Good Morning CM Sir :  ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ డిజిటల్ ఉద్యమానికి సిద్ధమయింది. గత నెలలో రోడ్ల పరిస్థితిపై రివ్యూ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జూలై పదిహేనో తేదీ కల్లా రోడ్లుపై ఒక్క గుంత కూడా ఉండకూడదని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఎక్కడా నిధుల కొరత లేదన్నారు. అంతే కాదు నాడు - నేడు అంటూ ఫోటో ప్రదర్శన కూడా పెట్టాలన్నారు. ఖచ్చితంగా ఇదే అంశాన్ని హైలెట్ చేసేందుకు జనసేన పార్టీ 15వ తేదీ నుంచి డిజిటల్ ఉద్యమాన్ని చేయాలని నిర్ణయించుకుంది. 


జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు రోజుల పాటు ప్రతి రోజు ఉదయమే సీఎంకు విషయం తెలిసేలా గుడ్నార్మింగ్ సీఎం సార్ పేరుతో గోతులతో నిండిన ఫోటోలను పోస్ట్ చేయాలని పిలుపునిచ్చారు. "గోతుల మధ్య రోడ్డును వెదుక్కోవల్సి వస్తోంది - మీ ఊళ్ళో, మీ చుట్టు పక్కల రోడ్లు ఎంత దారుణంగా దెబ్బ తిన్నాయో.. ఆ రోడ్డు మీద వెళ్లేందుకు ఎంత ప్రయాస పడాల్సి వస్తోంది అనేది చెప్పే ఫోటోలు, వీడియోలు తీయండి. వాటిని #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి..." అని పవన్ కల్యాణ్ కార్యకర్తలకు వీడియో సందేశం ఇచ్చారు. 





ఏపీలో గత మూడేళ్లుగా రోడ్ల నిర్వహణను పట్టించుకోకపోవడంతో రహదారులు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. ఏటికేడు వాటికి మరమ్మతులు చేయకపోవడంతో పెరిగి పెద్దవైపోయాయి. ఇప్పుడు గోతుల్లోనే రోడ్డు ఉన్న పరిస్థితికి వచ్చింది. రోడ్ల సమస్యపై ప్రతీ సారి సమీక్ష చేసే సీఎం జగన్.. ఫలానా తేదీలోపు రోడ్లన్నీ బాగవ్వాలని అధికారులను ఆాదేశిస్తూ ఉంటారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంటుంది. 


గత ఏడాది కూడా జనసేన పార్టీ డిజిటల్ ఉద్యమం చేసి డెడ్ లైన్ పెట్టింది. కానీ రోడ్లకు మరమ్మతులను ప్రభుత్వం పూర్తి చేయలేదు. తర్వాత జనసైనికులు చాలా మంది శ్రమదానం చేశారు. పవన్ కల్యాణ్ కూడా రెండు చోట్ల రోడ్లు బాగు చేశారు. అయితే ఈ ఏడాది మరింత దారుణంగా పరిస్థితి మారింది. అదే సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీ కూడా నెరవేరడం లేదు.ఈ అంశాలను జనసేన బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది.