BRS Meeting Analasys : భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ భారీ సక్సెస్ అయింది. అయితే ఈ సభ జాతీయ పార్టీ ఆవిర్భావ సభలా మాత్రం అనిపించలేదనేది ఎక్కువ మంది అభిప్రాయం. కేసీఆర్ జాతీయ అంశాలను ప్రస్తావించినా ఆయన టార్గెట్ మాత్రం తెలంగాణే అన్నట్లు సాగిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేసీఆర్ భారత రాష్ట్ర సమితిని ప్రకటించన తర్వాత ఆవిర్భావ సభను తెలంగాణలో పెట్టరని ఢిల్లీ లేదా యూపీలో పెట్టవచ్చన్న ప్రచారం జరిగింది. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి అధికారిక గుర్తింపు వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క ఇతర రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాల కోసం పర్యటించలేదు. ఆవిర్భావ సభను కూడా ఖమ్మంలో ఏర్పాటు చేశారు. అంతకు మించి తెలుగులోనే ప్రసంగించారు. ఈ సభతో కేసీఆర్ ఆశించిన లక్ష్యం నెరవేరిందా?
ముందు తెలంగాణనే గురి పెట్టినట్లుగా క్లారిటీ !
బీఆర్ఎస్ దేశ స్థాయికి వెళ్లాలంటే ముందు రాష్ట్రంలో గెలవాలి. భారత్ సెంటిమెంట్‌తో ఆయన తెలంగాణలో మొదట విజయాన్ని అందుకోవాలనుకుంటున్నారని ఖమ్మం సభ ద్వారా అంచనా వేస్తున్నారు. జాతీయ స్థాయికి వెళ్లిన నేతకు సొంత రాష్ట్రాల్లో ప్రజల మద్దతు ఉంటుంది. దానికి ప్రధాని నరేంద్రమోదీనే ఉదాహరణ. తమ వాడు ప్రధానిగా వెళ్తున్నాడు.. వెళ్తాడు.. పాలన చేస్తున్నాడు అనే పరిస్థితుల్లో వందకు వంద శాతం పార్లమెంట్ సీట్లు అక్కడి ప్రజలు బీజేపీకే కట్టబెడుతున్నారు. భారత రాష్ట్ర సమితి తొలి ఆవిర్భావ సభను ఖమ్మంలో నిర్వహించడం ద్వారా కేసీఆర్ గుజరాత్‌లో మోదీ స్థాయి ఆదరణను.. తెలంగాణలో తాను పొందాలని అనుకుంటున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే ఖమ్మం సభ నిర్వహించారని.. ఈ విషయంలో కేసీఆర్ ప్లాన్ స్పష్టంగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
బీజేపీని ఢీ కొట్టే నేత.. అండగా ఉండాలని ప్రజలకు సంకేతాలు !
తనకు జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే విషయంలో అన్ని పార్టీల మద్దతు ఉందని.. ఎన్టీఆర్ తర్వాత ఢిల్లీలో చక్రం తిప్పడానికి అన్ని పార్టీలను ఏకం చేసిన నాయకుడు కేసీఆరేనని ఇప్పటికే బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. పదేళ్ల పాలనలో ఎంత చేసినా ప్రజావ్యతిరేకత ఉండటం సహజం. దీన్ని అధిగమించాలంటే.. పాలనకు అతీతమైన ఇమేజ్ తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే.. తెలంగాణ బిడ్డ జాతీయ స్థాయిలో రూలింగ్ చేయడానికి వెళ్తున్నారని.. మద్దతుగా ఉండాలన్న అభిప్రాయాన్ని కల్పించాలి. కేసీఆర్ అదే చేస్తున్నారు. ఖమ్మం సభ ద్వారా తాను జాతీయ స్థాయికి వెళ్తున్నానని లోకల్‌లో అందరూ మద్దతుగా ఉండాలన్న ఓ అభిప్రాయాన్ని వారి మనసులో ట్యూన్ చేయడమే లక్ష్యమని.. ఆ విషయంలో కేసీఆర్ ముందడుగు వేశారని అంటున్నారు.
ఒక్క సభలో మూడు ప్రయోజనాలు పొందినట్లేనా ?
ఖమ్మం భారత్ సింహ గర్జన ద్వారా కేసీఆర్ మూడు రకాల ప్రయోజనాలను ఆశిస్తున్నారు. అందులో మొదటిది బీఆర్ఎస్‌కు దేశవ్యాప్తంగా ప్రచారం తీసుకురావడం.. రెండోది తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ జాతీయ నేత.. ఆయనకు సొంత రాష్ట్ర ప్రజలుగా మనం మద్దతుగా ఉండాలన్న అభిప్రాయం ఏర్పడేలా చేయడంతో పాటు.. .సవాల్‌గా మారిన ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను బీఆర్ఎస్‌కు అనుకూలంగా మార్చుకోవడం. ఖమ్మంలో గతంలోలా కాకుండా మెజార్టీ సీట్లు గెల్చుకోవాలంటే... అక్కడ ఆవిర్భావ సభ నిర్వహించడం అవసరమని కేసీఆర్ భావించారు. అనుకున్నట్లుగా నిర్వహించారు.
ముందు ముందు తీసుకునే నిర్ణయాలే కీలకం !
ఖమ్మం సింహగర్జన సభ ఎఫెక్ట్ ను రాజకీయంగా ఎంత మేర ఉపయోగించుకుంటారన్నది కేసీఆర్ ముందు ముందు తీసుకుబోయే నిర్ణయాలు.. వేయబోయే అడుగులు... పార్టీ నేతల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుంది. ఓ సభ నిర్వహించి.. ఇదే బలం అని చూపించుకోవచ్చు కానీ.. దాన్నే చూపించి బలపడిపోయామని నిర్ణయానికి రాలేరు. కేసీఆర్ తీసుకునే నిర్ణయాలే ముందు ముందు కీలకం కానున్నాయి.