Congress Sharmila Politics : వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఎక్కువ మంది ఆమె ఎపీ కాంగ్రెస్ లో అయితే ఉపయోగం అని విశ్లేషిస్తున్నారు. కానీ షర్మిల మాత్రం తెలంగాణలోనే రాజకీయం చేస్తానంటున్నారు. ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత రాజకీయాల్లో స్పష్టమైన మార్పులొచ్చాయి. ఏ పార్టీ కూడా రెండు రాష్ట్రాల్లో బలంగా లేదు. తెలుగుదేశం కూడా ఏపీకి పరిమితమయింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పరిమితమయింది. ఏపీలో పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది. ఆంధ్రా రాజకీయాలపై తెలంగాణ ప్రజలు ఆసక్తి చూపించడం లేదు. ఏపీలోనూ అంతే. ఏపీ రాజకీయ నేతలపై తెలంగాణ ప్రజలు ఆసక్తి కూడా కోల్పోయారు. అలాంటి సందర్భంలో షర్మిల పార్టీ పెట్టారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా ఆమె ఓ ఫోర్స్ గా మారారని మాత్రం ఎవరూ అనుకోవడం లేదు. ల
కనీస బలం సంపాదించుకోలేకపోయిన షర్మిల పార్టీ
షర్మిల పార్టీ పెట్టిన తర్వాత ఎ ఎన్నికలనూ పోటీ చేయలేదు. కొన్ని ఉపఎన్నికలు వచ్చినా సైలెంట్ గానే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు, మూడు శాతం ఓట్లకే పరిమితమైతే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎవరూ గుర్తించడానికి కూడా అంగీకరించరు. అదే జరిగితే షర్మిల చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతాయి. మొదట్లో షర్మిల బీజేపీ వదిలిన బాణం అనుకున్నారు. కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత అందరితో పాటు ఆమె కూడా మారిపోయారు. నిజానికి అందరి కంటే వేగంగాఆమె స్పందించారు. ఇలా ఫలితాలు వస్తున్న సమయంలోనే బెంగళూరులో డీకే శివకుమార్ తో సమావేశం అయ్యారు. తన సమావేశం గురించి తానే స్వయంగా బయట పెట్టారు. తర్వాత శివకుమార్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరోసారి కలిశారు. శివకుమార్ కు వచ్చే ఎన్నికల్లో దక్షిణాది తరపున కాంగ్రెస్ బాధ్యతలు ఇస్తున్నట్లుగా ప్రచారం జరగడంతో.. షర్మిల ప్రయత్నం అంతా కాంగ్రెస్ పార్టీతో జత కట్టడానికేనన్న వాదన బలపడింది.
వైఎస్ వారసురాలిగా ఏపీలో మంచి అవకాశాలు
అయితే తన పార్టీని షర్మిల విలీనం చేయనే చేయనని అంటున్నారు. వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది విలీనం చేయడానికి కాదని వాదిస్తున్నారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం చీర, సారె పెడతాం.. ఏపీకి వెళ్లిపోవాలని ఆయన సలహా ఇస్తున్నారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ పార్టీదే. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో వ్యక్తిగత ఇమేజ్ పెంచుకున్నారు. ఆ ఇమేజ్ ద్వారా జగన్ సొంత పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు అదే వైఎస్ కుటుంబం నుంచి షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఓటు బ్యాంక్ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి అవకాశం ఉంటుంది. షర్మిల రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా.. కాంగ్రెస్ పార్టీ నేతగా మళ్లీ ప్రజల్లోకి వెళ్తే.. వారంతా ఆదరించే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు వైసీపీ ఓటు బ్యాంక్ అంతా మళ్లీ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. షర్మిల అసలైన వారసురాలిగా ఏపీలో నిలబడతారన్న అంచనాలు ఉన్నాయి.
వచ్చె ఎన్నికల తర్వాత ఏదైనా జరగొచ్చు !
కుటుంబపరమైన ఒప్పందాలో లేకపోతే తెలంగాణనూ పట్టు సాధించగలమన్న కాన్ఫిడెన్సో కానీ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారు. తెలంగాణలో రాజకీయ భవిష్యత్ లేదని తేలిన మరుక్షణం ఆమె తెలంగాణను పట్టుకునే వేలాడతారన్న గ్యారంటీ ఏమీలేదని చెబుతున్నారు. రాజకీయ నేతల లక్షణమే అదని అంటున్నారు. తెలంగాణలో రాజకీయ భవిష్యత్ లేదని తేలిన మరుక్షణంలో ఏపీలో షర్మిల రాజకీయ ప్రస్థానం ప్రారంభమయ్యే అవకాశం ఉండొచ్చు. ఇంతకు ముందే షర్మిల భర్త అనిల్ కొంత మేర గ్రౌండ్ వర్క్ కూడా చేశారు.