Minister Posts  : నాయకులకు మాట ఇవ్వడం వేరు.. ప్రజలకు ఇవ్వడం వేరు. నాయకులకు మంత్రి పదవులు ఇస్తామని అంతర్గతంగా హామీ ఇస్తారు. కానీ వారి నేతలకు మంత్రి పదవి ఇస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం అరుదు. సీఎం జగన్ అలా మంగళగిరి, చిలుకలూరిపేట నియోజకవర్గాల ప్రజలకు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థుల్ని గెలిపిస్తే అక్కడి నేతలకు మంత్రి పదవులు ఇస్తామన్నారు. కానీ రెండో విడతలోనూ వారికి పదవులివ్వలేదు. అంటే... జగన్ ఆ మాట మర్చిపోయినట్లే . ఇక వారికి మంత్రి పదవులు రానట్లే. 


ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆశ.. నిరాశ  !


2019 ఎన్నికల్లో  మంగళగిరి నియోజకవర్గంలో గట్టి పోటీ జరిగింది. టీడీపీ తరపున చంద్రబాబు కుమారుడు  నారా లోకేష్‌ పోటీ చేశారు. ఆయనపై  సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికే టిక్కెట్ ఇచ్చారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆళ్లను రామకృష్ణారెడ్డిని గెలిస్తే మంత్రిని చేస్తానని ప్రకటించారు. మంత్రిగా అధికారంలో ఉండి ప్రజలకు ఆళ్ల మేలు చేస్తారని చెప్పారు. ఆళ్ల రామకృష్ణారెడ్డిని మంత్రిని చేస్తారని అక్కడి జనం అనుకున్నారు. కానీ మొదటి సారి కేబినెట్ ఏర్పాటు చేసినప్పుడు ఆళ్ల పేరు వినిపించలేదు.  ఆళ్ల కూడా ఆశపడ్డారు. లోకేష్‌పైనే గెలిచానని తనకు ప్రాధాన్యం ఇస్తారనుకున్నారు. కానీ ఇవ్వలేదు. రెండో విడతలో చాన్స్ వస్తుందనుకున్నారు. కానీ  కనీసం పరిశీలనకు కూడా పేరును తీసుకోలేదు. 


మర్రి రాజశేఖర్‌ది మరింత విషాద రాజకీయం !
  
చిలుకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్  వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేయాల్సి ఉంది. కానీ అనూహ్యంగా విడదల రజనీని పార్టీలో చేర్చుకుని ఆమెకు టిక్కెట్ ఖరారు చేశారు.  ఆమెను గెలిపిస్తే మర్రి రాజశేఖర్‌కు మంత్రి పదవిని ఇస్తానని జగన్ ఎన్నికల ప్రచారంలో  ప్రజల సమక్షంలో ప్రకటించారు. ఎమ్మెల్యే టిక్కెటే ఇవ్వలేదు.. మంత్రి పదవి ఇస్తారా అని చాలా మంది అనుకున్నారు కానీ.. జగన్ మాట ఇస్తే తప్పరని..  మర్రి రాజశేఖర్ వర్గీయులు అనుకున్నారు. అక్కడ విడదల రజనీ గెలిచారు కానీ మర్రి రాజశేఖర్ మంత్రి కాలేదు. ఆమెనే మంత్రి అయ్యారు.  మర్రి రాజశేఖర్‌కు కనీసం ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు.  దీంతో చిలుకలూరిపేట నియోజకవర్గ ప్రజలు పాపం మర్రి రాజశేఖర్ అనుకుంటున్నారు . 


ఇక కేబినెట్‌లో మార్పులు ఉండకపోవచ్చు !


ఎన్నికల టీమ్‌గా జగన్ ప్రస్తుత మంత్రివర్గాన్ని ఖరారు చేసుకున్నారు. దీంతో  ఇక మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రకారం ఆళ్ల రామకృష్ణారెడ్డి , మర్రి రాజశేఖర్‌లకు ఇక అవకాశాలు దక్కకపోవచ్చు. ఎన్నికల్లో ఆళ్లకు ఎమ్మెల్యే టిక్కెట్ అయినా వస్తుంది కానీ.. మర్రి రాజశేఖర్‌కు ఇక చాన్స్ లేదని చెబుతున్నారు. అక్కడ విడదల రజనీకే మళ్లీ టిక్కెట్ ఇవ్వడం ఖాయమని మంత్రి పదవి ఇవ్వడం ద్వారా తేల్చేశారని అనుకోవచ్చు.