BJP Finishing Touch :   మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో జరుగుతున్నాయి. ప్రతీ రోజూ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. బీజేపీ నుంచి పెద్ద ఎత్తున నేతల్ని చేర్చుకుని ఇప్పటికే టీఆర్ఎస్ .. మైండ్ గేమ్ ప్రారంభించింది. ఆ పార్టీ ముఖ్య నేతలంతా టీఆర్ఎస్‌లోకి వస్తారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. దీనికి బీజేపీ కౌంటర్ ఇవ్వాలనుకుంటోంది. ప్రచారం ముగింపు రోజున కీలక నేతలకు కండువా కప్పి టీఆర్ఎస్‌కు షాకివ్వాలని నిర్ణయించుకున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయంటున్నారు. 


ప్రచారం చివరి రోజున భారీ బహిరంగసభకు బీజేపీ ప్లాన్


ప్రచారం చివరి రోజున బీజేపీ మరోసారి భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. ఇదివరకే ఓ సారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేత బహిరంగ సభ ఏర్పాటు చేసిన కమలనాధులు అక్టోబర్ 31న సభను ప్లాన్ చేసుకున్నారు.  ఈ సారి మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మునుగోడు నియోజకవర్గంలో జేపీ నడ్డాకు సమాధి కట్టిన వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై టీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  టీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టేందుకు జేపీ నడ్డాను రంగంలోకి దింపబోతున్నారు. 


బహిరంగసభకు ముఖ్య అతిధిగా బీజేపీ అధ్యక్షుడు నడ్డా హాజరయ్యే అవకాశం
 
మునుగోడు నియోజకవర్గంలో తప్పక గెలవాలని పార్టీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా నోటిఫికేషన్ వెలువడకముందే టీఆర్ఎస్, బీజేపీలు తమ అగ్ర నేతలతో ఓ సారి మీంటింగ్ లను ఏర్పాటు చేశాయి. తాజాగా ప్రచారం ముగింపు దగ్గర పడుతున్న కొద్ది ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అగ్రనేతలు మరోసారి రంగంలోకి దిగబోతున్నారు. ఇప్పటికే ఓ సారి మునుగోడులో పర్యటించిన సీఎం కేసీఆర్ మళ్లీ ప్రచారంలో పాల్గొంటారో లేదో స్పష్టత లేదు. కేసీఆర్ సభ ఉంటే.. 30వ తేదీ ఉండవచ్చని చెబుతున్నారు. అయితే కేసీఆర్ ప్రచారం ఉండకపోచవచ్చని..మరోసారి కేటీఆరే మునుగోడులో పర్యటించవచ్చని చెబుతున్నారు. 


పోలింగ్‌కు ముందు టీఆర్ఎస్ కీలక నేతలకు బీజేపీ కండువా కప్పే చాన్స్


కేటీఆర్ ప్రచారం ఉన్నా లేకపోయినా .. పోలింగ్ ముందు టీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని షాక్ ఇవ్వాలని బీజేపీ పెద్దలు పట్టుదలగా ఉన్నారు. మాజీ ఎంపీ నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడాన్ని సీరియస్‌గా తీసుకున్న కేసీఆర్.. బీజేపీలోని బీసీ లీడర్లపై ఆకర్ష్ ప్రయోగించారు. దీంతో దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ వంటి నేతలు మళ్లీ కారెక్కారు. వారి స్థాయి కంటే పెద్ద నేతల్నే టీఆర్ఎస్ నుంచి లాగాలని బీజేపీ నేతలు నిర్ణయించుకున్నారు. బీజేపీ ప్రణాళిక ప్రకారం చూస్తే.. పోలింగ్‌కు ముందు బీజేపీ పెద్ద షాకివ్వడం ఖాయమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇది మైండ్‌ గేమ్‌లో భాగమా.. నిజమా అనేది.. ప్రచారం చివరి రోజునే తేలుతుంది. 


రాహుల్ అడుగు రాత మార్చేస్తుందా ? - భారత్ జోడో యాత్రకు టీ పీసీసీ భారీ ఏర్పాట్లు !