు చేయనున్నారు. కేసీఆర్ అమ్ములపొదిలో ఇప్పటికీ చాలా పథకాలు రెడీగా ఉన్నాయి. ఎప్పట్లాగే రైతుబంధు నిధులు కూడా ఈ సారి ఎన్నికల సమయంలోనే రైతుల ఖాతాల్లో పడతాయి. ఇక కొత్తగా ప్రవేశ పెట్టిన దళితబంధు, గృహలక్ష్మి, బీసీలకు రూ.లక్ష ఆర్థిక చేయూత అమలును ప్రారంభిచేస్తున్నారు. బీసీలకు రూ. లక్ష కావాలంటే దరఖాస్తు చేసుకోండి అనే లింక్ కూడా ఇప్పటికే అందుబాటులోకి తెచ్చేశారు.
పెండింగ్ లో ఉన్న నిధులన్నీ మంజూరు
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, స్కాలర్‌షిప్‌లు, కేసీఆర్ కిట్, పల్లెలకు, మున్సిపాలిటీలకు, మన ఊరు మన బడి వంటి వాటికి కూడా ఇప్పుడు వరుసగా నిధులు మంజూరు కానున్నాయి. సెప్టెంబర్ దాకా ప్రతి స్కీమ్‌కు రూ. వేల కోట్లు విడదలవుతూ ఉంటాయి. వానాకాలం సీజన్ రైతుబంధుకు రూ.7,500 కోట్లు రైతు ఖాతాల్లో జమ చేయనున్నారు. దళితబంధు కోసం 5వేల కోట్ల మేర ఖర్చు చేస్తామని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు గృహలక్ష్మి స్కీమ్ కింద రూ.3 వేల కోట్ల నుంచి రూ.4వేల కోట్ల దాకా ఇవ్వనున్నారు. బీసీలకు ఆర్థిక చేయూత కింద ఇచ్చే రూ.లక్ష కోసం రూ.2 వేల కోట్లు ఖర్చు చేయనుంది. రుణమాఫీ కోసం రూ.6 వేల కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోదంి. గిరిజన సంక్షేమ శాఖలో కొన్ని సబ్సిడీ స్కీముల కోసం రూ.300 కోట్లు ఖర్చు చేస్తారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, మన ఊరు మన బడి, స్కాలర్ షిప్ లు తదితరాలకు రూ.6 వేల కోట్లు విడుదల చేస్తామని ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు.
నిధుల సమీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి
ఇన్ని వేల కోట్లకు పథకాలు పెట్టేస్తే .. మరి నిధులు ఎక్కడ నుంచి వస్తాయన్నది చాలా మందికి వచ్చే డౌట్. దీని కోసం కేసీఆర్ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. ఓఆర్అర్ లీజు, భూముల అమ్మకం, ఎఫ్ఆర్‌బీఎం పరిధిలో ఆర్బీఐ నుంచి బహిరంగ మార్కెట్ రుణాలు .. తెలంగాణ సర్కార్‌కు వచ్చే ఆదాయం ఇలా.. అనేక వనరుల నుంచి సమీకరించుకుంటారు. ఎక్కువగా సంపదను అమ్మడం ద్వారానే సమీకరించుకుంటారని అంటున్నారు. కేసీఆర్ ప్లాన్ అనుకున్నట్లుగా జరిగితే.. నాలుగు నెలల్లో మెజార్టీ ఓటర్లకు ప్రభుత్వం నుంచి నేరుగా నగదు అందుతుంది. ఓట్లు వేసేటప్పుడు ఈ అంశం ప్రభావితం చేయకుండా ఉంటుందా ?