నామినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాక ముందే వైసీపీ ఓ విజయం నమోదు చేసుకుంది. ఎన్నికలు జరగకుండానే ఓ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఓ స్థానాన్ని ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఎస్‌ మంగమ్మ ఎన్నిక ఏకగ్రీవమైంది. అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆమెను ఖరారు చేశారు. 


అనంతపురం జిల్లాలో నిన్నటి వరకు నిన్నటి వరకు నామినేషన్లు స్వీకరించారు. వచ్చిన నామినేషన్లను స్క్రూటినీ చేశారు. వాటిలో చాలా నామినేషన్లను సరైన వివరాలు లేవని తిరస్కరించారు. అలా తిరస్కరించిన వాటిలో టీడీపీ లీడర్‌ నామినేషన్ కూడా ఉంది. సరైన వివరాలు ఇవ్వలేదన్న కారణంతో టీడీపీ అభ్యర్థి వేలూరు రంగయ్యసహా పలువురు నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. 


నామినేషన్ల పరిశీలన తర్వాత ఒక్క మంగమ్మ నామినేషన్ మాత్రమే మిగిలింది. ఎన్నికల సంఘం చెప్పిన రూల్స్ ప్రకారం ఉన్న ఆ ఒక్క నామినేషన్‌ను మాత్రమే అధికారులు అంగీకరించారు. దీంతో పోటీగా అభ్యర్ధులు లేకపోవడంతో ఆమె ఎన్నికల లాంఛనం కానుంది. 
ప్రక్రియ పూర్తైన తర్వాత మంగమ్మ ఎన్నికను అధికారులు ప్రకటించనున్నారు. మరోవైపు నామినేషన్లు తిరస్కరణకు గురైన అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడాన్ని ఆ పార్టీ లీడర్లు తప్పుబడుతున్నారు. కావాలనే అధికారులు నామినేష్లు తిరస్కరించారని ఆరోపిస్తున్నారు. అధికారుల తీరుపై న్యాయస్థానాన్నిఆశ్రయిస్తామంటున్నారు టీడీపీ అభ్యర్థి రంగయ్య.