పవన్ కల్యాణ్‌ చేపట్టే రెండో విడత వారాహి యాత్ర షెడ్యూల్ వచ్చేసింది. వారాహి విజయయాత్ర పేరుతో ఇప్పటికే మొదటి విడతను పవన్ కల్యాణ్‌ గత నెలలో పూర్తి చేశారు. ఇప్పుడు రెండో విడత యాత్రను ఆదివారం నుంచి ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను జనసేన పార్టీ విడుదల చేసింది. 


జనసేన ట్వీట్ చేసినట్టుగా వారాహి విజయ యాత్ర రెండో విడత యాత్ర ఆదివారం (జులై 9న) సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం అవుతుంది. మొదట ఏలూరులో బహిరంగ సభ ఉంటుంది. అక్కడ పవన్ కల్యాణ్ ప్రజలను ఉద్దేశించి వారాహిపై నుంచి మాట్లాడనున్నారు. 
పదో తేదీ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జనవాణి కార్యక్రమం ఉంటుంది. స్థానికంగా ఉండే ప్రజల సమస్యలు తెలుసుకోనున్నారు. అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు ముఖ్య నాయకులు, వీర మహిళలతో పవన్ సమావేశం అవుతారు. పార్టీలో సమస్యలు, వచ్చే ఎన్నికల్లో గెలుపునకు చేపట్టాల్సిన వ్యూహాలపై వారితో చర్చిస్తారు. 






11వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు దెందులూరు నియోజకవర్గం ముఖ్య నాయకులతో మాట్లాడనున్నారు. ఈ భేటీలో వీరమహిళలు కూడా పాల్గొంటారు. సాయంత్రం ఐదు గంటలకు తాడేపల్లి చేరుకుంటారు పవన్ కల్యాణ్. అక్కడే రాత్రి బస చేస్తారు. 
12వ తేదీ సాయంత్ర ఐదు గంటలకు తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ ఉంటుంది. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఇప్పటికైతే జనసేన ముడు రోజుల షెడ్యూల్ మాత్రమే ప్రకటించింది. 


ఈ షెడ్యూల్ ను జూలై 6 మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చర్చించి ఖరారు చేశారు. ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులతో స్థానిక రాజకీయ పరిస్థితులపై పవన్‌ చర్చించారు. ఏలూరు నుంచి రెండో విడత యాత్ర చేపట్టాలని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు.