Sharmila In TS Politics : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఆయన రాజకీయ వారసత్వాన్ని కుమారుడు జగన్ ఏపీలో కొనసాగిస్తున్నారు. తెలంగాణలో ఆ రాజకీయ వరసత్వాన్ని కొనసాగించడానికి షర్మిల ప్రయత్నిస్తున్నారు. రాజన్నబిడ్డగా రాజన్న రాజ్యం తీసుకు వస్తానని ఆమె రాజకీయ పార్టీ పెట్టి .. పాదయాత్ర ద్వారా ప్రజలను కలుస్తున్నారు. ఇప్పటికి దాదాపుగా రెండు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తయింది. ఇంకా పదిహేను వందల కిలోమీటర్ల వరకూ పాదయాత్ర చేయనున్నారు. అయితే షర్మిల తాను కోరుకున్నంతగా పార్టీని జనంలోకి తీసుకెళ్లగలిరా? అప్పట్లో రాజశేఖర్ రెడ్డిని ఆదరించినట్లుగా ఇప్పుడు షర్మిలను దగ్గరకు తీసుకుంటున్నారా ? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒకటిగా నిలబడగలిగిందా ?
వైఎస్ బిడ్డగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న షర్మిల !
వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. రెండు వేల కిలోమీటర్లు దాటిపోయింది. గత ఏడాది అక్టోబర్ 20న చేవెళ్ల నుంచి ప్రారంభం అయిన ప్రజా ప్రస్థానం ప్రారంభమయింది. మధ్యలో కరోనా కారణంగా.. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా… మరోసారి అమెరికా పర్యటన కారణంగా విరామం ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం,నల్గొండ జిల్లాలను ముగించుకొని మహబూబ్ నగర్ లో పాదయాత్ర చేస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైలుకు వెళితే తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అప్పట్లో షర్మిల పాదయాత్రకు విస్తృతమైన ప్రచారం లభించింది. కానీ ఇప్పుడు ఆ స్థాయిలో ప్రచారం లభించడం లేదు. ఓ రకంగా ఆమెను ప్రధాన మీడియా ఎవాయిడ్ చేసిందనుకోవచ్చు. అలాగే కొత్త పార్టీ కావడంతో సోషల్ మీడియాలోన ట్రెండ్ కాలేకపోతున్నారు. పాదయాత్రను పూర్తి చేసి రాజన్న బిడ్డంగా తెలంగాణలో .. రాజన్న రాజ్యం తెచ్చేలా ప్రజల్ని ఒప్పిస్తానని ఆమె నమ్మకంతో ఉన్నారు.
వైఎస్ స్టైల్‌లో అప్పుడప్పుడూ హైలెట్ అవుతున్న పాదయాత్ర !
షర్మిల అచ్చంగా తన తండ్రి పాదయాత్రను గుర్తుకు తెచ్చేలా ప్రజా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకుంటూ.. వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. చాలా చోట్ల సామాన్యులతో కలిసిపోతున్నారు. ఇటీవల ఓ పొలంలో రైతు కూలీకి గోరుముద్దలు పెట్టి.. తాను పెట్టించుకుని తింటున్న ఫోటోలు.. వీడియోలు వైరల్ అయ్యాయి. సామాన్యులతో సామాన్యురాలిగా ఉన్నారని చాలా మంది నెటిజన్లు అభినందించారు. ప్రతి మంగళవారం ఉద్యోగదీక్షలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. కొన్ని చోట్ల షర్మిల పాదయాత్రకు మంచి హైప్ వస్తోంది. కొన్ని చోట్ల పెద్దగా ఆదరణ ఉండటం లేదు.
రాజకీయంగా ఘాటు ప్రకటనలు !
షర్మిల తాను సీరియస్ రాజకీయ నాయకురాలినని చెప్పుకోవడానికి తన వంతు కృషి చేస్తున్నారు. ప్రజా సమస్యల విషయంలో సీఎం కేసీఆర్‌పై ఘాటుగా విరుచుకుపడుతున్నారు. అలాగే తనను అసభ్య పదజాలంతో విమర్శించిన మత్రి నిరంజన్ రెడ్డికీ కౌంటర్ ఇచ్చారు. షర్మిల ఘాటు వ్యాఖ్యలు .. విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇతర పార్టీల నేతలు అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఆమెను రాజకీయ నాయకురాలిగా లెక్కలోకి తీసుకోవడం లేదు. దాంతో ఆమెపై ప్రతి విమర్శలు చేయడం తక్కువగా ఉంది.
రాజకీయంగా షర్మిల తొలి అడుగులు వేస్తున్నారు. పాదయాత్ర ఎఫెక్ట్ ఎంత ఉంటుందనేది రాజకీయవర్గాలు ఇప్పుడే అంచనా వేయలేకపోతున్నాయి. అదే సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైఎస్ ఇమేజ్ అనేది ఏపీకే పరిమితమైంది. తెలంగాణలో ఎవరైనా గుర్తు పెట్టుకుంటారా లేదా అన్నదాని స్పష్టత లేదు. వైఎస్‌కు ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారో.. వారంతా షర్మిలను అభిమానించి ఓట్లుగా చూపిస్తే అదే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బలం అవుతుంది. అంతకు మించి కనీస బలం చూపుతారని ఇప్పటికైతే రాజకీయ పార్టీలు అంచనా వేయలేకపోతున్నాయి.