YSRCP WorkShop : 27 మంది ఎమ్మెల్యేలు పార్టీ అప్పగించిన గడప గడపకూ వైఎస్ఆర్‌సీపీ ప్రోగ్రాంను పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదని సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో నిర్వహించిన వర్క్ షాప్‌లో జగన్ ప్రసంగించారు. గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్నిసీరియస్‌గా తీసుకోడం లేదని .. మొత్తం 27మందిపై జగన్ ఫైరయ్యారు. అందులో నలుగురు మంత్రులు ఉన్నారు. వీరందరూ ఇక నుంచి వారానికి మూడునాలుగు రోజులు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించాల్సిందేననిస్పష్టం చేశారు. కొంత మంది ఎమ్మెల్యేలు ఓ గంట తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నారని.. వారందరి పనితీరుపై మదింపు చేస్తున్నామని.. పనితీరు మార్చుకోపతే టిక్కెట్ ఇచ్చేది లేదని జగన్ స్పష్టం చేశారు.
నవంబర్ ఆఖరి వారంలో మరోసారి మీటింగ్ ఉంటుందని ఎవరి పని తీరు ఏంటి అనేది చివరి ఆరు నెలల్లో చెబుతానని.. అప్పుడే టిక్కెట్లు ఇచ్చేది లేనిది కూడా చెబుతామని జగన్ స్పష్టం చేశారు. మాజీ మంత్రులు బాలినేని, అళ్ల నాని పని తీరు పై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లాలని దొంగదారులు వెతకవద్దని జగన్ వారికి మొహం మీదనే చెప్పారు. నలుగురు మంత్రులు..మాజీ మంత్రులు కాకుండా జగన్ అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యేల్లో.. గ్రంధి శ్రీను, ధనలక్ష్మి, అధిప్ రాజ్, కోటం రెడ్డి శ్రీదర్ రెడ్డి, మేకపాటి చంద్రశఖరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంచి నేతలు ఉన్నారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.
వర్క్ షాప్‌నకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఎన్నికల దాకా గడపగడపకు కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో 175 సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారని సమావేశం తర్వాత ఎమ్మెల్యేలు తెలిపారు. గడపగడపకు కార్యక్రమంలో పనితీరు బాగా లేని వారి సంఖ్య 27గా తేలిందని చెప్పిన జగన్, అయితే నవంబర్‌లో మరోమారు గడపగడపకుపై సమావేశం ఏర్పాటు చేస్తామని, అప్పటిలోగా పనితీరు బాగా లేని వారు పనితీరు మెరుగుపరచుకోవాలని జగన్ సూచించారన్నారు. ఎవరి పనితీరు బాగా లేదో వారికే ఈ విషయం బాగా తెలుసునని జగన్ వివరించినట్లుగా ఎమ్మెల్యేలు తెలిపారు.
పనితీరు ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్లను కేటాయించనున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయాన్ని జగన్ గుర్తు చేశారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఎన్నికలకు ఇంకో 6 నెలల సమయం ఉందనగా టికెట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటానని జగన్ చెప్పినట్లు నాని వెల్లడించారు. ఎన్నికల నాటికి పనితీరు బాగా లేని వారికి టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదన్నారని తెలిపారు.రాజకీయాలను పార్ట్ టైంగా తీసుకునే వారికి అవకాశాలు ఇవ్వలేమని కూడా జగన్ చెప్పారన్నారు. రాజకీయాలను వృత్తిగా తీసుకున్న వారే రాణిస్తారని చెప్పారన్నారు. ఎన్నికల్లో సీట్లు కావాలంటే జనంలో ఉండాల్సిందేనని జగన్ తెలిపారన్నారు.
జగన్ తెలిపిన 27 మందిలో ఆరేడుగురు మంత్రులు కూడా ఉన్నారు. మంత్రి పదవుల్లో ఉన్నందున సీరియస్‌గా తిరగలేకపోతున్నామని కొందరు చెబుతున్నారు. అయితే అలాంటివేమీ ఉండవని.. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ గడప గడపకూ వెళ్లాల్సిందేనని జగన్ స్పష్టం చేశారు.