Vangaveeti Nadendal Meet :  ఏపీ రాజకీయాల్లో రెండు పార్టీలకు చెందిన వారు ఎవరైనా భేటీ అయితే జరిగే హడావుడి అంతాఇంతా కాదు. తాజాగా టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణతో జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ సమావేశం అయ్యారు. వంగవీటి ఇంటికి వెళ్లిన నాదెండ్ల దాదాపుగా అరగంట సేపు చర్చలుజరిపారు. వీరు అలా చర్చలు ప్రారంభించడంతో  బయట వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలోకి వెళ్తారంటూ పుకార్లు ప్రారంభించాయి. అయితే భేటీ ముగిసిన తర్వాత ఇద్దరూ నేతలు చాలా కూల్‌గా రిప్లయ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ మూడో తేదీన చేపట్టనున్న జనవాణి కార్యక్రమం ఏర్పాట్లు పరిశీలించేందుకు వెళ్లారు. ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆడిటోరియం పక్కనే  ఉన్న తన ఇంటికి వచ్చారని.. తమ మధ్య రాజకీయాలేం చర్చకు రాలేదని వంగవీటి రాధాకృష్ణ తెలిపారు.


మర్యాదపూర్వకంగానే వంగవీటిని కలిశానన్న నాదెండ్ల 


నాదెండ్ల మనోహర్ కూడా దాదాపుగా అదే చెప్పారు. కరెంట్ ఎఫైర్స్ కాదని కరెంట్ చార్జీలపై చర్చించామన్నారు. రాజకీయంగా ఎలాంటి విశేషం లేదన్నారు. వంగవీటి రాధాకృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు ఓ రకంగా దూరంగా ఉంటున్నారు. ఆయన అమరావతి రైతులకు చురుగ్గా మద్దతు తెలిపారు. ఇటీవలి కాలంలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణలకు.. రంగా పేరుతో నిర్వహించే కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతున్నారు. ఎప్పుడైనా శుభకార్యాల్లో ఎదురుపడితే  తన మిత్రులైన వైఎస్ఆర్‌సీపీ నేతలు వల్లభనేని వంశీ,  కొడాలి నానిలతో మాట్లాడతారు. అలా మాట్లాడినప్పుడు కూడా ఆయన వైఎస్ఆర్‌సీపీలోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతుంది.


క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న వంగవీటి 


గతంలో తన హత్యకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అరప్పుడు ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించింది.కానీ వంగవీటి సెక్యూరిటీని తిరస్కరించారు. ఈ నెల 4వ తేదీన దివంగత నేత వంగవీటి రంగా జయంతి కార్య‌క్రమాన్ని భారీగా నిర్వ‌హించేందుకు రాధా రంగా మిత్ర మండ‌లి ఏర్పాట్లు చేస్తోంది.ఈ కార్య‌క్ర‌మాన్ని రాజ‌కీయాల‌కు అతీతంగా నిర్వ‌హిస్తున్నారు. వంగవీటి రంగాకు జనసేన అధ్యక్షుడు పవన్  కూడా నివాళులు అర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉందన్న పార్టీ మార్పు అనే చర్చ కూడా రాదని చెబుతున్నారు.


ఎవరు కలిస్తే ఆ పార్టీలో చేరుతారంటూ రూమర్స్ 


వంగవీటి రాధాకృష్ణ టీడీపీ తరపున చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో ఆయన ఎవరితో భేటీ అయినా ఆ పార్టీ లో చేరుతారన్న ప్రచారం చేసేస్తున్నారు. అయితే ఈ విషయంలో వంగవీటి రాధాకృష్ణ కానీ ఆయన అనుచరులు కానీ ఎలాంటి ప్రకటనలు చేయడంలేదు.