Ysrcp Seat Changes : నీ సీటెక్కడ ? ..ఈ డైలాగ్ ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేతల్లో తరచుగా వినిపిస్తోంది. ఎక్కువ మంది  సమాధానం.." ఏమో.. నాకేం తెలుసు?" అనేదే. ఎందుకంటే ఈ సారి వైఎస్ఆర్‌కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి భారీ ప్రయోగాలు చేయబోతున్నారు. అభ్యర్థులు అందర్నీ పక్కన పెట్టలేరు. అలాగని ఉన్న చోటే టిక్కెట్లు ఇవ్వలేరు. అందుకే ఆయన స్థానాల్ని మార్చబోతున్నారు. స్థానికేతరులు అయినప్పటికీ ఆ సమీకరణం చూసుకోకుండా సామాజిక లెక్కలు చూసుకుని సీట్లను మార్చేస్తున్నారు. ఈ అంశంపై ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీలో జోరుగా చర్చ జరుగుతోంది. 


సిట్టింగ్‌ల స్థానాలు మార్పు చేయాలని ఇప్పటికే జగన్ నిర్ణయం !?


సిట్టింగ్‌ల స్థానాలను మార్చాలని సీఎం జగన్ ఇప్పటికే నిర్ణయంమ తీసుకున్నట్లుగా వైఎస్ఆర్‌సీపీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. జాబితాలో పలువురు మంత్రులు, ఎంపీలు ఉన్నట్లుగా చెబుతున్నారు.   ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రెండోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేయాలంటే గెలుపు గుర్రాల‌దే ప్ర‌ధాన బాధ్య‌త అని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఖ‌రాఖండిగా చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, ఎమ్మెల్యేల వ్యతిరేకత కలిస్తే మొదటికే మోసం వస్తుంది. అలా కాకుండా ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాలని నిర్ణయించారు.  విజ‌యం సాధించ‌డానికి అవ‌కాశాలున్న వ్య‌క్తుల‌నే ఎమ్మెల్యేలుగా ఎంపిక చేస్తాన‌ని, ప‌నితీరు బాగోలేని ఎమ్మెల్యేలు త‌మ గ్రాఫ్ ను మెరుగుప‌రుచుకోవ‌డానికి ఆరునెల‌ల స‌మ‌యం కూడా ఇచ్చారు.


అభ్యర్థుల మార్పుపై ముందుగానే సూచనలు !


తాడికొండ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్‌ను అద‌న‌పు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించ‌డంద్వారా రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌నితీరు బాగోలేని ఎమ్మెల్యేలంద‌రికీ సంకేతాలు పంపించిన‌ట్లయింది. డొక్కాను నియ‌మిచండంద్వారా రాబోయే ఎన్నిక‌ల్లో శ్రీ‌దేవికి టికెట్ లేద‌ని జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి చెప్ప‌క‌నే చెప్పేశారు. డొక్కాకు ఎలాగైతే బాధ్య‌త‌లు అప్ప‌జెప్పామో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోన్న మ‌రికొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా ఇత‌రుల‌కు బాధ్య‌త‌ల అప్ప‌గించేందుకు ముఖ్య‌మంత్రి సిద్ద‌ప‌డుతున్నారు.ఇక  హిందూపురం లోక్‌సభ స్థానం నుంచి మంత్రి ఉషాశ్రీచరణ్ ను పోటీ పెట్టాలని జగన్ డిసైడయ్యారని చెబుతున్నారు.  న్యూడ్ వీడియో కార‌ణంగా ఇటీవ‌ల వార్త‌ల్లో నిలిచిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ స్థానంలో క‌ల్యాణ‌దుర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న స్త్రీ శిశు సంక్షేమ‌శాఖ మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్‌ను రంగంలోకి దింపాల‌నే ప్ర‌య‌త్నాలు వైసీపీలో జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌కు ప‌త్తికొండ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం కేటాయిస్తార‌ని పార్టీలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయన స్వగ్రామం ఆ నియోజకవర్గ పరిధిలోనే ఉంటుంది.  ఉషాశ్రీ చ‌ర‌ణ్ ను హిందూపురం పంపించి క‌ల్యాణ దుర్గంలో కాంగ్రెస్ పార్టీ నేత ర‌ఘువీరారెడ్డి కుమార్తె పేరును ప‌రిశీలిస్తున్నారు.


ఆళ్ల , అంబటి సీటు మార్పు !


ప్ర‌స్తుతం మంగ‌ళ‌గిరి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిని స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి పంపించి, అక్క‌డి నుంచి మంత్రిగా ఉన్న అంబ‌టి రాంబాబును అవ‌నిగ‌డ్డ‌కు పంపించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లుగా తెలుస్తోంది. మంగళగిరి నుంచి పోటీకి ఈ సారి బీసీ అభ్యర్థిని రంగంలోకి దించుతున్నారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన గంజి చిరంజీవికే టిక్కెట్ ఇస్తారని.. అదే హామీతో ఆయనను పార్టీలో చేర్చుకున్నారని చెబుతున్నారు. మంగళగిరి నుంచి రెండు సార్లు గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లి పంపాలని అనుకుంటున్నారు. ఇక అంబటి రాంబాబును కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి పోటీ చేయించాలని దాదాపుగా నిర్ణయించారు. అక్కడి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ పనితీరు బాగోలేకపోవడంతో ఆయనకు ఈ సారి మొండి చేయి చూపించనున్నట్లుగా తెలుస్తోంది.  సినీ నటుడు సుమన్‌ను రేపల్లె నియోజక వర్గం నుంచి పోటీచేయించేట‌ట్లుగా ప‌రిశీల‌న జ‌రుగుతోంద‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. 


ఎమ్మెల్యేగా నందిగం సురేష్ పోటీ !


బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్ ఎమ్మెల్యేగా పోటీచేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్న త‌రుణంలో ఆయ‌న్ను వేమూరు నుంచి బ‌రిలోకి దింపి మంత్రి మేరుగ‌ నాగార్జునను బాపట్ల పార్లమెంటు నియోజక వర్గం నుంచి పోటీ చేయిస్తారని తెలుస్తోంది. మెజారిటీ స్థానాల్లో పోటీచేసే అభ్య‌ర్థుల జాబితాను డిసెంబ‌రుక‌ల్లా పూర్తిచేయాల‌నే ఉద్దేశంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా  పోటీ చేసే నియోజకవర్గాల ఊహించని విధంగా కేటాయించబోతున్నట్లుగా తెలుస్తోంది.