KCR Emergency Meeting :  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు, మూడు రోజులుగా సీనియర్ నేతలతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు.    ఏఏ జిల్లాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏఏ నియోజకవర్గాల్లో ఎవరెవరికి విజయాశకాలున్నా యనే కోణంలో  కీలక నేతల నుంచి సమాచార సేకరణ జరిపారు. ఓ రకంగా అభ్యర్థుల్ని ఖరారు చేశారని చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలు ఉంటాయా లేదా అన్న సంగతి పక్కన పెట్టినా .. నవంబర్ , డిసెంబర్‌లో జరగనున్న ఎన్నికల కోసం అయినా ఇప్పటికే అభ్యర్థులపై ఓ అవగాహనకు రావాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఎక్కడెక్కడ కొత్త వారికివ్వాలో లిస్ట్ తయారు చేసి.. సామర్థ్యం ఉన్న నేతలకు ఇక నుంచి సంకేతాలివ్వనున్నట్లుగా తెలుస్తోంది.  


కొంత మంది సిట్టింగ్‌లకు నిరాశ  తప్పదు !


సిట్టింగ్‌లు అందరికీ సీట్లిస్తామని కేసీఆర్ చెప్పినప్పిటికీ కొంత మందికి మొండి చేయి చూపించక తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటి వరకూ చేయించిన సర్వేల్లో గట్టి పోటీ ఉన్నట్లుగా తేలిన నియోజవకర్గాలపై కేసీఆర్ స్వయంగా కసరత్తు చేస్తున్నారు.  ఆ స్థానాల్లో గట్టి అభ్యర్థులను  పెట్టడమే కాదు.. ఒకటికి రెండుసార్లు పర్యటించి గెలిపించుకోవాలని  వ్యూహం అమలు చేయబోతున్నట్లగాచెబుతున్నారు.  గెలుపే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గానికి వేర్వేరు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసి సాధ్యమైనంత త్వరలో పంపించాలని నిర్ణయించినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.   సీటు పక్కా అన్న అభ్యర్థులతో త్వరలోనే కేటీఆర్‌ అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ప్రగతి భవన్‌ ‘అత్యవసరం సమావేశాల’ వెనుక అసలు సీక్రెట్‌ ఇదేనని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


హ్యట్రిక్‌ విజయం సాధిస్తేనే జాతీయ రాజకీయాలపై ఆశలు !


పార్లమెంట్ కంటే ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ముందస్తుకు  వెళ్లినా వెళ్లకపోయినా తప్పదు.  ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌ విస్తరణ చేయాలంటే.. మూడో సారి గెలిచి తీరాలి.  ఇందులో భాగంగా బుధవారం రాత్రి కొన్ని గంటలపాటు మంత్రులు కేటీ-ఆర్‌, హరీష్‌ రావులతో ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ ప్రత్యేక భేటీ జరిగింది. ఈ అత్యవసర సమావేశంలో కొంతసేపటి తర్వాత పార్టీలోని ముఖ్యమైన నాయకులను పిలిపించుకుని విస్తృతంగా చర్చించారు. కేసీఆర్‌ ఇంత హడావుడిగా మీటింగ్‌ పెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ సమావేశం వివరాలు బయటకు పొక్కనీయలేదు. కానీ అభ్యర్థులను ఫైనల్ చేసే చర్చ జరుగుతోందన్న అభిప్రాయం మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది. 


ప్రచార వ్యూహంపైనా బీఆర్‌ఎస్‌ అత్యున్నత కమిటీ చర్చ


ఎన్నికల ప్రచార వ్యూహంపైనా బీఆర్‌ఎస్‌ హైకమాండ్ ఇప్పటికే ఓ ప్లాన్ రెడీ చేసుకుంది.  ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వాలి? ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టాలి? అనే దానిపై కూడా చర్చ సాగుతున్నట్లు- తెలుస్తోంది. ఇప్పటికే అమలులో ఉన్న రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛన్‌ లాంటి పథకాలపై మార్పులు చేయాలా? లేక వీటి స్థానంలో కొత్తవి తీసుకురావాలా? అనేదానిపై ఓ క్లారిటీకి వచ్చారు.  తెలంగాణ ప్రభుత్వం గడువు జనవరి 2024 వరకు ఉంది. అంటే సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించే ఛాన్స్‌ ఉంది. ఆరు నెలల ముందుగానే ఎన్నికలు జరిగితే.. ముందస్తు ఏం కాదనే వాదన కేసీఆర్ వినిపిస్తారు. ఆ ప్రకారం రెండు, మూడు నెలల్లో జరగాల్సి ఉన్న  కర్ణాటకతో పాటు ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందన్న చర్చకూడా నడుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో మొత్తంగా కీలక మార్పులు రానున్నట్లుగా అంచనా వేయవచ్చు.