Two States Poitics  :  రాజకీయాలకు రూల్స్ ఉండవు. రెగ్యూలేషన్లు అసలు ఉండవు. రాజకీయం అంటే రాజకీయం. విజయానికి అడ్డదారులుండవు. ఎలాగైనా గెలిచామా లేదా అన్నదే ముఖ్యం. ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థులపై ముందుగానే పైచేయి సాధించాలంటే.. రకరకాల వ్యూహాలను అమలు చేయాలి. ప్రధాన ప్రత్యర్థులపై అయితే కుల, మత, ప్రాంత వ్యూహాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా సంధిస్తున్నారు. అభివృద్ధి లేమి, అరాచక పాలన అంటూ అధికారంలో లేని పార్టీలు ప్రచారం చేస్తూంటాయి. అయితే మరి ఇతర పార్టీల సంగతేంటి ? రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికారం కోసం పోటీ పడే పార్టీలు కాకుండా తామున్నామంటూ ఇతర పార్టీలు బరిలో ఉన్నాయి ? వారి వల్ల జరిగే నష్టాన్ని పార్టీలు తగ్గించుకోవాలి. అందుకే ఆయా పార్టీలు కొత్త వ్యూహాల్మి అమలు చేస్తున్నాయి. ఏపీలో జనసేన పైన వైఎస్ఆర్‌సీపీ, తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీపై టీఆర్ఎస్ ఇలాంటి వ్యూహానే అమలు చేస్తున్నాయి. ఇతర పార్టీలకు దత్తత రాజకీయం చేస్తున్నాయని ముద్ర వేస్తున్నాయి. 


ఏపీలో పవన్‌ను దత్త పుత్రుడిగా ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్‌సీపీ !


ఆంధ్రప్రదేశ్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైన రాజకీయం చేస్తున్నారు. ఆయన అధికార పీఠం అందుకుంటారని ఎక్కువ మంది అనుకోవడం లేదు కానీ.. ఓ బలమైన ఫోర్స్ అని మాత్రం నమ్ముతున్నారు. గత ఎన్నికల్లో ఆరు శాతం వరకూ ఓట్లు వచ్చాయి. ఈ సారి పెరుగుతాయా.. తగ్గుతాయా అన్నది ఎవరికీ తెలియదు. కానీ ఆయన ప్రభావం వల్ల తమకు నష్టం జరుగుతుందని వైఎస్ఆర్‌సీపీ గట్టిగా నమ్ముతోంది. అందుకే ప్రజల్లో ఆయన పలుకుబడి తగ్గించేలా.. పవన్ కల్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంపై పవన్ కల్యాణ్ కూడా చాలా సార్లు మండిపడ్డారు. కానీ అదేదో బాగుందని.. ప్రజల్లోకి వెళ్తోందని వైఎస్ఆర్‌సీపీ నేతలు అదే పనిగా పవన్‌ను దత్తపుత్రుడని పిలుస్తున్నారు. 


తెలంగాణలో షర్మిలపై దత్తపుత్రిక ముద్ర వేస్తున్న టీఆర్ఎస్ !


తెలంగాణలో టీఆర్ఎస్ దత్తపుత్రిక నినాదాన్ని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు ఇచ్చింది. ఆ పార్టీ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి.. బీజేపీ దత్తపుత్రిక షర్మిల అని ప్రకటించారు. బీజేపీకి మేలు చేయడానికి వారి వ్యూహంలో భాగంగానే ఆమె తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టిందని ఆరోపిస్తున్నారు. అసలు తెలంగాణలో ఆమెకు పనేంటని.. ఏమైనా ఉంటే ఏపీలో చూసుకోవాలని చెబుతున్నారు. కేవలం బీజేపీతో కుమ్మక్కయి.. వైఎస్ కుటుంబం ఇలా తెలంగాణలో రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. బీజేపీ వదిలిన బాణమని.. టీఆర్ఎస్ నేతలు అదే పనిగా ఆరోపణలు చేస్తూనే.. దత్తపుత్రిక నినాదాన్ని తెరపైకి తెచ్చారు. 


వేరే పార్టీలతో "దత్తత" కలిపిస్తే  ఆ పార్టీలు బలహీనపడిపోతాయా ?


ఏపీలో జనసేనపైన, తెలంగాణలో వైఎస్ఆర్‌టీపీపైన ఇలాంటి దత్తత ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. ఇలా చేయడం వల్ల అక్కడ వైఎస్ఆర్‌సీపీ, ఇక్కడ టీఆర్ఎస్‌కు ఎలాంటి లాభం అన్న చర్చ సహజంగానే వస్తుంది. ఆ పార్టీల వల్ల తమకు నష్టం జరుగుతుందని భావించి.. వారి ప్రఛారాన్ని తగ్గించడానికే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పవన్ కల్యాణ్ బలపడితే ఆ మేరకు తమకు నష్టం జరుగుతుందని.. అదే ఆయన చంద్రబాబు కోసంపని చేస్తున్నారని ప్రచారం చేస్తే.. ఆయన క్యాడర్ కూడా తమ వైపు మొగ్గుతారని వైఎస్ఆర్‌సీపీ అంచనా. అదే సమయంలో షర్మిల పై బీజేపీ ముద్ర వేస్తే.. ఆమెకు ఓట్లేయాలనుకున్న వారు ఆగిపోతారని టీఆర్ఎస్ అంచనా వేస్తోందని అనుకోవచ్చు. 


 అధికారంలోకి వచ్చే లక్ష్యంతోనే జనసేన, వైఎస్ఆర్‌టీపీ రాజకీయాలు !


నిజానికి ఏపీలో జనసేన అయినా.. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అయినా అధికారం చేపడతామనే ధీమాతో ఉన్నాయి. చాన్స్ ఇవ్వాలని ప్రజల్ని కోరుతున్నాయి.  అయితే వారిని ప్రధాన ప్రత్యర్థులుగా భావించని అధికార పార్టీలు మాత్రం.. ఇతరులతో కలిపేందుకు శక్తివంచన లేకుండా దత్తత వ్యూహంతో రాజకీయాలు చేస్తున్నాయి. వీటిని ఎంత సమర్థంగా ఎదుర్కొంటే.. జనసేన, వైఎస్ఆర్‌టీపీలకు అంత మేలు, తిప్పి కొట్టకపోతే అధికార పార్టీల రాజకీయ వ్యూహంలో ఇరుక్కుపోయినట్లే.