YSRCP Rajya Sabha members are also in BJP merger efforts :  తెలుగు రాష్ట్రాల రాజకీయాలు అనూహ్యమైన ములుపులు తిరుగుతున్నాయి. అధికారం కోల్పోయిన రెండు పార్టీలు బీఆర్ఎస్, వైఎస్ఆర్‌‌ససీపీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఓటమి భారీగా ఉండంట..భవిష్యత్ లో ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం ఖాయమని .. వరుసగా జరుగుతున్న పరిణామాలతో స్పష్టత రావడంతో ముందుగా సర్వైవల్ పాలిటిక్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో బాగంగానే బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనానికి సిద్ధమయ్యారని.. తర్వాత పార్టీ విలీనంపైనా చర్చిస్తారని అంటున్నారు. జాతీయ స్థాయిలో దీనిపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నప్పటికీ ఇంత వరకూ బీఆర్ఎస్ వైపు నుంచి స్పష్టత రాలేదు. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీతోనూ చర్చలు జరుగుతున్నాయని సీఎం జగన్ సడెన్  బెంగళూరు పర్యటన వెనుక ఈ సీక్రెట్ పాలిటిక్స్ ఉన్నాయని అంటున్నారు. 


బీజేపీ సైలెంట్ ఆపరేషన్ 


భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో సైలెంట్ ఆపరేషన్ నిర్వహిస్తోదని జరుగుతున్న పరిణామాలతో అర్థం చేసుకోవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.   ప్రజాదర్బార్ ప్రారంంభిస్తానని ఏర్పాట్లు కూడా చేసుకున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాలు నొప్పికి ట్రీట్ మెంట్ పేరుతో హడావుడిగా రాష్ట్రం నుంచి వెళ్లిపోయారు.  ఆయన అంత హడావుడిగా ఎందుకు వెళ్లిపోయారో వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు. కాలునొప్పి అన్నారు కానీ ఆయన ఎయిర్ పోర్టులోకి చకచకా వెళ్లిపోతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. జగన్ కు కాలు నొప్పి సమస్య ముందు నుంచీ ఉంది. ఆయన కాలుకు  పట్టీ ఉంటుంది. అయితే గతంలో తాడేపల్లిలోనే మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇతర వ్యక్తిగత వైద్యులు ఎప్పటికప్పుడు  చికిత్స అందిస్తూనే ఉంటారు. గతంలో ఎప్పుడూ ట్రీట్‌మెంట్ కోసం  బెంగళూరు వెళ్లలేదు. అందుకే తెర వెనుక ఏదో ఉందని వైసీపీ నేతలు కూడా ఆలోచిస్తున్నారు. 


వైసీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీతో చర్చలు జరుపుతున్నారా ?


బీజేపీకి ఇప్పుడు రాజ్యసభ సభ్యుల అవసరం ఉంది. ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా ఇతర పార్టీల మీద ఆధారపడాల్సిన ఉంది. తాజాగా నలుగురు సభ్యులు పదవీ విరమణ చేశారు. మళ్లీ ద్వైవార్షిక ఎన్నికలు జరిగే నాటికి బీజేపీకి పెరుగుతుంది. కానీ మెజార్టీ రాదు. ఇప్పుడు మెజార్టీ కోసం.. బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో వైఎస్ఆర్‌సీపీరాజ్యసభ పక్షం విలీనంపై చర్చలు జరుపుతోందని అంటున్నారు. వైసీపీకి పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అయితే ఎప్పుడూ బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ వెళ్లలేదు. అడగాల్సిన అవసరం కూడా లేదని మీ పార్టీ సభ్యులే అన్నట్లుగా భావించవచ్చని ఇటీవల కూడా సంకేతాలు ఇచ్చారు. కానీ బీజేపీ ఇప్పుడు అలా అనుకోలేకపోతోంది. అందుకే వైసీపీ రాజ్యసభ పక్షాన్ని విలీనం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో బయట రాష్ట్రాల వారే ముగ్గురు ఉన్నారు. మిగిలిన వారిలో వ్యాపారులు ఉన్నారు. అందుకే బీజేపీ అనుకుంటే విలీనంపెద్ద సమస్య కాదని అంటున్నారు. 


బీఆర్ఎస్ ఇప్పటికే ఒప్పందం చేసుకుందని ప్రచారం


బీఆర్ఎస్ పార్టీకి నలుగురు రాజ్యసభ సభ్యులు ఉంటే వారందరూ బీజేపీలో విలీనమయ్యేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయని ఇప్పటికే పుకార్లు ఊపందుకున్నాయి. బీఆర్ఎస్ అసలు ఖండించకపోవడంతో ఏదో ఉందన్న అభిప్రాయం అందరిలోనూ బలపడుతోంది. కేటీఆర్, హరీష్ రావు వారంరోజుల పాటు ఢిల్లీలో ఉండి వచ్చారు. ఎవరితో చర్చలు జరిపారో స్పష్టత లేదు కానీ.. వారి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత నుంచి విలీన చర్చలు ఊపందుకున్నాయి. ఈ లోపు వైసీపీ వైపు కూడా  అనుమానంగా చూడటం ప్రారంభమయింది. 


గతంలో టీడీపీ అనుసరించిన వ్యూహమే !


నిజానికి ఇలా రాజ్యసభ పక్షాన్ని విలీనం చేయడం అనే వ్యూహం టీడీపీది. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత ఒక్కరు తప్ప అందరూ బీజేపీలో విలీనమయ్యారు. తర్వాత చంద్రబాబు పార్టీని కాపాడుకున్నారు. ఇప్పుడు తిరుగులేని విజయంతో అధికారంలోకి వచ్చారు. ఆ కోణంలోనే ఇప్పుడు తమ రాజ్యసభ సభ్యుల్ని త్యాగం చేసి అయినా పార్టీని సర్వైవ్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారన్న గట్టి అభిప్రాయం ఏర్పడుతోంది. వచ్చే వారంలో చోటు చేసుకునే పరిణామాలు అత్యంత కీలకమని అనుకోవచ్చు.