KCR Bandhu Scheme Politics :  తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక్కో కుటుంబానికి రూ. పది లక్షల సాయం ప్రకటించారు. హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో దళితబంధు ప్రవేశపెట్టారు. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక సమయంలో గిరిజన  బంధు ప్రారంభించబోతున్నారు. ఇది  ఇంతటితో ఆగదు. అన్ని వర్గాలకూ " బంధు " పథకాలు ప్రవేశ పెడతామని కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. ఈ పథకాల సంక్షేమం పేరుతో కులాల వారీగా ఓటర్లను చేజారిపోకుండా  చూసుకుంటున్నామని టీఆర్ఎస్ అనుకుంటోంది. కానీ నిజంగా అలాగే జరుగుతోందా ? ఊహించని విధంగా రివర్స్ అవుతోందా ? 


రైతు  బంధుతో అధికారాన్ని నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ !


ఆరు నెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి 2018 డిసెంబరులో ఎన్నికలకు వెళ్లడానికి ముందు 'రైతుబంధు' తీసుకొచ్చారు సీఎం కేసీఆర్. ఓ విడత రైతులకు పంపిణీ చేసి.. ఎన్నికలు జరిగే సమయంలో రెండో విడత చెక్కులు అందేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీంతో ఆ ఎన్నికల్లో కేసీఆర్ అనూహ్యమైన విజయం సాధించారు. ఈటల రాజేందర్ రాజీనామాతో 2021 డిసెంబరులో జరిగిన హుజరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా 'దళిత బంధు' తెరపైకి వచ్చింది. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో రానున్న మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు 'గిరిజన బంధు' ఉనికిలోకి వస్తున్నది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఏ 'బంధు' వస్తుందనే చర్చ మొదలైంది. 


రైతు బంధుకు దేశవ్యాప్తంగా గుర్తింపు !


రైతు సంక్షేమం కోసం పంట పెట్టుబడి సాయంగా 'రైతుబంధు'ను ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. ఇలాంటి పథకాలు దాదాపుగా అన్ని రాష్ట్రాలు ప్రవేశ పెట్టాయి. చివరికి కేంద్రం కూడా ప్రకటించింది.  ఎకరానికి యేటా రూ.10 వేల చొప్పున రైతులకు అందడం ఉపశమనమే. అయితే ఈ పథకంపై విమర్శలు ఉన్నాయి రైతులకు ఊతమివ్వడానికే రైతుబంధు అని ప్రభుత్వం చెప్పుకుంటున్నా సాగుచేయని భూస్వాములకూ లక్షలాది రూపాయలు ఇస్తున్నది.ప్రజాధనం దుర్వినియోగమవుతున్నదన్న ఆరోపణలు ఉన్నాయి.  కౌలు రైతులను ఈ స్కీమ్ నుంచి మినహాయించారు  


వచ్చే ఎన్నికలకు ముందు బీసీ బంధు ప్రకటిస్తారా ? 


హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా సుదీర్ఘ కసరత్తు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ 'దళితబంధు' స్కీమ్‌ను తెరపైకి తెచ్చారు. సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధికి నోచుకోలేకపోయిన దళిత కుటుంబాలను స్వంత కాళ్లపై నిలబడేలా చేయడమే ఈ స్కీమ్ ఉద్దేశమని చెప్పారు.   ప్రభుత్వం ఇప్పుడు 'గిరిజన బంధు' స్కీమ్‌ తేనున్నట్లు మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ప్రకటించారు.  ఒక్కో ఎన్నిక సందర్భంగా ఒక్కో 'బంధు' పథకాన్ని ప్రవేశపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు 'బీసీ బంధు' తీసుకొస్తుందేమో అనే చర్చలు మొదలయ్యాయి.  టీఆర్ఎస్ కాన్ఫిడెన్స్ లెవల్స్ తగ్గినందునే ఆకర్షణీయమైన పథకాలు అనివార్యమవుతున్నాయి. ఎన్నికల సమయంలో వీటిని ప్రకటించడమంటే ఆయా వర్గాల ప్రజలను దగ్గర చేసుకోవడానికి టీఆర్ఎస్ అధినేత వేస్తున్న ఎత్తుగడలేనన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 


ఇతర వర్గాల్లో అసంతృప్తి !
 
అయితే మాకేంటి.. అనే చర్చలు ప్రస్తుతం తెలంగాణ సమాజంలో నడుస్తున్నాయి. దళితుల్లోనూ అందరికీ ఇవ్వలేరు.  పథకం తీసుకున్న వారు సరే.. అందుకోని వారు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఇది ప్రభుత్వంపై మరో రకమైన వ్యతిరేకత పెరగడానికి కారణం అవుతుంది. అందుకే గతంలో కడియం శ్రీహరి చెప్పినట్లుగా బంధు పథకాలు కత్తి మీద సాము లాంటివే. తేడా వస్తే.. టీఆర్ఎస్‌కే  నష్టం చేస్తాయి.