Kesineni Nani TDP Politics :  విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ వేరే అభ్యర్థిని నిలబెడుతుందని ఈసారికి టిక్కెట్ లేదని సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి హైకమాండ్ స్పష్టత ఇచ్చింది. పార్టీ వ్యవహారాల‌్లో పెద్దగా జోక్యం చేసుకోవద్దని కూడా సలహా ఇచ్చింది. నిజానికి టీడీపీ హైకమాండ్ ( Tdp High Command ) ఇలా ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు ఎవరికీ చెప్పదు. కానీ కేశినేని నానికి మాత్రం చెప్పింది. ఈ అంశం పార్టీలో కలకలం రేపుతోంది. తిరువూరు సభ బాధ్యతను పార్టీ కేశినేని చిన్నికి ( Kesineni ChinNi ) ఇచ్చిన తర్వాత అక్కడ సభ ఏర్పాట్లపై కేశినేని చిన్న నిర్వహించిన సమావేశానికి నాని వెళ్లారు. అక్కడి విషయాలు పరిధి దాటిపోయాయి. దీంతో ఏదో ఒకటి తేల్చకపోతే ఇలాంటి సమస్యలు పెరిగిపోతాయన్న ఉద్దేశంతో వెంటనే టీడీపీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. 


కేశినేని నానిని టీడీపీ ఎందుకు వద్దనుకుంటోంది ?


కేశినేని నాని వ్యవహారశైలిపై మొదటి నుంచి టీడీపీ హైకమాండ్‌కు అసంతృప్తి కలిగిస్తూనే ఉంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు.. చంద్రబాబు మాటలను కూడా పట్టించుకోకపోవడం వంటివి హైలెట్ అయ్యాయి. కేశినేని ట్రావెల్స్ వ్యాపారాన్ని మూసివేసే విషయంలో ఆయన వ్యవహరించిన తీరు చంద్రబాబును నొప్పించిందని చెబుతారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఉద్యమాల సమయంలో ఆయన పని తీరుతో చంద్రబాబు అలాంటి మైనస్‌లను పక్కకు పెట్టి టిక్కెట్ కేటాయించారు. అయితే పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన తీరు మరింత మైనస్ అయింది. పలుమార్లు చంద్రబాబుకు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఓసారి ఢిల్లీలో పూలబొకే ఇవ్వమని చెప్పినా విసిరికొట్టారు. మీడియాలో అలాంటివి చాలాసార్లు హైలెట్ అయ్యాయి. అయితే పార్టీ పరంగా ఆయనను ఎప్పుడూ దూరంగా ఉంచలేదు. కేశినేని వ్యవహారశైలి తీవ్రంగా వివాదాస్పదమయినప్పుడే నాని ఇంటిలో ఆయన కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో సహా హాజరయ్యారు. ఆ తర్వాత  టీడీపీలో ఆయన సోదరుడు కేశినేని శివనాథ్‌ను ప్రోత్సహించడంతో ఆయన మరింతగా ఫైర్ అవుతున్నారు. మధ్యలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ చెప్పారు. ఇవన్నీ ఆయనకు మైనస్‌గా మారాయి. 


లోకేష్‌తో పూర్తిగా దూరం 


చంద్రబాబుపై సానుకూలంగా ఉన్న కేశినేని నాని లోకేష్ నాయకత్వాన్ని పూర్తిగా విస్మరించారు. ఆయన గురించి అసలు ఎప్పుడూ మాట్లాడ లేదు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు కూడా స్పందించలేదు. లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్రకు సైతం పార్లమెంట్ సభ్యుడుగా ఉన్న కేశినేని నాని హజరు కాలేదు. తెలుగు దేశం పార్టీకి ఉన్నదే ముగ్గురు పార్లమెంట్ సభ్యులు. అందులో బెజవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని ఒకరు. అయితే ఆయన వ్యవహర శైలి పార్టీకి మొదటి నుంచీ తలనొప్పిగానే మారింది. ఏకంగా లోకేష్ నిర్వహించిన యువరగళం పాదయాత్రకు కనీసం ముఖం కూడా చూపించ లేదు. ఎన్టీఆర్ జిల్లా పరధిలో జరిగిన యాత్రలో పార్లమెంట్ సభ్యుడి హోదాలో ఉన్న కేశినేని నాని అసలు పాల్గొనకపోవడంపై టీడీపీలో విస్తృత చర్చ జరిగింది.  కనీసం పలకరింపుగా కూడా ఆయన వెళ్లలేదు. పాదయత్ర, లోకేష్, యువగళం వంటి పేర్లు నాని నోటి వెంట రాలేదు. తర్వాత చంద్రబాబు నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమం విజయవాడలో జరిగిన సమయంలో కూడా కేశినేని నాని దూరంగా ఉన్నారు. ఇలా వరుసగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, కొన్ని కార్యక్రమాల్లో అధికార పార్టీకి చెందిన నాయకులతో కలసి పాల్గొనటం, అధికారులను వెంట పెట్టుకొని నాని ముందుకు వెళ్ళటంపై అనేక చర్చలు జరిగాయి. 


పార్టీ కన్నా తానే ఎక్కువ అన్నట్లుగా ప్రకటనలు చేసిన నాని 
 
సాధారణంగా పార్టీలో జరిగే కార్యక్రమాల్లో కీలక నేతలు ముందుండి నడిపించటం ఆనవాయితీ. ఇప్పుడున్న రాజకీయ పరిస్దితుల్లో  పార్లమెంట్ సభ్యుడికి ప్రత్యేక స్దానం ఉంటుంది. పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడిగా ఉండి కూడా పార్టీలో చంద్రబాబు తరువాత స్దాయి ఉన్న లోకేష్ నిర్వహించిన పాదయాత్రలో కేశినేని నాని హజరు కాకపోగా.. పార్టీ కార్యక్రమాలను సరిగ్గా నిర్వహించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. యువగళం పాదయాత్రను టీడీపీ ఎంత సీరియస్‌గా తీసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి కార్యక్రమాన్ని పట్టించుకోకపోతే ఇక ఆయనకు విలువ ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉంటుందని టీడీపీ పెద్దల్లో చర్చ జరిగింది. అదే సమయంలో తాను పార్టీ ద్వారా గెలవలేదని.. తన వ్యక్తిగత ప్రాబల్యంతోనే గెలిచానని ఆయన పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇవన్నీ ఆయనపై టీడీపీలో వ్యతిరేకత పెంచాయన్న భావన వ్యక్తమవుతోంది. 


లోకేష్‌తో కేశినేని నానికి ఎక్కడ చెడింది ? 
 
 నారా లోకేష్ తో కేశినేని నానికి విభేదాలు అనేది ఇప్పటివి కావని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలోనే ఇద్దరి మధ్య గ్యాప్ మొదలైందని అంటున్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో తలెత్తిన వివాదం కాస్త, తీవ్ర విభేదాలకు దారి తీసిందని అంటున్నారు. ఆ సమయంలో కేశినేని నాని ఎవరి మాటా వినలేదు. తన కుమార్తెను స్వయంగా మేయర్ అభ్యర్థిగా ప్రకటించేసుకుని తానే అభ్యర్థుల్ని ఖరారు చేసుకుని రంగంలోకి దిగారు. తానే గెలిపిస్తానని.. టీడీపీ జెండాలు కూడా అక్కర్లేదన్నట్లుగా వ్యవహరించారు. ఈ కారణంగా ఇతర టీడీపీ నేతలెవరూ కలిసి రాలేదు. బుద్దా వెంకన్న, నాగుల్ మీరా వంటి నేతలు ఎంపీ నానికి వ్యతిరేకంగా పని చేయటం వలన కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలో లోకేష్ మాటల్ని కూడా కేశినేని నాని లెక్క చేయకపోవడంతో పరిస్థితి ఇక్కడి వరకూ వచ్చిందని అంచనా వేస్తున్నారు. 


కేశినేని నానికి మూడోసారి టిక్కెట్ నిరాకరించడానికి కచ్చితంగా లోకేషే కారణమని.. ఎంపీ సన్నిహిత వర్గాలు కూడా గట్టిగా నమ్ముతున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.