ముద్రగడ పద్మనాభం.. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనాలు సృష్టించిన పేరు. కాపు ఉద్యమ నేతగా రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నేత. గత కొన్నేళ్లుగా అడపాదడపా మినహా పూర్వ స్థాయిలో క్రియాశీలకంగా ఉండటం లేదన్న విశ్లేషణలు ఉన్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా ఆయన మళ్లీ ఫేమస్ అయిపోయారు.  ఆయనపై వరుస విమర్శలతో విరుచుకు పడుతూ లేఖాస్త్రాలు సంధిస్తున్నారు ముద్రగడ పద్మనాభం. ఇప్పటికే రెండు లేఖలు రాసిన ముద్రగడ యాత్ర పూర్తయ్యేలోపు మరికొన్ని సంధించడం ఖాయం అనే విశ్లేషణలు గట్టిగానే విపిస్తున్నాయి. అయితే ఈ లేఖల వెనుక ముద్రగడ అసలు ఆలోచన వేరే ఉంది అంటూ కౌంటర్లు కూడా అదే స్థాయిలో పేలుతున్నాయి. 


ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉత్సాహం కలిగించారని పవన్‌పై సెటైర్స్


ముద్రగడ పద్మనాభం గత కొన్నేళ్లుగా ఎన్నికలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. టీడీపీతో అయితే ఉప్పునిప్పులా ఉంటున్నారు ఆయన. జనసేనతో గతంలో సంప్రదింపులు జరిగినా అవి వర్కౌవుట్ కాలేదని తూర్పు గోదావరి జిల్లా రాజకీయాలు బాగా తెలిసిన వారు అంటుంటారు. అయితే వైసీపీతో మాత్రం కాస్త మెతక ధోరణిలో ఉంటారని అందరికీ తెలిసిన విషయమే. ఆ మధ్య రెండు లేఖలు రాసినా ఏదో బతిమాలినట్టు ఉందే కానీ ఎక్కడా డిమాండ్ చేసినట్టు కనిపించలేదు. 


వారాహి యాత్ర మొదలైన కత్తిపూడి నుంచే వైసీపీపై పవన్ వార్‌ సైరన్ మోగించారు. అయితే రెండు మూడు రోజులు సైలెంట్‌గా ఉన్న ముద్రగడ ఒక్కసారిగా స్పీడ్ అందుకున్నారు. కాకినాడ నడిబొడ్డున స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని విమర్శించడంతో ముద్రగడకు కోపం తన్నుకొచ్చిందని జనసేన విమర్శలు చేస్తోంది. ఈ విమర్శను రుజువు చేస్తూ తనకు ద్వారంపూడి ఫ్యామిలీకి సన్నిహిత సంబంధం ఉందని చెప్పేశారు. పనిలో పనిగా ద్వారంపూడి సవాల్‌ను కానీ తన సవాల్‌ను కానీ స్వీకరించాలని ఛాలెంజ్ చేశారు ముద్రగడ. కాకినాడలో పోటీ చెయ్యాలని పవన్‌ను కౌంటర్ చెయ్యడాన్ని జనసైనికులు తప్పు పడుతున్నారు.


పిఠాపురం ప్రస్తావన వెనుక కూడా వ్యూహం ఇదేనా ??


ఒకవేళ కాకినాడలో పోటీ చేసే ధైర్యం లేకుంటే పిఠాపురంలో తనపై పోటీ చేయాలని పవన్‌కు సవాల్ చేశారు ముద్రగడ. అయితే గత కొన్నేళ్లుగా ఎన్నికలకు దూరంగా ఉంటున్న ఆయన సడన్‌గా ఎలక్షన్స్‌లో పోటీ చెయ్యాలని సవాల్ విసరడానికి చాలా కారణాలే ఉన్నాయి అంటున్నారు పరిణామాలు గమనిస్తున్న వారు. పిఠాపురం అనేది ముద్రగడకు అత్యంత పట్టున్న ఏరియా. మరోవైపు పిఠాపురం నుంచే పవన్ పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు గత కొన్ని నెలలుగా సంకేతాలు వస్తున్నాయి. దీనితో పిఠాపురంలో పోటీ చెయ్యాలని తాజాగా ముద్రగడ సవాల్ చెయ్యడం ఏంటని వారు అంటున్నారు. 


ముద్రగడకు ఎన్నికల్లో వైసీపీ తరపున గానీ ఇండిపెండెంట్‌గా పోటీ చెయ్యాలని ఉందని టాక్ నడుస్తోంది. అయితే అది పవన్‌ కారణంగానే జరిగిందనే ఫీలర్‌ జనాల్లోకి వదలాలని ప్రయత్నిస్తున్నట్లు జనసేన చెబుతోంది. పవన్‌పై పోటీ చెయ్యాలని వైసీపీ నుంచి ప్రపోజల్ వచ్చేలా కూడా ప్లాన్ చేశారని మరో వాదన ఉంది. తాజాగా రాసిన లేఖతో ఈ ఆరోపణలు మరింత బలపడేలా ఉన్నాయి. దీనివల్ల గెలిస్తే పవన్‌పై గెలిచినట్లు క్రెడిట్ దక్కుతుంది. బిగ్‌ జెయింట్‌ను కొట్టారనే రికార్డు నిలిచిపోతుంది. ఓడిపోతే తనను కాపులు మోసం చేశారనే ఆరోపణ చెయ్యడానికి రెడీ అన్నట్టు పవన్ మద్దతు దారులు ఆరోపిస్తున్నారు.


ప్రజారాజ్యం నుండే మెగా ఫ్యామిలీ తో దూరం


2008-09లో ప్రజారాజ్యం ఏర్పడ్డ సమయం నుంచే ముద్రగడ మెగా సంబంధాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. చిరంజీవితో ముద్రగడ కలుస్తారని గోదావరి జిల్లాల్లో ఆ పార్టీ క్లీన్ స్వీప్ తథ్యం అని వార్తలు వచ్చాయి. కానీ ఆ రకం సంబంధాలు ఏర్పడలేదు. అయితే దీనికి కారణం ముద్రగడ పెట్టిన షరతులే అని అప్పట్లో ప్రజారాజ్యంలో గుసగుసలు వినిపించేవి. తూర్పు గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక తన చేతిలో ఉంచాలని ముద్రగడ కోరారని, దానికి చిరంజీవి నో చెప్పారని టాక్. అందుకే అప్పటి నుంచి మెగా ఫ్యామిలీతో ముద్రగడకు వైరం మొదలైందంటున్నారు. 


పవన్‌కు, జనసేనకు అనుకూలంగా యూట్యూబ్ ఛానల్స్‌, సోషల్ మీడియాలో విశ్లేషణలు చేసేవాళ్లు ఇవే ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ సమయంలో తనను, తన కుటుంబాన్ని పోలీసులు అరెస్ట్ చేస్తే పవన్ మద్దతు ఇవ్వలేదని కోపం కూడా ఉందట. అందుకే అవకాశం చూసుకుని పవన్‌పై యుద్ధం మొదలెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగన్ vs జనసేనానిగా మొదలైన వారాహి యాత్ర ఇప్పుడు ముద్రగడ vs పవన్ కల్యాణ్‌గా మారిపోయిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీని అంతిమ రూపం ఎలా ఉంటుందో అన్న ఇంట్రస్టింగ్ చర్చ కూడా జోరుగా  సాగుతోంది.