వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకం పూర్తయింది. పార్టీ పరంగా చూస్తే అందరూ "పాపం విజయసాయిరెడ్డి" అనే వాళ్లే. ఎందుకంటే పార్టీ పదవుల్లో ఆయన ప్రాధాన్యం ఒక్క సారిగాపడిపోయింది. ఉత్తరాంధ్రలో తిరుగులేని విధంగా పెత్తనం  చెలాయించిన స్థానం నుంచి ఉనికిలో ఉన్నాయో లేదో తెలియని అనుబంధ సంఘాలకు ఇంచార్జిగా పడిపోయారు. ఎక్కడా రీజనల్ కోఆర్డినేటర్ పదవి దక్కలేదు. గతంలో ఆయన చెలాయించిన అధికారం..  పొందిన ప్రాధాన్యంతో పోలిస్తే ప్రస్తుతం ఆయనకు వైఎస్ఆర్‌సీపీలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నట్లే అనుకోవచ్చు. నిజంగానే వైఎస్ఆర్‌సీపీలో ఆయనకు ప్రాధాన్యం తగ్గుతోందా ? జగన్‌తో గ్యాప్ పెరిగిందా ?


ఎన్నికలకు ముందు అంతా తానై నడిపించిన విజయసాయిరెడ్డి !


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు ఆ పార్టీ తరపున అందరికీ విజయసాయిరెడ్డి మాత్రమే ఎదురుగా కనిపించేవారు. పార్టీ అధ్యక్షుడు జగన్ అయినా ఏ విషయం అయినా విజయసాయిరెడ్డిని కలవమని చెప్పేవారు. విజయసాయిరెడ్డి అటు ఢిల్లీలో వ్యవహారాలను చక్క బెడుతూ ఇటు ఎన్నికలకు వైఎస్ఆర్‌సీపీని సన్నద్ధం చేయడానికి విస్తృతంగా శ్రమించేవారు. తెలంగాణలో నమోదైన కొన్ని కేసుల్లో టీడీపీని ఇరుకున పెట్టడానికి ఆయన చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. పార్టీ క్యాడర్‌ను ఎప్పటికప్పుడు సన్నద్ధం చేస్తూ వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పట్లో జగన్ వైఎస్ఆర్‌సీపీ మూల విరాట్ అయితే విజయసాయిరెడ్డి పూజారి పొజిషన్‌లో ఉండేవారు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించాలని అంటే విజయసాయిరెడ్డి కూడా అంగీకరించాలని అప్పట్లో వైఎస్ఆర్‌సీపీలో ఓ సెటైర్ వినిపించింది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు జగన్ మొదటగా అభినందులు తెలిపింది.. అందుకుంది .. విజయసాయిరెడ్డి నుంచే. వారి ఆత్మీయ ఆలింగనం ఫోటోనే బయటకు వచ్చింది.


ఎన్నికల తర్వాత ఉత్తరాంధ్రలో కీలక బాధ్యతలు !


వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇంచార్జ్‌గా ఉంటూ అక్కడి నుంచి కార్యకలాపాలు చక్కబెట్టడం ప్రారంభించారు. నిజానికి వైఎస్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జ్ గా ఆయన పదవి. ప్రభుత్వంతో సంబంధం లేదు. కానీ ఆయన ఉత్తరాంధ్ర పాలనను గుప్పిట్లో పెట్టుకున్నారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో వచ్చిన అనేక వివాదాలు.. చివరికి జగన్‌తో గ్యాప్ పెరగడానికి కారణం అయ్యాయన్న ప్రచారం ఉంది. ఉత్తరాంధ్రలో పార్టీ బాధ్యతలు ఎప్పటికీ తన కే ఉంటాయని అనుకున్నారేమో కానీ విజయసాయిరెడ్డి సొంత ఇల్లు, కార్యాలయం వంటి వి కూడా ఏర్పాటు చేసుకున్నారు . కానీ ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ మరోలా ఆలోచించింది. ఆయనకు ఏ ఒక్క జిల్లా బాధ్యతలు ఇవ్వకపోగా అనుబంధ సంఘాల ఇంచార్జ్ పదవితో సరిపెట్టింది.


ఇప్పుడు పార్టీలో ప్రభుత్వంలో సజ్జల హవా 


వైఎస్  జగన్ రాజకీయ సలహాదారుగా మొదట పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు తిరుగులేని స్థానానికి చేరుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు గతంలో విజయసాయిరెడ్డి తరహాలో జగన్ తర్వాత అధికార కేంద్రంగా మారారు. పార్టీ వ్యవస్థలపై మొత్తం పట్టు ఆయనదే. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో జిల్లా ఇంచార్జులతో పాటు రీజనల్ కోఆర్డినేటర్లకు కూడా ఆయనే సమన్వయకర్త. ఇప్పటికే ప్రభుత్వంలో ఆయన పోషిస్తున్న పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొత్తంగా జగన్ తర్వాత వైఎస్ఆర్‌సీపీలో అధికార కేంద్రం సజ్జల రామకృష్ణఆరెడ్డినే. నిన్నామొన్నటిదాకా ఆ స్థానాన్ని అనుభవించిన విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గిపోయింది.  వచ్చే జూన్‌లో ఆయన రాజ్యసభ పదవీ కాలం పూర్తవుతుంది. ఆయనకు మరోసారి చాన్స్ కల్పించకపోతే.. మరింత నమ్మకాన్ని విజయసాయిరెడ్డి కోల్పోయినట్లేనని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు భావిస్తున్నాయి.