ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు. ఈ విషయం మంత్రివర్గ సహచరులతోనే నేరుగా చెప్పేశారు. అయితే వందకు వంద శాతం తొలగించడంలేదని కొంత మందిని మాత్రం కొనసాగిస్తానని తేల్చేశారు. ఇప్పుడు ఆ అదృష్టవంతులెవరు... కిరీటాలు కోల్పోయేదెవరు అన్నదానిపై చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్‌సీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి... ఎవరెవరికి స్థానం లభిస్తుందనేది చివరి వరకూ అంచనా వేయడం కష్టమే. కానీ ఎవరెవరు పదవులు పోగొట్టుకోబోతున్నారన్నది మాత్రం అంచనా వేయవచ్చు. జిల్లాల వారీగా చూస్తే
చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి సేఫ్ !
చిత్తూరు జిల్లా నుంచి ప్రస్తుతం ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒకరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరొకరు నారాయణస్వామి. పెద్దిరెడ్డి జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారు. ఏ ఎన్నిక జరిగినా ఆయనకే బాధ్యతలిస్తున్నారు. ఆయన గెలిపించి చూపిస్తున్నారు. కాబట్టి ఆయన పదవిని తప్పించే ఆలోచన సీఎం జగన్ చేయరు. అయితే మరో మంత్రి నారాయణ స్వామికి మాత్రం ఉద్వాసన తప్పదని చెప్పవచ్చు. ఆయన తన శాఖపై పట్టు సాధించలేకపోవడమే కాదు.. మాటలపై అదుపు కూడా ఉండదు. ఈ కారణంగా పదవి కోల్పోయే నేతల్లో ఆయన పేరు ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు.
కడప జిల్లాలో డిప్యూటీ సీఎంకు ఉద్వాసనే !
కడప జిల్లా నుంచి అంజాద్ బాషా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయనకు సామాజిక కోణంలో పదవి లభించింది. ఈ కారణంగా ఈ సారి కడప నుంచి ఇతరులకు చాన్సిచ్చి.. ముస్లిం వర్గాల నుంచి ఇతర జిల్లాల నుంచి మంత్రి పదవి కల్పించే అవకాశం ఉంది. కడప నుంచి సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్నందున మరోకరికి మంత్రి పదవి ఇవ్వలేదు. ప్రక్షాళనలో ఈ సారి కడప నుంచి రెడ్డి సామాజికవర్గానికే పదవి దక్కే అవకాశ ఉందని భావిస్తున్నారు.
కర్నూలు జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులకూ డౌటే !
కర్నూలు జిల్లా నుంచి ప్రస్తుతం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కార్మిక మంత్రి జయరాములు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జయరాములు పేకాట శిబిరాలు, ఇసుక దందా, ఈఎస్ఐ స్కాం నిందితుడి నుంచి కారు తీసుకోవడం వంటి ఆరోపణలతో చాలా కాలంగా సైలెంటయ్యారు. హైకమాండ్ కడా ఆయనను పక్కన పెట్టిందని తెలుస్తోంది. దీంతో ఆయనకు ఉద్వాసన ఖాయమని డిసైడవ్వచ్చు. అయితే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పిస్తారా అన్నదానిపై కొంత సస్పెన్స్ ఉంది. అయితే ఆర్థిక మంత్రిగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న బుగ్గన... తనకు పదవి వద్దని చెప్పినట్లుగా వైఎస్ఆర్‌సీపీలోనే ప్రచారం జరుగుతోంది. అదే నిజం అయితే ఆయనకూ ఉద్వాసనేనని అనుకోవచ్చు.
అనంతపురంలో కొత్త మంత్రులు ఖాయమే !
అనంతపురం జిల్లా నుంచి ప్రస్తుతం రహదారుల మంత్రిగా మూలగండ్ల శంకర్ నారాయణ ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పేరుకే మంత్రి కానీ సచివాలయంలో కనిపించింది కూడా తక్కువే. ఏపీలో రోడ్ల పరిస్థితులపై విమర్శలు వస్తున్నా ఆయన పట్టించుకోలేదు. రాజకీయంగా ప్రాధాన్యమున్న అనంతపురం జిల్లాలో ఈ సారి శంకర్ నారాయణను తప్పించి.. కొత్త మంత్రులను తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
నెల్లూరులో అనిల్ కుమార్‌కు పార్టీ బాధ్యతలు !
నెల్లూరు జిల్లాలో నిన్నామొన్నటి వరూ ఇద్దరు మంత్రులు ఉండేవారు. ఒకరు అనిల్ కుమార్.. మరొకరు గౌతం రెడ్డి. కానీ గౌతం రెడ్డి హఠాన్మరణం చెందారు. ఆయన ఉంటే.. ఆయనను కొనసాగిస్తారా లేదా అన్నది విశ్లేషించవచ్చుకానీ ఇప్పుడా చాన్స్ లేదు. కానీ అనిల్ కుమార్ పై అనేక వివాదాలు రావడంతో ఆయనను తప్పించడం ఖాయమని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరు కొత్త మంత్రుల నెల్లూరు జిల్లా నుంచి వస్తారని అంచనా వేస్తున్నారు.
ప్రకాశంలో ఇద్దరికీ పదవుల గండమే !
ప్రకాశం జిల్లా నుంచి ప్రస్తుతం సీఎం జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ మంత్రులుగా ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డికి పార్టీ బాధ్యతలు ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. ఆదిమూలపు సురేష్ సామాజికవర్గపు కోటాలో చోటు దక్కించుకున్నారు. మరొకరికి అవకాశం ఇవ్వనున్నారు.
గుంటూరులో మహిళా హోంమంత్రికి హోదా పోయినట్లే !
జగన్ మంత్రివర్గం ఏర్పడినప్పుడు గుంటూరు నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణారావులను మంత్రులుగా తీసుకున్నారు. అయితే మోపిదేవి ఎమ్మెల్యేగా గెలవలేదు. ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి మంత్రిని చేశారు. తర్వాత మండలిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుని ఆయనతో రాజీనామా చేయించి రాజ్యసభకు పంపారు. ఇప్పుడు గుంటూరు నుంచి ఒక్కరే మంత్రిగా ఉన్నారు. కానీ అవకాశాల కోసం చాలా మంది సీనియర్లు, జూనియర్లు ఎదురు చూస్తున్నారు. ఈ సారి సుచరితను తప్పించి ఇతరులకు చాన్సివ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
కృష్ణా జిల్లాలో ఇద్దరూ సేఫ్... కానీ
కృష్ణా జిల్లా నుంచి కొడాలి నాని, పేర్ని నాని మంత్రులుగా ఉన్నారు. వీరిద్దరూ సీఎం జగన్ కు అత్యంత విధేయులు. టీడీపీపై జగన్ కోరుకున్నట్లుగా విరుచుకుపడటంతో కొడాలి నాని ముందుంటారు. వైఎస్ ఫ్యామిలీకి తాను పెద్ద పాలేరునని పేర్ని నాని నిస్సంకోచంగా ప్రకటించుకున్నారు. పవన్ పై విరుచుకుపడటంలో ఆయన కీలక పాత్ర. ఈ కారణంగా వీరిద్దరూ కొనసాగింపు లభిస్తుందని భావిస్తున్నారు. కానీ కృష్ణా జిల్లా నుంచి పార్థసారధి లాంటి సీనియర్లు చాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
ప.గో జిల్లాలో ముగ్గురు మంత్రులకూ పదవీ గండమే !
ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు మంత్రులుగా ఉన్నారు. ఆళ్ల నానికి పార్టీ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. మిగతా ఇద్దరికీ బదులుగా కొత్త వారికి చాన్సివ్వనున్నారు.
తూ. గో జిల్లాలో కూడా అదృష్టవంతులు లేనట్లే !
తూ.గో జిల్లా నుంచి కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మంత్రులుగా ఉన్నారు. వీరిలో కన్నబాబుకు పార్టీ బాధ్యతలు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఇటీవలే మంత్రిగా చేపట్టారు. ఆయనప్పటికీ ఆయనకు బదలుగా కొత్తవారిని తీసుకోవడం ఖాయంగా కనిపిస్ోతంది.
విశాఖలో అవంతికి పదవి పోయినట్లే !
విశాఖ జిల్లా నుంచి ప్రస్తుతం మంత్రిగా అవంతి శ్రీనివాస్ రావు ఒక్కరే ఉన్నారు. ఆయన చుట్టూ చాలా వివాదాలున్నాయి. సెక్రటేరియట్ లో కనిపించిచాలా కాలం అయింది. ఆయనకు ఉద్వాసన ఖాయమని వైఎస్ఆర్‌సీపీలో ఎప్పటి నుండో ప్రచారం ఉంది.
విజయనగరంలో బొత్స ప్లేస్ సేఫ్ !
వైఎస్ఆర్‌సీపీలో అత్యంత సీనియర్ గా ఉన్న బొత్స సత్యనారాయణ పదవి సేఫ్ అని.. తెలుస్తోంది. అయితే డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణిని మాత్రం తప్పించి.. కొత్త వారికి చాన్సిచ్చే అవకాశం ఉంది.
శ్రీకాకుళంలోనూ కొత్త వారికే చాన్స్ !
శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం మంత్రులుగా ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు ఉన్నారు. వీరి హైకమాండ్‌కు విధేయులే కానీ.. కొత్త వారికి చాన్సివ్వాలన్న పాలసీలో భాగంగా ఇతర ఎమ్మెల్యేలకు చాన్సిచ్చే అవకాశం ఉందని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.
మొత్తం మీద సీఎం కాకుండా ఉన్న 25 మంది మంత్రుల్లో నలుగురు మాత్రమే తమ ప్లేస్ కాపాడుకునే అవకాశం ఇప్పటికి కనిపిస్తోంది.