చిత్తూరు : టిడిపి అధినేత‌ నారా చంద్రబాబు నాయుడు బోగస్ ఓట్లతో మెజారిటీ సాధిస్తున్నారని వైసీపి‌ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం సాయంత్రం కుప్పంలోని ఎం.ఎం మహల్ లో స్ధానిక వైసీపి‌ నాయకులు, కార్యకర్తలతో సమావేశంమైన ఎంపీ‌ మిధున్‌ రెడ్డి నాయకులకు,‌ కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేశారు. అనంతరం ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కుప్పంలో రాజకీయ పరిస్ధితులు ప్రత్యేకంగా ఉన్నాయని,‌ చంద్రబాబుకు వచ్చిన మెజారిటీతో అర్థం బోగస్ ఓట్ల అని ఆయన ఆరోపించారు. 
కుప్పంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు
కుప్పం నియోజకవర్గంలో చాలా బోగస్ ఓట్లు ఉన్నాయని, దీనిపై పిర్యాదు చేశాంమని, ఇప్పటికే అధికారులకు పిర్యాదు చేసి దొంగ ఓట్లను తొలగించాంమన్నారు. రాష్ట్ర ప్రజలతో పాటుగా కుప్పంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు 36 వేల బోగస్ ఓట్లు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై తప్పకుండా కేంద్ర ఎలక్షన్ దృష్టికి తీసుకెళ్తాంమన్నారు. అంతే కాకుండా మునిసిపల్ ఎన్నికల్లో 55 శాతం ఓట్లు మాత్రమే పోల్ అయిందని, ఎక్కువ శాతం మంది తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి దొంగ ఓట్లు వేయడానికి వచ్చినట్లు ఆయన చెప్పారు. 
భరత్ ను గెలిపించేందుకు సిద్దం
ఓటర్లుగా లేని వారి ఓటర్లను తొలగించాలని, ఒక పంచాయతీలో ఉండే వాళ్లకు మరొక పంచాయతీలో దొంగ ఓటు ఉందన్నారు. అయితే 2024 లో జరయగబోయే కుప్పం ఎన్నికల్లో ప్రజలు భరత్ ను గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పిన ఆయన, ఏప్రిల్ లోపు కుప్పంలో హంద్రీనీవా పనులు పూర్తి అవుతుందన్నారు. ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నారని, చంద్రబాబు సీఎం జగన్మోహన్ రెడ్డిని మర్యాదగా మాట్లాడాలన్నారు. చంద్రబాబు ప్రజల మనస్సులను గెలవడం మానేసి, అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు ఫ్రస్టేషన్ బాగా పెరిగిపోయిందని, ఆ ఫ్రెస్టేషన్ తోనే పండుగ పూట కూడా మా మంత్రిని నోటికి వచ్చినట్లు మాట్లాడారని విమర్శించారు. 


ఇంతక ముందు చంద్రబాబు వేరు అని, ఇప్పడు చంద్రబాబు వేరే అని ఆయన చెప్పుకొచ్చారు. వాస్తవానికి కుప్పంలో టీడీపీ నేతలే రౌడిజం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఖచ్చితంగా రాబోవు ఎన్నికల్లో కుప్పంలో వైసీపి చంద్రబాబును ఓడిస్తుందని ఆయన ధీమా‌ వ్యక్తం చేశారు. నారా లోకేష్ పాదయాత్రపై స్పందిస్తూ రాష్ట్రంలో ఎవరైనా పాదయాత్ర చేసుకోవచ్చని, ఎవరు పాదయాత్ర చేసుకున్న మాకు ఇబ్బంది లేదని, అంతే గానీ చంద్రబాబు లాగా లోకేష్ మాట్లాడితే ఊరుకునేది లేదని వైసీపి ఎంపీ‌ మిథున్ రెడ్డి హెచ్చరించారు.


కారు ప్రమాదంపై వైసీపీ నేతల కామెంట్స్... 
మంత్రి పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇటీవల కారు ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయం వైసీపీ శ్రేణులలో కలకలం రేపింది. అయితే ఇరువురు నేతలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవటంతో వైసీపీ నేతలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల చిత్తూరు కేంద్రంగా టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి మధ్య రాజకీయంగా హాట్ కామెంట్స్, సవాళ్ల పర్వం కొనసాగుతుంది. ఇదే సమయంలో పెద్దిరెడ్డి ఆయన కుమారుడైన ఎంపీ మిథున్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావటంపై కుట్ర కోణం దాగి ఉందని వైసీపీ శ్రేణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, విచారణ జరిపించాలని వైసీపీ నేతలు కోరుతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణ చేయించాలని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు డిమాండ్ చేశారు.