ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గంలోనూ పదకొండు మంది పాత మంత్రులు ఉన్నారు. వారిలో పేర్ని నాని, కొడాలి నాని , ఆళ్ల నాని, సుచరిత వంటి వారు లేరు. కానీ వివాదాల్లో ఇరుక్కున్న గుమ్మనూరు జయరాం వంటి వారితో పాటు శాఖలపై పూర్తి పట్టు సాధించలేకపోయారని విమర్శలు ఎదుర్కొంటున్న నారాయణస్వామి, ఆదిమూలం సురేష్ వంటి వారు మళ్లీ చోటు దక్కించుకున్నారు. ఈ పదకొండు మందికి మరోసారి చోటెలా దక్కించుకున్నారు..? తెర వెనుక ఏం జరిగింది ? 


బొత్స సత్యనారాయణ !


సీఎం జగన్మోహన్ రెడ్డి వంద శాతం మంత్రుల్ని మార్చేస్తామని చెప్పిన తర్వాత కూడా ఏ మాత్రం తొణుకుబెణుకు లేకుండా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ. తనను తొలగించడం సీఎంకూ అసాధ్యమేనని ఆయనకు గట్టి నమ్మకం. ఎందుకంటే ఉత్తరాంధ్ర రాజకీయాల మీద ఆయనకు ఉన్న పట్టు అలాంటిది . ఆయన తరచూ ఢిల్లీ పర్యటనలకు వెళ్తున్నారని ఓ వైపు రూమర్స్ షికారు చేశాయి. మరో వైపు ఆయనను రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారమూ జరిగింది. కానీ అవన్నీ  తేలిపోయాయి.  విజయనగరం జిల్లాలో ఇతర ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవి వద్దని బొత్సకే ఇవ్వాలని తేల్చేశారు. దీంతో జగన్‌కు మరో ఆప్షన్ లేకుండా పోయింది. 


సీదిరి అప్పలరాజు !


శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి మొదటి సారి గెల్చిన సీదిరి అప్పల్రాజు మత్స్యకార వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మోపిదేవిని రాజ్యసభకు పంపడంతో ఆయనకు బదులుగా సీదిరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. జగన్ మనసును చదివి దానికి తగ్గట్లుగా విపక్షాలపై విరుచుకుపడటం ఆయన నైజం. అందుకే జగన్ అభిమానాన్ని పొందారు. జగన్ కు మరో ఆత్మీయుడు పొన్నాడ సతీష్‌కు చాన్స్ వస్తుందని అనుకున్నా..  అప్పలరాజు తన స్థానాన్ని కాపాడుకోగలిగారు.


పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి !


మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలనుకున్న తర్వాత .. బొత్సతో పాటు జగన్ మోహన్ రెడ్డి సైతం పక్కన పెట్టలేరని భావించిన మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  చిత్తూరు, తిరుపతి, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాలపై ఆయనకు ఉన్న పట్టు అలాంటిది.  రాజకీయంగా బలవంతుడు కావడం వల్ల  జగన్ ఆయనను పక్కన పెట్టలేకపోయారు. 


ఆదిమూలపు సురేష్ !


ఆదిమూలపు సురేష్ పదవి దాదాపుగా ఊడిపోయింది. ఆయన కు బదులుగా అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామికి కేబినెట్ బెర్త్ ఖరారయింది. కానీ ప్రకాశం జిల్లా నుంచి ఇతరులకు చాన్స్ ఇవ్వకపోవడంతో ఒక్కరైనా మంత్రి ఉండాలన్న ఉద్దేశంతో మళ్లీ చివరి క్షణంలో ఆయన పేరు ను చేర్చారు. ఆయనకు జిల్లాల సమీకరణాలు కలసి వచ్చాయని అనుకోవచ్చు. 


కళత్తూరు నారాయణ స్వామి !


చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సన్నిహితునిగా రాజకీయాల్లోకి వచ్చారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి చాయిస్ ప్రకారమే మంత్రి పదవుల్ని ఖరారు చేశారు. రోజాకు మంత్రి పదవి ఇవ్వాలంటే  నారాయణస్వామిని కొనాగించాల్సిన పరిస్థితి సీఎం జగన్‌కు ఎదురయిందని చెబుతున్నారు.  ఆయనకు మంత్రి పదవి కొనసాగింపు కేవలం పెద్దిరెడ్డి వల్లేనని చిత్తూరు నేతలు విశ్లేషిస్తున్నారు. 


చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ!


శెట్టిబలిజ సామాజికవర్గం కింద రాజ్యసభకు వెళ్లిన పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో మొదటి సారి మంత్రి పదవి చాన్స్ దక్కించుకున్న చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఇప్పుడు ఆ స్థానాన్ని సామాజికవర్గ కోటాలోనే నిలబెట్టుకున్నారు. పదవి ఇచ్చి కొంత కాలమే కావడం... సామాజికవర్గం కలసి రావడంతో ఆయనకు మేలు జరిగింది. 


తానేటి వనిత !


తానేటి వనిత మంత్రి పదవి గల్లంతవుతుందని మొదటి నుంచి ప్రచారం జరిగింది. కానీ ఆమె అనూహ్యంగా తన పదవి నిలబెట్టుకున్నారు.  ప.గో జిల్లా రాజకీయ సమీకరణాలు ఆమెకు కలసి వచ్చినట్లుగా భావిస్తున్నరు. 


బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి !


ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మినహా మరెవరూ పని చేయలేరన్న అభిప్రాయం ప్రస్తుతం ఏపీలో ఉంది. అందుకే ఆయనకు కొనసాగింపు లభించినట్లుగా తెలుస్తోంది. 


గుమ్మనూరు జయరాం !


ప్రస్తుత మంత్రుల్లో వివాదాస్పద మంత్రిగా గుమ్మనూరు జయరాంకు పేరుంది. ఆయన కుమారుడు ఓ బెంజ్ కారును ఈఎస్ఐ స్కాం నిందితులనుంచి గిఫ్ట్‌గా తీసుకోవడం దగ్గర్నుంచి పేకాట శిబిరాల నిర్వహణ వరకూ ఆయనపై చాలా వివాదాలొచ్చాయి. ఆయన సచివాలయంలో కనిపించేది కూడా తక్కువ. శాఖపై సమీక్షలు చేసింది కూడా లేదు. ఆయినప్పటికీ రెండో సారి ఆయనకు అవకాశం కల్పించడానికి కారణం..కర్ణాటకుకు చెందిన బీజేపీ మంత్రి శ్రీరాములు అనే ప్రచారం ఉంది. ఆయన లాబీయింగ్‌తోనే రెండో సారి అవకాశం కల్పించారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. 


అంజాద్ భాషా !


మైనార్టీ వర్గం నుంచి అంజాద్ భాషాను తప్పించి ... మరో మైనార్టీ ఎమ్మెల్యేకు చాన్సిస్తారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే సీఎం జగన్ మాత్రం తన సొంత జిల్లా మైనార్టీ వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకే కొనసాగింపు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 


పినిపె విశ్వరూప్ !


పినిపె విశ్వరూప్ కూడా అనూహ్యంగా కొనసాగింపు మంత్రుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. జిల్లా, సామాజిక సమీకరణాలతో పాటు ఆయన కోసం ఓ కీలక నేత లాబీయింగ్ చేసినట్లుగా వైసీపీ వర్గాలుచెబుతున్నాయి.