TDP Janasena :   చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలవడం ఆలస్యమవుతోంది. స్కిల్ కేసులో ఏ 37 అయినప్పటికీ..   ఆయన బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. మరో వైపు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పై తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. వచ్చే నెల ఎనిమిదో తేదీన రావొచ్చని చెబుతున్నారు.  మరో వైపు హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్  వెకేషన్ బెంచ్ మీదకు వెళ్లింది.   అందుకే ఇక ఆలస్యం చేయకుండా.. టీడీపీ, జనేసన సంయుక్తంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నయి.  టీడీపీ - జనసేన తొలి సమన్వయ కమిటీ భేటీ తేదీ ఖరారు చేసుకున్నారు.  ఈ నెల 23న రాజమండ్రిలో టీడీపీ-జనసేన తొలి సమావేశం జరుగుతుంది.  


ఉమ్మడి కార్యాచరణకు టీడీపీ, జనసేన రెడీ 


సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు లోకేశ్- పవన్ కళ్యాణ్ ల అధ్యక్షతన తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం అవతుంది.  ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, ఇరు పార్టీల సమన్వయంపై చర్చిస్తుంది.  ఇప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులను ప్రకటించిన ఇరు పార్టీలు.. ఇక రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నాయి. ఓ వైపు నారా భువనేశ్వరి .. చంద్రబాబు అరెస్ట్ కారణంగా చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చడానికి యాత్ర చేయబోతున్నారు. నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి యాత్ర చేయనున్నారు. లోకేష్ కూడా భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. 


సమన్వయ కమిటీల ద్వారా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం


 టీడీపీతో సమన్వయం కోసం జనసేన పార్టీ తరఫున సమన్వయ కమిటీని సైతం ఏర్పాటు చేశారు. అనంతరం టీడీపీ సైతం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. అటు జనసేన తరఫున ఐదుగురు సభ్యులు, ఇటు టీడీపీ నుంచి ఐదుగురు సభ్యులతో కో ఆర్డినేషన కమిటీని ఇరు పార్టీలు నియమించాయి. పొత్తుల ప్రకటన అయితే జరిగిపోయింది కానీ కలసి పని చేయడం ప్రారంభం కావాల్సిఉంది. చంద్రబాబు విడుదల కోసం చూస్తూడటం కన్నా.. ఉమ్మడి కార్యచరణ ప్రకటించి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.  ఇలాంటి తరుణంలో ఇరు పార్టీలు భేటీ కావాలని నిర్ణయించాయి. ఈనెల 23న రాజమహేంద్రవరం వేదికగా భేటీ కావాలని నిర్ణయించాయి.  రాజకీయ కార్యక్రమాలు మరింత వేగవంతం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కమిటీకి అధినేతలు దిశానిర్దేశం చేయనున్నారు.


సీట్ల సర్దుబాటు సహా అన్నింటిపైన ఓ స్పష్టతకు వచ్చ అవకాశం ! 


ఉమ్మడి కార్యచరణ, టికెట్ల సర్ధుబాటు, వైసీపీపై వ్యతిరేకంగాపోరాటం చేయాల్సిన అంశాలపై విధివిధానాలు, ఉమ్మడి మేనిఫెస్టో వంటి తదితర అంశాలపై ఇరు పార్టీలు ఇక వరుసగా సమావేశమయ్యే అవకాశం ఉంది.  వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడి కార్యాచరణతో పాటు క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం తీసుకోవాల్సిన చర్యలపై  నిర్ణయాలు తీసుకోనున్నారు.   ఇరువురు నేతలు సీట్ల పంపకాల వ్యవహారంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే చంద్రబాబు అరెస్ట్ అనంతరం టీడీపీ నేతలు ఆత్మస్థైర్యం కోల్పోయారు. వారిలో ఆత్మస్థైర్యం కోల్పోకుండా.. ఉమ్మడి భవిష్యత్ కార్యచరణపై ఓ ప్రకటన వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ పోటీ చేసే స్ధానాలు, జనసేనకు కేటాయించే స్ధానాలపై లోకేశ్-పవన్ కల్యాణ్‌ల మధ్య చర్చకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.  


దసరా తర్వాత వారాహి యాత్ర ప్రారంభించనున్న పవన్ 


నిజం గెలవాలి పేరుతో  భువనేశ్వరి.. భవిష్యత్ భరోసాకు  పేరుతో లోకేష్ ప్రజల్లోకి వెళ్తారు. అలాగే పవన్ కల్యాణ్ తన వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. మూడు పర్యటనలు.. సమన్వయంతో ఒకే సారి జరగనున్నాయి. అన్నింటలోనూ టీడీపీ , జనసేన క్యాడర్ పాలు పంచుకోనుంది. చంద్రబాబు విడుదలైన తర్వాత లోకేష్ యువగళం పాదయాత్ర మళ్లీ ప్రారంభిస్తారు.