Bharat Jodo Yatra : రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర ఆదివారం తెలంగాణలో ప్రవేశించనుంది. కన్యాకుమారి నుండి కాశ్మీరు వరకు సాగుతున్న రాహుల్ కవాతు ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో 1500 కిలోమీటర్ల వరకు సాగింది. కర్నాటకలోని రాయచూర్ నుండి ఆదివారం ఉదయం 10 గంటలకు తెలంగాణాలోని మహబూబ్ నగర్ జిల్లా, గూడబెల్లూరులో అడుగుపెట్టనుంది. రాహుల్ భారత్ జోడో యాత్రను స్వాగతించేందుకు టిపిసిసి ఘన ఏర్పాట్లు చేసింది.
దీపావళి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు విరామం
తెలంగాణ పాదయాత్ర అడుగు పెట్టిన వెంటనే మూడు రోజుల పాటు విరామం ప్రకటిస్తారు. గూడబెల్లూరులో అల్పాహారం అనంతరం మద్యాహ్నం నుండి యాత్ర దీపావళి నిమిత్తం మూడు రోజులపాటు అంటే 26వ తేది వరకు బ్రేక్ తీసుకుంటారు. మళ్లీ 27 తేది ఉదయం గూడబెల్లూరులో ప్రారంభం కానున్న యాత్ర మక్తల్ చేరుకుంటుంది తెలంగాణాలో సుదీర్ఘంగా 16 రోజులపాటు 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 375 కిలోమీటర్ల మేరకు కొనసాగేలా రూట్ మ్యాప్ ఖరారు చేశారు. నవంబర్ 7న మహారాష్ట్రలో ప్రవేశిస్తుంది. 16 రోజుల యాత్రలో దీపావళికి మూడు రోజులు, నవంబర్ 4న ఒక రోజు సాదారణ బ్రేక్ తీసుకోంటాు.
నెక్లెస్ రోడ్ పాదయాత్రకు సోనియా, ప్రియాంకా గాంధీ హాజరయ్యే అవకాశం
కొన్ని ప్రాంతాల్లో కార్నిర్ మీటింగులు, మరి కొన్ని ప్రాంతాల్లో ఉదయపు అల్పాహారం, మరి కొన్ని ప్రాంతాలలో నైట్ హాల్ట్ లు చేస్తూ రాహుల్ గాంధి రోజుకు 20 నుండి 25 కిలోమీటర్ల మేరకు పాదయాత్రతో ముందుకు సాగనున్నారు. ఇక హైదరాబాద్ నగరంలోని బోయినపల్లిలో ఒకరోజు నైట్ హాల్ట్ చేయనుండగా నెక్లెస్ రోడ్ లో కార్నర్ మీటింగ్ లో రాహుల్ పాల్గొని ప్రసంగించనున్నారు. నెక్లెస్ రోడ్ పాదయాత్రకు సోనియా, ప్రియాంకా గాంధీ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక్క రోజైనా పాదయాత్రలో పాల్గొనాలని.. గాంధీ కుటుంబ నేతలను తెంగాణ నేతలు కోరుతున్నారు.
భారీ ఏర్పాట్లు చేస్తున్న టీ పీసీసీ !
భారత జాతి సమైక్యతా నినాదంతో తెలంగాణాలో అడుగుపెడుతున్న రాహుల్ గాంధి భారత్ జోడో యాత్రకు టిపిసిసి విసృత ఏర్పాట్లు చేయనుంది. పలు బృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నర్ సమావేశాలలో కాంగ్రెస్ బలాన్ని నిరూపించుకునే విదంగా ప్రత్యేక కార్యక్రమాలతోపాటు పాదయాత్రలో అనుసరించాల్సిన విధి విదానాలతోపాటు రూట్ మ్యాప్ పై పిసిసి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. సీనియర్ నేతలు సారధ్యం వహించనున్న ఈ 10 కమిటీలతో పాదయాత్ర పొడవునా యాత్రను సమన్వయం చేసుకుంటూ రాహుల్ గాంధితో కలిసి ముందుకు సాగనున్నారు. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న నేతలు.. భారత్ జోడో యాత్రను కూడా సమన్వయం చేసుకుని ముందుకు సాగుతున్నారు.
అంతర్గత రాజకీయాలతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీకి... భారత్ జోడో యాత్ర మంచి ఫలితాన్ని ఇస్తుందని.. శ్రేణుల్లో జోష్ తెస్తుందని కాంగ్రెస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు.