నెల్లూరు మంత్రి, మాజీ మంత్రి మధ్య రాజకీయ రగడ తీవ్ర స్థాయికి చేరుడంతో సీఎం జగన్ జోక్యం చేసుకున్నారు. ఇద్దరు నేతల్ని పిలిచి మాట్లాడారు. పోటాపోటీగా సభలు పెట్టడమే కాదు ఫ్లెక్సీలు కూడా చించుకోవడంతో చివరికి జగన్ జోక్యం చేసుకోక తప్పలేదు.  ఇద్దరినీ జగన్‌  క్యాంపు ఆఫీస్‌కు పిలిపించారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై సీఎం జగన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం అనిల్‌ జగన్‌ను కలిశారు. మంత్రి కాకాణిపై చేసిన విమర్శలపై సీఎంకు అనిల్‌ వివరిచ్చినట్లు తెలుస్తోంది. కలిసి పని చేసుకోవాలని మీడియాకు ఎక్కి పార్టీ పరువును బజారున పడవేయవద్దని జగన్ వారిని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దానికి ఇద్దరు నేతలు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. 


అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్న సమయంలో తాను ఆయనకు ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదని వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని కాకాణి గోవర్ధన్ రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇటీవల దూకుడుగా మాట్లాడుతున్న అనిల్ కుమార్‌ను ఉద్దేశించి కూడా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు . కానీ అనిల్ కుమార్ మాత్రం తనకు మంత్రి పదవి వచ్చినప్పటి నుండి ఏదో విధంగా పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేలా ప్రకటనలు చేస్తున్నారని కాకాణి చెప్పినట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి అనిల్ కూడా సీఎం వద్ద తన వాదన వినిపించినట్లుగా తెలుస్తోంది. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఆనం రామనారాయణరెడ్డి తనను బలహీనపరచాలని చూస్తున్నారని దానికి.. కాకాణి మద్దతిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇద్దరు మాటల్ని ఆలకించిన సీఎం.. విభేదాల్ని సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. 


ముఖ్యమంత్రి దగ్గరకు ఇద్దరు నేతలు వెళ్లడానికి ముందే సజ్జల రామృష్ణారెడ్డి వారితో చర్చించారు. పార్టీ నేతలు బహిరంగంగా కలహించుకోవడం వల్ల విపక్షాలకు అడ్వాంటేజ్ అవుతోందని ఇలాంటి పరిస్థితుల్ని ముఖ్యమంత్రి ఏ మాత్రం సహించబోరని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇద్దరు నేతలు తమకు రాజకీయంగా కొన్ని విభేదాల ఉన్నాయే తప్ప వ్యక్తిగతంగా ఎలాంటి వివాదాలు లేని పార్టీ గెలుపు కోసం కలిసి పని చేస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 


ఒకరి నియోజకవర్గాల్లో .. మరొకరు వేలు పెట్టవద్దని సీఎం జగన్ ఇరువరికి సూచించినట్లుగా తెలుస్తోంది. మంత్రిగా అధికారిక కార్యక్రమాలను నెల్లూరులో పర్యటించినా అనిల్ కుమార్ యాదవ్‌ కు సమాచారం ఉండాలని ఆదేశించారు. అలాగే అనిల్ కుమార్‌ను సర్వేపల్లి నియోజకవర్గంలో వేలు పెట్టడం... పార్టీ నేతలతో గ్రూపులు కట్టడం వంటివి చేయవద్దని సూచించినట్లుగా చెబుతున్నారు.  దీనికి ఇరువురు నేతలు అంగీకరించారు. అయితే వీరి సయోధ్య ఎంత కాలం ఉంటుందన్నది వైఎస్ఆర్‌సీపీలోనే ఆసక్తికరంగా మారింది.