7 MLAS No Ticket  :   వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు వైఎస్ఆర్‌సీపీ అధినేత, సీఎం జగన్ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అనేక సార్లు సర్వే కూడా నిర్వహించారు. గ్రాఫ్ బాగా పడిపోయిన ఎమ్మెల్యేలకు ఆయన నేరుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా ఆయన ఏడుగురు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు లేవని నేరుగా చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. వారి పేర్లు వైఎస్ఆర్‌సీపీ వర్గాలు బహిరంగంగానే చెబుతున్నాయి. వీరిలో ఇద్దరు తాజా మాజీ మంత్రులు ఉండటం కూడా కలకలం రేపుతోంది. 


వివాదాస్పద శైలితో ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న ఎమ్మెల్యేలకు గండం 


వివాదాస్పద ప్రకటనలతో హోరెత్తించే ఓ మాజీ మంత్రికి వచ్చే ఎన్నికల్లో చాన్స్ లేదని జగన్ నేరుగా చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు ఓ జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా కీలక బాధ్యతలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాను గెలిచి.. పార్టీని గెలిపించి మంత్రిని అవుతానని ఆయన అంటున్నారు. కానీ టిక్కెట్టే ఇవ్వడం లేదని సంకేతాలు అందడంతో ఆయన చుట్టూ ఉన్న నేతలు కూడా జారుకుంటున్నారు. కోస్తా జిల్లాలో వివాదాస్పద ప్రకటనలకు పెట్టింది పేరైన మరో ఎమ్మెల్యే..  వరుసగా గెలుస్తూ వస్తున్న మరో ఎమ్మెల్యేకూ సీటు లేదని హైకమాండ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. 


ఇప్పటిదాకా తిట్టినోళ్లు ఇక పొగుడుతారు - పవన్ ట్వీట్ వెనుక అసలు రాజకీయం ఏమిటి ?


కీలక నియోజకవర్గం నుంచి గెలిచిన రాజధాని ఎమ్మెల్యేకూ కష్టమే 


ఇక  రాజధాని ప్రాంతంలో ఓ ఎమ్మెల్యే విషయంలో జగన్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. అత్యంత కీలకమైన నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన పనితీరు నాసిరకంగా ఉండటంతో సీటిచ్చేది లేదని క్లారిటీ ఇచ్చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఉభయగోదావరి జిల్లాల నుంచి కూడా ఒకరికి ఈ మేరకు టిక్కెట్ లేదనే కన్ఫర్మేషన్ అందినట్లుగా తెలుస్తోంది. రాయలసీమలో కీలక నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ.. ఇటీవల కొన్ని వివాదాల్లో ఇరుక్కున్న  ఎమ్మెల్యేకూ క్లారిటీ ఇచ్చేశారు. మరో ఎమ్మెల్యే ఎవరన్నది క్లారిటీ రాలేదు. 


8 నెలల పాటు గడప గడపకు - 175 సీట్లు కష్టమేం కాదన్న సీఎం జగన్ !


ఇద్దరు మాజీ మంత్రులకూ నో టిక్కెట్స్


మొత్తంగా ఇప్పటి వరకూ ఏడుగురు ఎమ్మెల్యేలకు జగన్ ఇలా ఈ సారి పార్టీ కోసం పని చేయాలని.. పోటీకి ప్రయత్నించవద్దని ముందుగానే చెప్పినట్లయింది. ఇలా చెప్పడానికి కారణాలు ఉన్నాయని.. గ్రాఫ్ పడిపోతున్న ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేసినట్లుగా ఉంటుందని చెబుతున్నారు.