ఏపీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా కానీ ఇప్పటి నుంచే అధికార-విపక్షాలన్నీ ఎన్నికల సమరంలో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు ‘కాపు’ రాజకీయం మొదలైంది. ఎన్నికలు వస్తున్నాయంటేనే చాలు కొత్త కొత్త విషయాలు తెర మీదకి వస్తాయి. 2014 ఎన్నికల టైమ్‌ లో ప్రత్యేక హోదా కీలకంగా మారడంతో టీడీపీ అధికారాన్ని అందుకొని చంద్రబాబు కొత్త రాష్ట్రానికి తొలి సీఎం అయ్యారు. 


2019 ఎన్నికల్లోనూ మళ్లీ ప్రత్యేకహోదానే పార్టీలకు ఆయువుపట్టుగా మారింది. అధికారాన్ని అందిస్తే ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం వైఖరి మారుస్తామని వైసీపీ అధినేత జగన్‌ చెప్పడంతో ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు. అయితే ఇప్పుడు 2024 అసెంబ్లీ ఎన్నికలకు ప్రత్యేకహోదా పక్కన పెట్టేసి రాజధాని, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై అన్నిపార్టీలు దృష్టి పెట్టాయని భావించారు. కానీ ఇప్పుడు ఆ లిస్ట్‌ లో మరొకటి కూడా చేరింది. అదే కాపు ఓట్లు. ఏపీ రాజకీయాల్లో కాపు ఓటర్లు కీలకం. 15శాతం ఓటు బ్యాంక్‌ ఉండటంతో వీరి మద్దతు అన్ని పార్టీలకు అనివార్యమైంది. అయితే ఇప్పటి వరకు కాపులకు ఏ పార్టీ ఏం చేసిందన్న చర్చ మొదలైంది.  గతకొన్నేళ్లుగా కాపు వర్గం రిజర్వేషన్‌ కోసం ఉద్యమాలు చేస్తోంది. అయితే ఇప్పటివరకు ఏ పార్టీ కూడా రిజర్వేషన్‌ కల్పించడంలో విజయం సాధించలేకపోయింది.


2017లో అప్పటి సీఎం చంద్రబాబు కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించినా కేంద్రం తిరస్కరించింది. వెనకబడిన తరగతుల కింద ఆతర్వాత జనరల్‌ కేటగిరిలోనూ 5 శాతం రిజర్వేషన్‌ కోసం టీడీపీ చేసిన ప్రయత్నాలకు సుప్రీంకోర్టు సైతం అడ్డుకట్టవేసింది. అప్పటి నుంచి కాపు రిజర్వేషన్‌ తీరని కలగా మారిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆ అంశాన్నే హైలెట్‌ చేస్తోంది కాపు వర్గం. చంద్రబాబు ఓటమికి కాపురిజర్వేషన్‌ అమలు కాకపోవడం వల్లేనన్న టాక్‌ ఉంది. అందుకే ఇప్పుడు వారిని తమవైపు తిప్పుకునేందుకు చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగానే కాపుసామాజిక వర్గానికి చెందిన జనసేన అధినేతని రంగంలోకి దింపారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పవన్‌ కల్యాణ్‌ కాపు ప్రస్తావన తరచూ తీసుకురావడమే కాకుండా వైసీపీ కాపు నేతలను టార్గెట్‌ చేస్తూ విమర్శలు-ఆరోపణలకు దిగుతున్నారు. జగన్‌ సర్కార్‌ కాపు సామాజిక వర్గానికి ఏం చేసిందో చెప్పాలని కూడా నిలదీశారు. అంతేకాదు జనసేన పార్టీ కాపు వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న వాదనలు కూడా ఉన్నాయి.


అటు టీడీపీ ఇటు జనసేనే కాదు బీజేపీ కూడా కాపు ఓట్ల కోసం కుస్తీ పడుతోంది. గత ఎన్నికల్లో జగన్‌ కి మద్దతుగా నిలిచిన కాపు వర్గాన్ని ఈసారి తమవైపు తిప్పుకునేందుకు కాపు రిజర్వేషన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది బీజేపీ. ఇప్పటికే ఆపార్టీ నేత కన్నాలక్ష్మీనారాయణ సీఎం జగన్‌ కి లేఖ కూడా రాశారు. విపక్షాలన్నీ కాపుజపం చేయడంతో అధికారపార్టీ అలర్ట్‌ అయ్యింది. ఇంతకుముందు ప్రభుత్వాలు చేయనివి జగన్‌ అధికారంలోకి వచ్చాక జరిగాయని గుర్తు చేస్తూ ఆపార్టీలోని కాపునేతలు జయహో బీసీ ఆత్మీయసమ్మేళనానికి పిలుపునిచ్చారు. కాపు నేస్తం పథకంతో మహిళలకు అందిస్తోన్న చేయూతతో పాటు అన్ని స్థాయిల్లోనూ కాపులకు ప్రాధాన్యం ఇస్తూ పదవులను కట్టబెడుతోన్న విషయాన్ని తెలిసేలా ఈ సమావేశంలో కాపు నేతలు వివరించనున్నారు. అంతేకాదు భవిష్యత్‌ లో కాపువర్గానికి జగన్‌ సర్కార్‌ ఏం చేయబోతోందన్న విషయాన్ని కూడా ప్రస్తావించనున్నారట. 2019ఎన్నికల్లో పశ్చిమగోదావరిజిల్లాలో 34 సీట్లు వైసీపీకి వచ్చాయంటే అందుకు కారణం కాపువర్గమేనన్న టాక్‌ ఉంది. అందుకే ఇప్పుడు ఆ ఓట్లని చీల్చేందుకు టీడీపీ-జనసేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని జగన్‌ సర్కార్‌ గుర్తించింది. దాన్ని అడ్డుకునేందుకే ఇప్పుడు జయహో బీసీ మహాసభని నిర్వహిస్తోందని రాజకీయవర్గాల్లో చర్చ. మరి ఈ సభ ఎవరికి అనుకూలంగా మారుతుందన్నది రానున్న ఎన్నికలు డిసైడ్‌ చేస్తాయి.